జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్
కర్నూలు(హాస్పిటల్): పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ప్రకాష్‌నగర్‌లోని టంగుటూరి ప్రకాశం పంతులు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్‌లో రెండో విడత పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడంలో అలసత్వం ప్రదర్శించకూడదన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.నిరుపమ మాట్లాడుతూ.. జిల్లాలోని 5, 17,791 మంది చిన్నారులకు 2, 735 కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేస్తున్నామన్నారు. ఈనెల 23, 24 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి తమ సిబ్బంది ద్వారా పోలియో చుక్కలు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. 25వ తేదీ కర్నూలు కార్పొరేషన్‌లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణమూర్తి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజా సుబ్బారావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కళ్యాణ చక్రవర్తి, డీఈఎంఓ రమాదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ ఇన్‌చార్జి అధికారి ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
పోలియో చుక్కలు వేసిన జిల్లా ఎస్పీ...
స్థానిక బంగారుపేటలోని స్కూల్ ఆవరణలో ఎస్పీ ఆకే రవికృష్ణ చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేశారు. పోలియో చుక్కలు వేయడాన్ని విస్మరించకూడదని సూచించారు.
పోలియో కేంద్రాల తనిఖీ
రెండో విడత పల్స్ పోలియో కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.నిరుపమ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కళ్యాణ చక్రవర్తి తనిఖీ చేశారు. నగరంలో పల్స్‌పోలియో కేంద్రాలను పరిశీలించారు. అలాగే ఉస్మానియా కళాశాల, గడ్డ, జొహరాపురం, బేకారికట్ట, పెద్ద పడఖానా, డాక్టర్స్ కాలనీ ప్రాంతాల్లోని కేంద్రాల్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని పరిశీలించి వంద శాతం నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
Published Mon, Feb 23 2015 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement