ఎమ్మెల్యే కోటంరెడ్డికి షాక్‌.. గట్టి ఎదురుదెబ్బ! | Big Shock To Kotamreddy Sridhar Reddy Nellore District | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కోటంరెడ్డికి షాక్‌.. గట్టి ఎదురుదెబ్బ!

Published Thu, Sep 28 2023 7:39 PM | Last Updated on Thu, Sep 28 2023 8:10 PM

Big Shock To Kotamreddy Sridhar Reddy Nellore District - Sakshi

ఆయన వైఎస్‌ఆర్‌సీపీ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పార్టీకి ద్రోహం చేసి ఫిరాయించారు. మరికొందరిని కూడా వెంట తీసుకెళ్ళారు. కొత్తగా వచ్చిన వైఎస్‌ఆర్‌సీ ఇన్‌చార్జ్‌ ఫిరాయించిన ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నారు. ఎమ్మెల్యే వెంట వెళ్లిన నేతలు ఒక్కొక్కరుగా తిరిగి వెనక్కు వస్తున్నారు. తన వెంటే ఉన్నారనుకుంటూ వెనక్కు తిరిగి చూసుకునేలోపే వారు జంప్ చేస్తున్నారట. అధికార పార్టీ పన్నిన వ్యూహంతో ఫిరాయించిన ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు?..

నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శ్రీధరరెడ్డి వ్యవహారం తేడాగా ఉండటంతో పార్టీ నేతలు కొందరు రెండోసారి ఆయనకు టికెట్ ఇవ్వవద్దని చెప్పినా.. ఆయన మీద నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూరల్ టికెట్ ఇచ్చి గెలిపించారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా అనేకసార్లు తన అనుచరులకు కూడా చెప్పారట. అయితే, మూడోసారి టికెట్ రాదని గ్రహించిన కోటంరెడ్డి.. టీడీపీతో టచ్‌లోకి వెళ్లారు. దీంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనపై వేటు వేసింది. పార్టీ నుంచి బయటికి వెళుతున్న సమయంలో ఎమ్మెల్యే వెంట 10 మంది కార్పొరేటర్లు, నెల్లూరు మేయర్ స్రవంతి ఉన్నారు. 

కోటంరెడ్డికి ఎదురుదెబ్బ..
టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నెల్లూరు రూరల్ టీడీపీ ఇంచార్జీగా నియమించడంతో.. పార్టీలోని ఓ వర్గం ఆయనని వ్యతిరేకిస్తూ వచ్చింది. మేయర్ స్రవంతికి కూడా ప్రాధాన్యత తగ్గింది. రూరల్ ప్రజలు కూడా ఎమ్మెల్యేని పట్టించుకోవటం మానేశారు. దీనికి తోడు ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డికి.. మేయర్ స్రవంతి దంపతులతో కొంత గ్యాప్ వచ్చింది. మేయర్‌కి ప్రాధాన్యత లేకుండా గిరిధర్ రెడ్డి ప్రతీ విషయంలోనూ అడ్డు తగిలే వారని మేయర్ అనుచరులు చెబుతున్నారు. దీంతో మేయర్‌ తిరిగి వైఎస్‌ఆర్‌సీపీలోకి వచ్చేశారు. ఎమ్మెల్యేను నమ్మి వెంట వచ్చిన మేయర్‌ను ఎమ్మెల్యే సోదరుడు ఇబ్బంది పెట్టారట. గిరిధర్‌రెడ్డి విషయాన్ని మేయర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళితే ఆయన తమ్ముడికే మద్దతు ఇవ్వడంతో మనస్తాపానికి గురైన మేయర్ సొంత పార్టీలోకి వచ్చేశారు. ఎమ్మెల్యేతో ఉండే మరో 8 మంది కార్పొరేటర్లు కూడా వైఎస్‌ఆర్‌సీ ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి టచ్‌లోకి వచ్చేశారట. పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెనక్కు వచ్చేస్తామని వేగుల ద్వారా సంకేతాలు పంపిస్తున్నారంటూ టాక్ నడుస్తోంది. 

అదాల ప్రభాకర్‌ రెడ్డి మార్క్‌..
ప్రజల నాడి తెలిసిన నేతగా ఉన్న అదాల ప్రభాకర్ రెడ్డి, ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీపై వారు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొడుతూనే.. ఒక్కొక్కరినీ పార్టీలోకి తెస్తున్నారు. పార్టీ మీద అభిమానం ఉండే వాళ్ళని ఆహ్వానిస్తూ.. వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. దీంతో ఫిరాయించిన ఎమ్మెల్యే వెనుక ఉన్న వారందరూ.. బ్యాక్ టు హోమ్ అన్నట్లుగా వచ్చేస్తున్నారు. దానికి తోడు రూరల్ ఇంచార్జీ గా ఉన్న ఎంపీ ఆదాల ప్రతి డివిజన్ లో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నాలుగేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేని పనులు.. ఆదాల చేసి చూపించడం జనాల్లోకి బాగా వెళుతోంది. 

కోటంరెడ్డికి వెన్నుపోటు తప్పదు..
వచ్చే ఎన్నికల్లో రూరల్ నియోజక వర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని టీడీపీ కేడర్‌ కూడా నమ్ముతోంది. టీడీపీలో ఉండే అసంతృప్తులే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వెన్నుపోటు పొడవడం పక్కా అని పార్టీలో చర్చ నడుస్తోంది. దానికి తోడు చంద్రబాబు అరెస్ట్‌తో క్యాడర్‌లో నైరాశ్యం పెరిగిపోవడం.. చంద్రబాబు అవినీతి చేశాడని కార్యకర్తలు కూడా బలంగా నమ్ముతూ ఉండటంతో.. వైఎస్సార్‌సీపీలోకి వచ్చేందుకు కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement