విద్యవంచకల్పగణపతి అలంకారంలో రాజరాజేశ్వరి అమ్మవారు
సాక్షి, నెల్లూరు : ఆషాఢమాస శుక్రవారాన్ని పురస్కరించుకొని రాజరాజేశ్వరి అమ్మవారు శాకంబరి అలంకారంలో నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అమ్మవారు శ్రీవిద్యవంచ కల్పగణపతి అలంకారంలో ఫల, కాయగూరలతో భక్తులను కటాక్షించారు. రాహుకాల పూజలు, రాజరాజేశ్వరి అమ్మవారు శాకంబరిగా దర్శనమివ్వడంతో దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు అమ్మవారికి సహస్రనామార్చనలు, చండీహోమం, ఖడ్గమాల స్తోత్రపారాయణం, తదితర పూజలను నిర్వహించారు.
అనివెట్టి మండపాన్ని ఫల, కాయగూరలతో సుందరంగా తీర్చిదిద్దారు. బెంగళూరు, చెన్నై, విజయవాడ, తదితర ప్రాంతాల నుంచి సుమారు ఐదు టన్నులకుపైగా ఫల, కాయగూరలతో అమ్మవారిని, ఆలయాన్ని తీర్చిదిద్దారు. రాజరాజేశ్వరి అమ్మవారి భక్తబృందం ఆధ్వర్యంలో కోలాటాలు, నృత్య ప్రదర్శనలను వేడుకగా నిర్వహించారు. సుమారు మూడువేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శాకంబరి అలంకారానికి ఉభయకర్తలుగా కొలపర్తి వెంకట రమేష్‌కుమార్, సువర్ణలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఈఓ వెండిదండి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.
పట్టువస్త్రాల సమర్పణ
శాకంబరి అలంకారం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ కార్యాలయ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఎమ్మెల్యే తరఫున రాజరాజేశ్వరి అమ్మవారు, దేవస్థాన ప్రాంగణంలోని మీనాక్షి సుందరేశ్వరస్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనాలను అందజేశారు.
రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి, చెక్కా సాయిసునీల్, మురళీకృష్ణయాదవ్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment