rajiv yuva kiranalu scheme
-
ఉపాధి ఊసేది..?
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. అందుకోసం ప్రవేశపెట్టిన పథకాలు ప్రభుత్వ కార్యాలయాల గడపదాటడం లేదు. ఏటా పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో అధికారులు కూడా విఫలమవుతున్నారు. ఫలితంగా గ్రామీణ నిరుద్యోగ సమస్యతో పాటు పట్టణ నిరుద్యోగం యువతను వేధిస్తోంది. ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ యువకిరణాలు పథకం జిల్లాలో చతికిలపడింది. కేవలం ప్రచారానికే ఈ పథకం పరిమితం కావడంతో జిల్లాలో నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయిలో ఉంది. నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించి పట్టణ పేదరికాన్ని నిర్మూలించేందుకు 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రవేశపెట్టింది. పలు కోర్సుల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం, ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. జిల్లాలో తొలుత ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, చీరాల పట్టణాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి పట్టణాలకు కూడా విస్తరించింది. జిల్లాలో మొత్తం 3,545 మంది నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ఒక్కొక్కరికి ఆయా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు, వసతులు కల్పించేందుకు సుమారు నాలుగు నుంచి ఐదువేల రూపాయల వరకు ఖర్చు చేసింది. శిక్షణ అనంతరం ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా కల్పించింది. ఇలా ఇప్పటి వరకు 3,003 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. కానీ, అనంతరం ఆయా సంస్థల యాజమాన్యాలు.. రాజీవ్ యువకిరణాలు ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో కొందరిని తొలగించడం, మరికొందరికి వేతనాలివ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. నాలుగైదు నెలలకే ఉద్యోగాలు మానుకున్న అభ్యర్థులు... రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా జిల్లాలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన 180 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించి వదిలేశారు. ఈ పథకంలో భాగస్వామ్యం పొందిన రెండు శిక్షణ సంస్థలు.. శిక్షణ పొందిన అభ్యర్థులకు ఒప్పందాల మేరకు ఉద్యోగాలు చూపించకపోవడంతో ప్రభుత్వం ఇటీవల వాటిని రద్దు చేసింది. పైగా, ఆయా కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారికి తగిన వేతనం ఇవ్వని పరిస్థితి నెలకొంది. పెరిగిన నిత్యావసరాల వస్తువుల ధరలతో పోలిస్తే ఏమాత్రం చాలీచాలని వేతనాలతో ఇబ్బందులుపడిన అభ్యర్థులు ఎవరికీ చెప్పకుండానే ఉద్యోగం మానుకున్నారు. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి కూడా ఆయా కంపెనీలు 3,500 నుంచి 5 వేల రూపాయలు మాత్రమే వేతనాలుగా ఇస్తుండటంతో సంబంధిత అభ్యర్థులు నాలుగైదునెలలకే ఉద్యోగం మానుకున్నారు. రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో 50 శాతం మంది ఆయా ఉద్యోగాలు మానేసి మళ్లీ ఉపాధి వేటలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే, ఆయా సంస్థల యాజమాన్యాలే మరికొందరిని తొలగించాయి. వారంతా మళ్లీ రోడ్లపై పడటంతో పట్టణ పేదరిక నిర్మూలన కలగానే మిగిలింది. రాజీవ్ యువకిరణాలు పథకం వల్ల నిధులు దుర్వినియోగం తప్ప ఫలితం లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు గొప్పలు చెప్పుకోవడం మానుకుని నిరుద్యోగ సమస్యను పరిష్కరించి పేదరికాన్ని నిర్మూలించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. -
అవినీతి ‘కిరణాలు’
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : రాజీవ్ యువకిరణాల్లో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు అల్లు శివరమేష్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ యువకిరణాలు పేరుతో డమ్మీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి * కోట్లకు కోట్లు దిగమింగారని, ఆ పథకం వల్ల యువతకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. రెండు రోజుల క్రితం తమ పార్టీ అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు ఒంగోలు నగరంలో 20 ప్రాంతాల్లో సేకరించిన శాంపిళ్లను టెస్ట్వైల్స్ ద్వారా పరీక్షించి నివేదికలు తయారు చేయించిన ట్లు తెలిపారు. ప్రగతి కాలనీ, విరాట్‌నగర్‌లో ప్రజలకు సరఫరా చేస్తున్న నీరు పూర్తిగా కలుషితమయ్యాయన్నారు. గొడుగుపాలెం, నల్లవాగు, జయరాం సెంటర్, గద్దలగుంటలలో నీరు కూడా కలుషిత మయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా మంచినీటి శాంపిళ్లను ఆయన మీడియాకు చూపెట్టారు. మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అయినా ప్రజల కష్టాల గురించి ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదని ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యం ఏమైనా ఫర్వాలేదు, తాము పదవుల్లో కొనసాగితే చాలనే ధోరణిలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజీవ్ యువకిరణాల్లో అవినీతి, మద్యం బాధితులకు న్యాయం, కలుషిత నీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 70 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని చెప్పుకుంటున్న అధికారులు.. బోగస్ కంపెనీల పేర్లతో దొంగ జాబితాలు చూపిస్తున్నారని విమర్శించారు. మద్యానికి బానిసై మృతి చె ందిన వారి కుటుంబాలకు *3000 పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చప్పిడి రత్నకుమారి,మహ్మద్ రఫీ, వరికూటి ఆంజనేయులు, చిరంజీవిరెడ్డి, రంగారావు, మారుతీప్రసాద్, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
మోమిన్‌పేట, న్యూస్‌లైన్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో రాజీవ్ యువ కిరణాలు పథకం కింద కాంట్రాక్టు పద్ధతిపై లైవ్లీహుడ్ స్పెషలిస్టు, ఎంఐఎస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మెప్మా ప్రాజెక్టు డెరైక్టర్ సుబ్రహ్మణ్యం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లైవ్లీహుడ్ స్పెషలిస్టు పోస్టుకు పోస్టుగ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఎంఎస్ ఆఫీస్ తెలిసి, కమ్యూనిటీ డెవలప్మెంట్లో పనిచేసిన అనుభవం ఉండాలన్నారు. ఎంఐఎస్ అసిస్టెంట్ పోస్టుకు బీఎస్సీ (కంప్యూటర్స్), బీటెక్ (కంప్యూటర్స్), ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు 40 ఏళ్లకు మించి ఉండకూడదన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రాజెక్ట్ డెరైక్టర్ మెప్మా, రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
ప్రసరించని ‘కిరణాలు’
పాలమూరు, న్యూస్‌లైన్: ‘ముందుంది మరింత మంచి కాలం’ అంటూ నిరుద్యోగ యువతకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించిన రాజీవ్ యువకిరణాలు పథకం ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది. శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించలేకపోయారు. ఈ పథకం ద్వారా 70వేల మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం ఏమాత్రం అమలుకు నోచుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివిన వారికి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోని అభ్యర్థులకు మెప్మా ఆధ్వర్యంలో, ఇంజనీరింగ్ ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర అర్హత కలిగిన అభ్యర్థులకు సాంకేతిక శిక్షణ విభాగం ఆధ్వర్యంలో శిక్షణలు ఇచ్చారు. 2011 జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 70వేల మంది యువకిరణాలు పథకం ద్వారా ఉద్యోగాలు పొందేందుకు రిజిస్టర్ కాగా, 20వేల మంది మాత్రమే పూర్తిస్థాయిలో శిక్షణ పొందారు. వీరిలో ఐదువేల మంది మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారు. వారిలో కూడా రూ.ఎనిమిది వేల వేతనం పొందుతున్న వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. మిగిలినవారికి రూ.