ఉపాధి ఊసేది..?
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. అందుకోసం ప్రవేశపెట్టిన పథకాలు ప్రభుత్వ కార్యాలయాల గడపదాటడం లేదు. ఏటా పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో అధికారులు కూడా విఫలమవుతున్నారు. ఫలితంగా గ్రామీణ నిరుద్యోగ సమస్యతో పాటు పట్టణ నిరుద్యోగం యువతను వేధిస్తోంది. ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ యువకిరణాలు పథకం జిల్లాలో చతికిలపడింది. కేవలం ప్రచారానికే ఈ పథకం పరిమితం కావడంతో జిల్లాలో నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయిలో ఉంది.
నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించి పట్టణ పేదరికాన్ని నిర్మూలించేందుకు 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రవేశపెట్టింది. పలు కోర్సుల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం, ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. జిల్లాలో తొలుత ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, చీరాల పట్టణాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి పట్టణాలకు కూడా విస్తరించింది. జిల్లాలో మొత్తం 3,545 మంది నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ఒక్కొక్కరికి ఆయా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు, వసతులు కల్పించేందుకు సుమారు నాలుగు నుంచి ఐదువేల రూపాయల వరకు ఖర్చు చేసింది. శిక్షణ అనంతరం ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా కల్పించింది. ఇలా ఇప్పటి వరకు 3,003 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. కానీ, అనంతరం ఆయా సంస్థల యాజమాన్యాలు.. రాజీవ్ యువకిరణాలు ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో కొందరిని తొలగించడం, మరికొందరికి వేతనాలివ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
నాలుగైదు నెలలకే ఉద్యోగాలు మానుకున్న అభ్యర్థులు...
రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా జిల్లాలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన 180 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించి వదిలేశారు. ఈ పథకంలో భాగస్వామ్యం పొందిన రెండు శిక్షణ సంస్థలు.. శిక్షణ పొందిన అభ్యర్థులకు ఒప్పందాల మేరకు ఉద్యోగాలు చూపించకపోవడంతో ప్రభుత్వం ఇటీవల వాటిని రద్దు చేసింది.
పైగా, ఆయా కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారికి తగిన వేతనం ఇవ్వని పరిస్థితి నెలకొంది. పెరిగిన నిత్యావసరాల వస్తువుల ధరలతో పోలిస్తే ఏమాత్రం చాలీచాలని వేతనాలతో ఇబ్బందులుపడిన అభ్యర్థులు ఎవరికీ చెప్పకుండానే ఉద్యోగం మానుకున్నారు. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి కూడా ఆయా కంపెనీలు 3,500 నుంచి 5 వేల రూపాయలు మాత్రమే వేతనాలుగా ఇస్తుండటంతో సంబంధిత అభ్యర్థులు నాలుగైదునెలలకే ఉద్యోగం మానుకున్నారు.
రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో 50 శాతం మంది ఆయా ఉద్యోగాలు మానేసి మళ్లీ ఉపాధి వేటలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే, ఆయా సంస్థల యాజమాన్యాలే మరికొందరిని తొలగించాయి. వారంతా మళ్లీ రోడ్లపై పడటంతో పట్టణ పేదరిక నిర్మూలన కలగానే మిగిలింది.
రాజీవ్ యువకిరణాలు పథకం వల్ల నిధులు దుర్వినియోగం తప్ప ఫలితం లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు గొప్పలు చెప్పుకోవడం మానుకుని నిరుద్యోగ సమస్యను పరిష్కరించి పేదరికాన్ని నిర్మూలించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు.