పాలమూరు, న్యూస్‌లైన్: ‘ముందుంది మరింత మంచి కాలం’ అంటూ నిరుద్యోగ యువతకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించిన రాజీవ్ యువకిరణాలు పథకం ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది. శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించలేకపోయారు. ఈ పథకం ద్వారా 70వేల మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం ఏమాత్రం అమలుకు నోచుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివిన వారికి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోని అభ్యర్థులకు మెప్మా ఆధ్వర్యంలో, ఇంజనీరింగ్ ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర అర్హత కలిగిన అభ్యర్థులకు సాంకేతిక శిక్షణ విభాగం ఆధ్వర్యంలో శిక్షణలు ఇచ్చారు. 2011 జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 70వేల మంది యువకిరణాలు పథకం ద్వారా ఉద్యోగాలు పొందేందుకు రిజిస్టర్ కాగా, 20వేల మంది మాత్రమే పూర్తిస్థాయిలో శిక్షణ పొందారు.
వీరిలో ఐదువేల మంది మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారు. వారిలో కూడా రూ.ఎనిమిది వేల వేతనం పొందుతున్న వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. మిగిలినవారికి రూ.నాలుగువేల నుంచి రూ.ఎనిమిది వేల మధ్యలోనే వేతనం అందుతుంది. వీరిలో చాలామంది వేతనాలు తక్కువగా ఉండటంతో ఉద్యోగాలు మానివేసినట్టు తెలుస్తోంది. ఇలాగైతే యువతీ, యువకుల జీవనస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందని పలు ప్రజాసంఘాల ప్రతినిధులు పెదవివిరుస్తున్నారు. శిక్షణల ఫలితం ఇలా ఉంటే.. హైదరాబాద్ స్థాయిలోనే.. కనీసం జిల్లాకు ఏమాత్రం సంబంధం లేని సంస్థలకు యువకిరణాల కార్యక్రమం అమలు పర్చేందుకు అనుమతించడంతో అయోమయం నెలకొంది.
జిల్లాలోని చాలా శిక్షణ సంస్థల్లో గతంలో ఆయా కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థుల పేర్లను చేర్చి యువకిరణాలు పథకం కింద శిక్షణ పొందుతున్నట్లు చూపుతున్నారని, కొన్ని సంస్థల్లో నిబంధనల ప్రకారం ఏమాత్రం శిక్షణ ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలల శిక్షణకోసం చేరిన విద్యార్థుల్లో 50 శాతం మంది కోర్సు మధ్యలోనే మానేస్తున్నారు.
నిధుల్లేక నిట్టూర్పు!
రాజీవ్ యువకిరణాలు పథకాన్ని నిధుల కొరత వేధిస్తోంది. సకాలంలో చెల్లింపులు జరగని కారణంగా శిక్షణ సంస్థలు యువతకు శిక్షణ ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నాయి. జిల్లాలో 16 శిక్షణ సంస్థలు ఉండగా అందులో ఇప్పటికే ఐదు సంస్థలు తప్పుకున్నాయి. ఏడాదికాలంగా డబ్బు చెల్లింపులు జరగని కారణంగా ప్రస్తుతం కొనసాగుతున్న 11 సంస్థలు కూడా ఎప్పుడు శిక్షణను నిలిపేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పథకం ద్వారా కొన్ని ప్రముఖసంస్థలు జిల్లాలోని యువకులకు శిక్షణ ఇచ్చేందుకు, ఆ తర్వాత ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంతో రాష్ట్రస్థాయిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ సంస్థలకు జిల్లాలో ఎక్కడా శిక్షణ కేంద్రాలు లేవు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ పథకం ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు సంస్థల ఎంపిక హైదరాబాద్‌లో జరుగుతుంది. అక్కడి సంస్థలు స్థానిక శిక్షణ సంస్థలతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఆయా కోర్సులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజులో 25 శాతం మాత్రమే చెల్లిస్తూ మిగతా మొత్తాన్ని మింగేస్తున్నాయి. వాటి పర్యవేక్షణను మాత్రం ఇక్కడి అధికారులకు అప్పగించారు. శిక్షణ ఇచ్చినా సకాలంలో డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆయా కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ప్రసరించని ‘కిరణాలు’
Published Mon, Nov 18 2013 5:17 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
Advertisement