నాలుగువేల నుంచి రూ.ఎనిమిది వేల మధ్యలోనే వేతనం అందుతుంది. వీరిలో చాలామంది వేతనాలు తక్కువగా ఉండటంతో ఉద్యోగాలు మానివేసినట్టు తెలుస్తోంది. ఇలాగైతే యువతీ, యువకుల జీవనస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందని పలు ప్రజాసంఘాల ప్రతినిధులు పెదవివిరుస్తున్నారు. శిక్షణల ఫలితం ఇలా ఉంటే.. హైదరాబాద్ స్థాయిలోనే.. కనీసం జిల్లాకు ఏమాత్రం సంబంధం లేని సంస్థలకు యువకిరణాల కార్యక్రమం అమలు పర్చేందుకు అనుమతించడంతో అయోమయం నెలకొంది. జిల్లాలోని చాలా శిక్షణ సంస్థల్లో గతంలో ఆయా కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థుల పేర్లను చేర్చి యువకిరణాలు పథకం కింద శిక్షణ పొందుతున్నట్లు చూపుతున్నారని, కొన్ని సంస్థల్లో నిబంధనల ప్రకారం ఏమాత్రం శిక్షణ ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలల శిక్షణకోసం చేరిన విద్యార్థుల్లో 50 శాతం మంది కోర్సు మధ్యలోనే మానేస్తున్నారు. నిధుల్లేక నిట్టూర్పు! రాజీవ్ యువకిరణాలు పథకాన్ని నిధుల కొరత వేధిస్తోంది. సకాలంలో చెల్లింపులు జరగని కారణంగా శిక్షణ సంస్థలు యువతకు శిక్షణ ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నాయి. జిల్లాలో 16 శిక్షణ సంస్థలు ఉండగా అందులో ఇప్పటికే ఐదు సంస్థలు తప్పుకున్నాయి. ఏడాదికాలంగా డబ్బు చెల్లింపులు జరగని కారణంగా ప్రస్తుతం కొనసాగుతున్న 11 సంస్థలు కూడా ఎప్పుడు శిక్షణను నిలిపేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పథకం ద్వారా కొన్ని ప్రముఖసంస్థలు జిల్లాలోని యువకులకు శిక్షణ ఇచ్చేందుకు, ఆ తర్వాత ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంతో రాష్ట్రస్థాయిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సంస్థలకు జిల్లాలో ఎక్కడా శిక్షణ కేంద్రాలు లేవు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ పథకం ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు సంస్థల ఎంపిక హైదరాబాద్‌లో జరుగుతుంది. అక్కడి సంస్థలు స్థానిక శిక్షణ సంస్థలతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఆయా కోర్సులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజులో 25 శాతం మాత్రమే చెల్లిస్తూ మిగతా మొత్తాన్ని మింగేస్తున్నాయి. వాటి పర్యవేక్షణను మాత్రం ఇక్కడి అధికారులకు అప్పగించారు. శిక్షణ ఇచ్చినా సకాలంలో డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆయా కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. -
నిరాశ కిరణాలు
సాక్షి, మంచిర్యాల : రాజీవ్ యువకిరణాలు అక్రమాలకు చిరునామాగా మారాయి. పలు ఏజెన్సీలు నిరుద్యోగులకు ఓ రంగంలో శిక్షణ ఇచ్చి.. మరో రం గంలో కిందిస్థాయి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఇంకొన్ని ఏజెన్సీలైతే ఉద్యోగాలు కల్పించకు న్నా, కల్పించినట్టు అధికారులను నమ్మంచి నిధులు పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం శిక్షణ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చినా నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు. శిక్షణ తీసుకున్న వారికి ఎక్కడ ఉపాధి కల్పించారో వివరాలు ఏజెన్సీలు సమర్పించడం లేదు. ఈ అవినీతిలో అధికారుల పా త్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేరు మారిన.. తీరు మార లేదు.. కుటుంబానికో ఉద్యోగం, వార్షికాదాయం రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు పెంచాలనే లక్ష్యంతో 2005-06లోనే ప్రభుత్వం ఎంప్లాయీమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) పథకం ప్రవేశపెట్టింది. పద్దెనిమిదేళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగవకాశాలు కల్పిచాలని నిర్ణయించింది. కానీ ఆశించిన లక్ష్యం నెరవేరకపోవడంతో దీనిస్థానంలో 2011లో రాజీవ్ యువ కిరణాలు పథకాన్ని అమలు చేసింది. గ్రామీణ విద్యార్థుల కోసం నిర్వహించే కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతను డీఆర్డీఏ- ఐకేపీకు, అర్బన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మోప్మాకు అప్పగించింది. కానీ, పథక నిర్వహణపై పర్యవేక్షణ లేకపోవడం, మెరుగైన శిక్షణ అందకపోవడంతో నిరుద్యోగులు ఉపాధి అవకాశాలకు నోచుకోవడం లేదు. అధికారుల అసమర్థతను ఆసరాగా చేసుకుని, పలు ఏజెన్సీలు బోగస్ విద్యార్థులను సృష్టించి డబ్బులు కాజేస్తున్నారు. గత నెలలో నిర్మల్‌లోని ఓ ఏజెన్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన పథక రాష్ట్ర క్వాలిటీ కం ట్రోల్ సెల్ బృందం ఈ అక్రమాన్ని గుర్తించిం ది. ఇతరుల వేలిముద్రలు, విద్యార్థుల సంఖ్య ఎక్కువ చూపుతూ డబ్బులు కాజేస్తునృ్నట్లు నిర్ధారించింది. దీంతో సదరు ఏజెన్సీకి బిల్లులు నిలిపేయాలని అధికారులను ఆదేశించింది. 16 కేంద్రాలు.. 641 మంది.. పస్తుతం డీఆర్డీఏ ఆధ్వరృ్యంలో జిల్లా పరిధిలోని పశ్చిమ ప్రాంతంలో ఆదిలాబాద్ న్యాక్‌లో ఫ్లంబింగ్, సానిటేషన్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, జనరల్ వర్క్స్ సూపర్వైజర్, నిర్మల్‌లోని సీఎంసీలో కంప్యూటర్ మెన్టేషన్, హార్డ్‌వేర్, టెలిసెల్స్, శ్రీ టెక్‌లో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, స్కిల్ప్రోలో సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్, భైంసాలోని సింక్సర్వో, అపెక్లలో కంప్యూటర్ మెన్టేషన్, హార్డ్‌వేర్ రంగాల్లో 361 మంది నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారు. తూర్పు జిల్లా మంచిర్యాలలోని సాహితీ, డాటా ప్రో ఏజెన్సీలలో కంప్యూటర్ మెన్టేషన్, హార్డ్‌వేర్, ఐఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్, శ్రీటెక్లో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, సీఎంసీ లో టెలిసెల్స్, కాగజ్‌నగర్ సీఎంసీలో టెలిసెల్స్ రంగాల్లో 280 మంది శిక్షణ పొందుతున్నారు. వీటితోపాటు ఐటీడీఏ పరిధిలో మరో మూడు కేంద్రాలున్నాయి. ఒక్కో కోర్సు కాలపరిమితి ఒక్కో విధంగా ఉంటుంది. కనీస కాలపరిమితి సెక్యూరిటీగార్డు శిక్షణకు 15 రోజులుంటే, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కోర్సుకు గరిష్టంగా 75 రోజులుంటుంది. ప్రతి విద్యార్థికి కోర్సును బట్టి బోధన కోసం రూ.2 వేల నుంచి రూ.7 వేల వరకు కేటాయిస్తుంది. దీంతోపాటు వారికి ఉచితంగా వసతి, భోజనం కోసం ప్రతి నెలా రూ.2,400లు విడుదల చేస్తోంది. పక్కదారి పట్టిన లక్ష్యం నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్న ఏజెన్సీలు వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నాయి.ఆయా కంపెనీలు ఇచ్చే వేతనం రూ. 6వేల లోపు ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో విద్యార్థులు పని వదిలేసి ఇంటి కి చేరుకుంటున్నారు. మరోపక్క పొందిన శిక్షణతో సంబంధం లేని ఉద్యోగాలు కల్పించడంతో చాలా మంది వెనుదిరుగుతున్నారు. దీంతో ప్రభుత్వం విద్యార్థుల వసతి, భోజనం, శిక్షణ కోసం పెట్టిన ఖర్చంతా వృథా అవుతోంది. కేంద్రాలు రద్దు అక్టోబర్ 19న అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో శిక్షణ ఇచ్చిన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏజెన్సీ నిర్వాహకుల వైఫల్యంపై కలెక్టర్ అహ్మద్ బాబు మండిపడ్డారు. పథక ం అమలు పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శించిన డీపీఎం(జాబ్స్) యాదగిరిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. ఇకపై పథకాన్ని తానే పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తానని హెచ్చరించారు. పస్తుతం కొనసాగుతున్న కేంద్రాల గడువు పూర్తయిన తర్వాత 15 మంది జిల్లా అధికారులతో ‘ప్రేరణ’ కమిటీ ఏర్పాటు చేసి శిక్షణతోపాటు ప్రతీ యువతీయువకుడికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ఐటీడీఏ పరిధిలో కొనసాగుతున్న మూడు కేంద్రాలు రద్దయ్యాయి. కలెక్టర్ మార్గదర్శకాలు అందిన వెంటనే మళ్లీ పునఃప్రారంభిస్తామని ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్(జాబ్స్) రాజ్‌కుమార్ తెలిపారు.