సాంస్కృతిక నృత్యాల పేరుతో రికార్డింగ్ డ్యాన్స్‌లు
టీడీపీ నేతలు కోరితే అనుమతులు
మిగిలిన వారడిగితే పోలీస్ యాక్ట్ 30 అంటూ అభ్యంతరం
ఆత్మకూరు: ఎన్నికల వేళ పోలీస్ వ్యవస్థ మరీ బరితెగించింది. అధికారం కోసం తల్లడిల్లుతున్న టీడీపీ నేతలు సాగించే అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. ఓ వైపు ఎన్నికల కోడ్‌తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. ఈ తరుణంలో గ్రామాల్లో ఉత్సవాల పేరిట అశ్లీల నృత్యాలతో టీడీపీ నేతలు అశాంత వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. ఆత్మకూరు, మర్రిపాడు, ఏఎస్‌పేట ప్రాంతాల్లో దైవ ఉత్సవాల్లో ఆధ్యాత్మికం మాటున అశ్లీల నృత్యాలను టీడీపీ నేతలు నిర్వహిస్తున్నారు. దశాబ్దాల క్రితమే నిషేధించిన అశ్లీల నృత్యాలు (రికార్డింగ్ డ్యాన్స్‌లు)కు ఆత్మకూరు డివిజన్ పోలీస్ యంత్రాంగం అధికారికంగా అనుమతులిస్తోంది.
సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతులివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరినా ససేమిరా అంటున్న పోలీసులు.. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే అశ్లీల నృత్యాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు మండలం ఆరవేడు జంగాలపల్లిలో రాములోరి ఉత్సవాల ముగింపు సందర్భంగా సాంస్కృతిక నృత్యాలకు శుక్రవారం రాత్రి అనుమతులు పొందిన టీడీపీ వారు అర్ధరాత్రి సమయంలో అశ్లీల నృత్యాలు వేశారని గ్రామస్తులు తెలిపారు. గడిచిన వారం వ్యవధిలో ఏఎస్‌పేట మండలం గుంపర్లపాడు, అక్బరాబాద్, తెల్లపాడు గ్రామాల్లో అశ్లీల నృత్యాలను విచ్చలవిడిగా వేశారని గ్రామస్తులు ఆరోపించారు. తెల్లపాడులో గ్రూప్ డ్యాన్స్‌లను విచ్చలవిడిగా చేశారని, దీనిపై పోలీసులకు ఫోన్ చేస్తే పూర్తి స్థాయిలో సిబ్బంది లేరని సమాధానం చెప్పారని గ్రామస్తులు పేర్కొన్నారు.
గుంపర్లపాడులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను అడ్డుకొని విద్యుత్ వైర్లు, ఫ్యూజ్ లింకులను సైతం పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మరుసటి రోజు టీడీపీ ఆధ్వర్యంలో అర్ధరాత్రి నిర్వహించిన అశ్లీల నృత్యాలపై సమాచారం పోలీసులకు తెలియదానని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ విషయమై ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డిని సంప్రదించగా.. పోలీస్ యాక్ట్ 30, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో నృత్య ప్రదర్శనలకు అనుమతులివ్వడంలేదని చెప్పారు. పలు గ్రామాల నుంచి నిర్వాహకులు అనుమతులు కోరిన మాట వాస్తవమేనని, అయితే ఎవరికీ మంజూరు చేయలేదన్నారు. గ్రామాల్లో మైకుల్లేకుండా ఇలాంటి డ్యాన్స్‌లను నిర్వహిస్తున్నారనే విషయమై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment