government target
-
చీకట్లో చెంచులు
అసలే అడవి.. ఆపై చిమ్మ చీకటి... రాత్రయిందంటే ఏమీ కనిపించదు.. విషజంతువులు, సర్పాలు తిరిగే ప్రాంతం. అడవినే నమ్ముకున్న అడవిబిడ్డలు జీవించేది అక్కడే.. పాములు రాత్రివేళ ఇళ్లలోకి దూరి కాటు వేయడంతో బలయిన వారెందరో. అంధకారంలో ఆ జీవితాలు ముగుస్తున్నా.. వారి జీవితాల్లో వెలుగులు నింపడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో చెంచుల జీవితాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. అచ్చంపేట: నల్లమల అడవిలోని చెంచు పెంటలు వెలుగుకు నోచుకోవడం లేదు. చెంచులు చీకట్లో అటవీ జంతువులు, విషసర్పాల మధ్య సహజీవనం చేస్తున్నారు. రాత్రివేళ బొడ్డు గుడిసెలో కట్టెల మంటలు(నెగడి) పెట్టి కాలం వెళ్లదీస్తున్నారు. నెగడే చెంచుల ఇండ్లలో దీపం వెలుతురు. నెగళ్లే వారికి అటవీ జంతువుల నుంచి రక్షణగా నిలుస్తోంది. నెగిడి వల్ల గుడిసెలు తగలబడి అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఐటీడీఏ, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన సోలార్ ల్యాప్‌లు కూడా సక్రంగా పనిచేయడం లేదు. కోర్ ఏరియాలోని చెంచుపెంటల్లో విద్యుత్ సౌకర్యం లేక చెంచులు చీకట్లో కాలం గడుపుతున్నారు. అప్పాపూర్ చుట్టూ ఉన్న చెంచుపెంటలన్నింటినీ ఒకే దగ్గరికి చేర్చి విద్యుత్ సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం అటవీశాఖ నిబంధనలతో నీరుగారిపోయింది. పరహాబాద్ చౌరస్తా నుంచి అప్పాపూర్‌కు 25కిలో మీటర్ల పొడవున భూగర్భ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 2007లో అప్పటి ప్రభుత్వం రూ. కోటిన్నర నిధులు మంజూరు చేసింది. అయతే, అట వీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. వన్యప్రాణులు, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, టైగర్ ఫారెస్టులో వేటగాళ్లు కరెంటు ఉపయోగించే అవకాశం ఉందన్న వాదన తెరపైకి తీసుకొచ్చారు. విద్యుత్ స్తంభాలకు అల్యూమినియం వైర్లు అమర్చి కరెంటు సరఫరా ఇస్తే సమస్య ఉత్పన్నం అవుతుంది తప్ప, భూగర్భం నుంచి కేబుల్‌వైర్లు వేయడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదని ట్రాన్స్‌కో అధికారులు అంటున్నారు. అప్పాపూర్‌కు రోడ్డు సౌకర్యం ఉండడం, రోడ్డు వెంట కేబుల్ వేయడం వల్ల అడవికి ఎలాంటి నష్టం లేకపోయినా వారు ఒప్పుకోవడం లేదు. కరెంటు సౌకర్యం లేకపోవడం వల్ల చీకటి పడిందంటే ఉన్న పది, పదిహేను బొడ్డుగుడిసెల వారికి ఒకరితో ఒకరికి సంబంధాలు తెగిపోతున్నాయి. వారు రాత్రి వేళ ఒకరిని ఒకరు పలకరించుకొనే పరిస్థితి లేదు. ఈ చెంచుపెంటల్లో ఎలుగుబంట్ల బె డద అధికంగా ఉంది. చీకటి పడిందంటే మా గుడిసెల్లోకి విషసర్పాలు వస్తుంటాయని.. వీటితోనే నిత్యం ఇబ్బంది పడుతున్నామని చెంచులు ఆవేదన వ్యకం చేస్తున్నారు. గతంలో చెంచులకు మైదాన ప్రాంత గ్రామాలతో సంబంధం లేకపోయేది. ప్రస్తుతం మారిన కాలానుగుణగా వారికి గ్రా మాలతో ఇప్పుడు ఇప్పుడే సంబంధాలు ఎర్పడుతున్నాయి. దీనివల్ల గ్రామాల్లో ఉండే మౌలిక వసతులు, సదుపాయాలు, విద్యుత్, తాగునీటి వంటి వసతులు చూసి వారు ఆశ్యర్యపోతున్నారు. ఈ వసతులు మాకు అడవిలో ఉంటే బాగుండేదన్న ఆభిప్రాయం వెలువరిస్తున్నారు. కరెంటులేని పెంటలు.. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో నల్లమల విస్తరించి ఉంది. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 112 చెంచుగూడెలలో 7,500 జనాభా ఉంది.హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారిలో ఉన్న వట్టువర్లపల్లి, సార్లపల్లికి మన్ననూర్ నుంచి ప్రభుత్వం విద్యుత్ సౌకర్యం కల్పించినా.. మిగతా చెంచుపెంటలకు ఇవ్వలేకపోతుంది. సార్లపల్లి- కుడిచింతలబైలు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. సార్లపల్లికి క రెంటు ఇచ్చిన అధికారులు కుడిచింతలబైలుకు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిలో పర్హాబాద్ చౌర స్తా వద్ద వట్టువర్లపల్లికి విద్యుత్ లైన్ ఉంది. ఇక్కడి నుంచి మల్లాపూర్ 7 కిలోమీటర్లు, మల్లాపూర్ మలుపు నుంచి పుల్లాయిపల్లి 15 కిలోమీటర్లు, పుల్లాయిపల్లి నుంచి రాంపూర్ 5 కిలోమీటర్లు, ఆగర్లపెంట 15 కిలోమీటర్లు, అప్పాపూర్ 4 కిలోమీటర్లు ఉంటుంది. అప్పాపూర్-బౌరపూర్ 12 కిలోమీటర్లు, బౌరపూర్ - మెడిమొల్క ల 8 కిలోమీటర్లు, మెడిమొల్కల- ఈర్లపెంట 10 కిలోమీటర్లు, ఈర్లపెంట నుంచి సంగండిగుండాలు 12 కిలోమీటర్లు, సంగండిగుండాలు -తాటిగుండాలు 6 కిలోమీటర్లు, తాటిగుండా లు-పందిబొర్రె 7కిలోమీటర్లు దూరం ఉం టుంది. మద్దిమడుగు- గీసుగండి 16 కిలోమీటర్లు, పదర-కండ్లకుంట 4కిలోమీటర్లు ఉం టుంది. ఈ చెంచుపెంటలకు కరెంటు ఇవ్వడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టక పోవడంతో వారు నేటికీ చీకట్లో జీవిస్తున్నారు. పనిచేయని సోలార్ దీపాలు... అప్పాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, మల్లాపూర్, బౌరపూర్ చెంచు పెంటలకు సోలార్ ల్యాంపులు అందజేసినా అవి పనిచేయడం లేదు. ఐటీడీఏ ఏర్పాటు చేసిన వీధి దీపాలు, గుడిసెలపై అమర్చిన సోలార్ ప్లేట్ నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. పోలీసుశాఖ చెంచులకుపంపిణీ చేసిన టీవీలు మూలకు పడ్డాయి. విద్యుత్తుకు బదులు ప్రత్యామ్నాంగా ఉపయోగిస్తున్న సోలార్ దీపాలు పనిచేయకపోవడంతో చెంచులు చీకట్లో కాలం గడుపుతున్నారు. అప్పాపూర్ ఆశ్రమ పాఠశాల ఆవరణలో సోలారాసీస్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంటికో బల్బు, వీధిలైట్లు ఏర్పాటు చేసి చెంచుపెంట అంతటా వెలుతురు ఇచ్చేలా ఏర్పాటు చేసిన అదికూడా పనిచేయడం లేదు. అప్పాపూర్ ఒక్కటే వెలుగుకు నోచుకొంటే మేమంతా చీకట్లో ఉండాలా అని ఈర్లపెంటకు చెందిన ఒక యువకుడు సోలార్ ప్లేట్ తీసుకెళ్లాడు. తర్వాత ఆశ్రమ పాఠశాలపై ఉన్న మరో నాలుగు ప్లేట్లు కూడా తీసుకెళ్లడంతో పూర్తిగా సోలార్ వెలుతురు నిలిచిపోయింది. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన సోలార్ సిస్టం నేడు నిరుపయోగంగా ఉంది. -
ఇంటింటా మరుగుదొడ్డి
- పైలట్ ప్రాజెక్ట్‌గా పెంచ్‌కల్‌పాడ్ ఎంపిక - తిమ్మాపూర్‌కు తరలిన లబ్ధిదారులు - ముఖ్యమంత్రి సభకు ఆహ్వానం కుంటాల : గృహనిర్మాణ, ఉపాధిహామీ పథకం, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ద్వారా ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డీఆర్డీఏ, ఐకేపీ శాఖల ద్వారా సంయుక్తంగా మండలంలోని పెంచ్‌కల్‌పాడ్ గ్రామాన్ని జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. గ్రామంలో మరుగుదొడ్లు వందశాతం పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలు చేపటే ్టందుకు ముందుకు వచ్చారు. వందశాతం పూర్తి చేయడమే లక్ష్యం.. మండలంలోని పెంచ్‌కల్‌పాడ్ గ్రామంలో 340 కుటుంబాలుండగా వెయ్యి మంది జనాభా ఉన్నారు. నాలుగు రోజులుగా గ్రామంలో చేపట్టిన సర్వేలో 137 ఇళ్లలో మరుగుదొడ్లు లేవని తెలిసింది. వివిధ కారణాలతో కొన్ని నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 74ఇళ్లలో మాత్రమే మరుగుదొడ్లు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. గ్రామంలో మరుగుదొడ్ల లక్ష్యం వందశాతం పూర్తి చేసేందుకు డీఆర్డీఏ, ఐకేపీ శాఖలు ముందుకు వచ్చాయి. మరుగుదొడ్ల నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆ శాఖల ద్వారా రూ.12వేలు నేరుగా వీవో సంఘాల ద్వారా అధికారులు అందించి ప్రోత్సహిస్తున్నారు. అధ్యయనం కోసం తిమ్మాపూర్‌కు.. మండలంలోని పెంచ్‌కల్‌పాడ్ ముంపు గ్రామం. గ్రామంలో ప్రతీ ఇంటి ఎదుట విశాలమైన స్థలం ఉంది. నిబంధనలు సడలిస్తే నిర్మాణాలు పూర్తిచేస్తామని లబ్ధిదారులు పేర్కొనడంతో అధికారులు జిల్లాలోని పెంచ్కల్పాడ్ను నమూనా ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. దీంతో ఐకేపీ ఆధ్వర్యంలో సోమవారం నుంచి సర్పంచ్ దాసరి కమల, ఎంపీటీసీ సభ్యురాలు అవదూత్వార్ వేదిక, మహిళాసంఘాల సభ్యులు, గ్రామపెద్దలు, అధికారులు, అధ్యయనం కోసం మెదక్ జిల్లాలోని గజ్వేల్ మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్లారు. తిమ్మాపూర్ గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించి అక్కడి గ్రామస్తులు రాష్ర్టంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచారు. అక్కడ చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులను పెంచ్‌కల్‌పాడ్ గ్రామస్తులు మూడురోజుల పాటు అధ్యయనం చేస్తారు. కాగా మెదక్ జిల్లా కౌడపెల్లి మండల కేంద్రంలో ఈనెల ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభకు గ్రామ ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులకు ఆహ్వానం అందింది. గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. -
రుణలక్ష్యం రూ.100 కోట్లు.. ఇచ్చింది 0
నెల్లూరు(అగ్రికల్చర్): రుణమాఫీలో కౌలురైతులకు మొండిచేయి చూపించిన సర్కారు నూతన రుణ మంజూరులోను అలసత్వం ప్రదర్శిస్తోంది. కౌలు రైతుల కష్టాలు దేవుడికే ఎరుక అన్నట్లు బాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ముగిసి, రబీ ప్రారంభమైనా ఇప్పటికి కౌలు రైతులను పట్టించుకున్న నాధుడే లేరు. జిల్లాలో కౌలు రైతులకు ఈఏడాది రూ.100 కోట్ల రుణాలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా, ఇప్పటివరకు కౌలురైతులకు ఒక్క రూపాయి కూడా రుణం మంజూరు చేయలేదంటే వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుంది. జిల్లావ్యాప్తంగా లక్షమంది కౌలురైతులను ఈఏడాది ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఖరీఫ్‌లో అప్పులపాలయ్యారు. సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెట్టుబడులకు అందినచోటల్లా అప్పులు చేశారు. ఏదో ఒక సమయంలో ప్రభుత్వం పట్టించుకోకపోతుందా అని ఆశించిన కౌలు రైతులకు నిరాశే ఎదురవుతోంది. చివరకు అప్పులే మిగిలేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు పంట రుణాలు అందించడం, వివిధ కారణాలతో పంటలను నష్టపోయిన కౌలుదారులను ఆదుకుని, తిరిగి సాగుకు ప్రోత్సహించే విధంగా 2011లో భూ అధికృత రైతుల చట్టాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా కౌలురైతులను గుర్తించి కార్డులను అందజేయాలి. తద్వారా బ్యాంకు రుణం పొందే అవకాశం కల్పించాలి. అయితే ప్రభుత్వం కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏదో మొక్కుబడిగా కౌలు రైతుల గుర్తించి చేతులు దులుపుకొంది. జిల్లావ్యాప్తంగా లక్షమంది కౌలు రైతులు ఉన్నట్లు సమాచారం. కౌలురైతు గుర్తింపు కార్డులను పొందాలంటే భూయజమానులు రిజిస్ట్రర్ కౌలుకు అంగీకరించాలి. ఈ మేరకు రెవెన్యూ అధికారులు వారిని గుర్తించి గుర్తింపుకార్డులను అందజేస్తారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామమాత్రపు సంఖ్యలో గుర్తింపుకార్డులను ఇచ్చి చేతులు దులుపుకోవడంతో కౌలురైతుల నానాఅగచాట్లు పడుతున్నారు. జిల్లాలో 50వేల మంది కౌలు రైతులున్నట్లు గుర్తించి భూఅధీకృత గుర్తింపు కార్డు( రుణ అర్హత పత్రం)లను పంపిణీ చేశారు. గత ఏడాది బ్యాంకులు వీరికి నామమాత్రంగానే రుణాలను మంజూరు చేశాయి. కేవలం 4,870 మందికి మాత్రమే రూ.22.19 కోట్ల రుణాలను వివిధ బ్యాంకులు అందజేశాయి. రుణమాఫీ నేపథ్యంలో ఈ ఏడాది బ్యాంకులు రుణాలను ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడం, రుణ మంజూరుకు బ్యాంకర్లు విముఖత వ్యక్తం చేయడంతో కౌలురైతులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఖరీఫ్ ఆరంభంలో వాతావరణం అనుకూలించకపోవడం, పెరిగిన ఎరువుల ధరలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. సాగు పెట్టుబడిలతో పాటే అప్పులూ పెరిగాయి. కనీసం రబీ సీజన్లోనైనా బ్యాంకులు రుణాలిస్తాయని ఎదురుచూసిన రైతులకు భంగపాటు తప్పలేదు. రబీ సీజన్ రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు బ్యాంకులు ఒక్క రూపాయి కూడా రుణం మంజూరు చేయకపోవడంతో కౌలు రైతులు తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలే తెలియక తలలు పట్టుకుంటున్నారు. గుర్తింపు కార్డు ఉంటేనే రుణం... -వెంకటేశ్వర్లు, లీడ్ డిస్ట్రిక్ బ్యాంకు మేనేజరు(ఎల్డీఎం) కౌలురైతులకు రెవెన్యూ అధికారులు మంజూరు చేసిన గుర్తింపుకార్డుల ఆధారంగా బ్యాంకులు పంటరుణాలను మంజూరు చేస్తాయి. ఈ ఏడాది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలను అందజేయడంలో అలస్యమైనందున రుణం మంజూరు చేయలేదు. త్వరలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు కౌలు రైతులకు రుణాలను అందించే దిశగా చర్యలను తీసుకుంటాం. ఈ మేరకు కౌలు రైతులు గుర్తింపుకార్డులను తీసుకుని ఆయా బ్యాంకులలో రుణాలను పొందాలి. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో కూడా కౌలురైతులను లబ్ధిదారులుగా ఎంపిక చేశాం. -
ఉపాధి ఊసేది..?
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. అందుకోసం ప్రవేశపెట్టిన పథకాలు ప్రభుత్వ కార్యాలయాల గడపదాటడం లేదు. ఏటా పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో అధికారులు కూడా విఫలమవుతున్నారు. ఫలితంగా గ్రామీణ నిరుద్యోగ సమస్యతో పాటు పట్టణ నిరుద్యోగం యువతను వేధిస్తోంది. ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ యువకిరణాలు పథకం జిల్లాలో చతికిలపడింది. కేవలం ప్రచారానికే ఈ పథకం పరిమితం కావడంతో జిల్లాలో నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయిలో ఉంది. నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించి పట్టణ పేదరికాన్ని నిర్మూలించేందుకు 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రవేశపెట్టింది. పలు కోర్సుల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం, ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. జిల్లాలో తొలుత ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, చీరాల పట్టణాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి పట్టణాలకు కూడా విస్తరించింది. జిల్లాలో మొత్తం 3,545 మంది నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ఒక్కొక్కరికి ఆయా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు, వసతులు కల్పించేందుకు సుమారు నాలుగు నుంచి ఐదువేల రూపాయల వరకు ఖర్చు చేసింది. శిక్షణ అనంతరం ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా కల్పించింది. ఇలా ఇప్పటి వరకు 3,003 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. కానీ, అనంతరం ఆయా సంస్థల యాజమాన్యాలు.. రాజీవ్ యువకిరణాలు ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో కొందరిని తొలగించడం, మరికొందరికి వేతనాలివ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. నాలుగైదు నెలలకే ఉద్యోగాలు మానుకున్న అభ్యర్థులు... రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా జిల్లాలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన 180 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించి వదిలేశారు. ఈ పథకంలో భాగస్వామ్యం పొందిన రెండు శిక్షణ సంస్థలు.. శిక్షణ పొందిన అభ్యర్థులకు ఒప్పందాల మేరకు ఉద్యోగాలు చూపించకపోవడంతో ప్రభుత్వం ఇటీవల వాటిని రద్దు చేసింది. పైగా, ఆయా కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారికి తగిన వేతనం ఇవ్వని పరిస్థితి నెలకొంది. పెరిగిన నిత్యావసరాల వస్తువుల ధరలతో పోలిస్తే ఏమాత్రం చాలీచాలని వేతనాలతో ఇబ్బందులుపడిన అభ్యర్థులు ఎవరికీ చెప్పకుండానే ఉద్యోగం మానుకున్నారు. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి కూడా ఆయా కంపెనీలు 3,500 నుంచి 5 వేల రూపాయలు మాత్రమే వేతనాలుగా ఇస్తుండటంతో సంబంధిత అభ్యర్థులు నాలుగైదునెలలకే ఉద్యోగం మానుకున్నారు. రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో 50 శాతం మంది ఆయా ఉద్యోగాలు మానేసి మళ్లీ ఉపాధి వేటలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే, ఆయా సంస్థల యాజమాన్యాలే మరికొందరిని తొలగించాయి. వారంతా మళ్లీ రోడ్లపై పడటంతో పట్టణ పేదరిక నిర్మూలన కలగానే మిగిలింది. రాజీవ్ యువకిరణాలు పథకం వల్ల నిధులు దుర్వినియోగం తప్ప ఫలితం లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు గొప్పలు చెప్పుకోవడం మానుకుని నిరుద్యోగ సమస్యను పరిష్కరించి పేదరికాన్ని నిర్మూలించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. -
జూపాడు‘బంగ్లా’అక్రమాలు నిండా!
జూపాడుబంగ్లా, న్యూస్‌లైన్: పేదలకు గూడు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం.. అధికార పార్టీ నాయకుల అనుచరులకు వరంగా మారింది. జూపాడుబంగ్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణంలో అవినీతి గూడు కట్టుకుంది. ఇల్లు మంజూరు నుంచి బిల్లుల పంపిణీ వరకు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు సైతం అధికారపార్టీ నేతల కనుసన్నల్లో మెలగాల్సిన పరిస్థితి దాపురించింది. గ్రామానికి మొదట, రెండో విడత రచ్చబండ కింద 177, ఎమ్మెల్యే కోటా కింద 60 గృహాలు మంజూరయ్యాయి. వీటిని అధికార పార్టీ మద్దతుదారుల్లో 140 మంది చేజిక్కించుకున్నారు. వీటిలో చాలా వరకు చనిపోయినా, ఊర్లో లేకున్నా వారి పేర్ల మీదనే మంజూరయ్యాయి. లబ్ధిదారులు గృహాలు నిర్మించుకున్న తర్వాత గృహ నిర్మాణశాఖ అధికారులు పరిశీలించి ఆధారాలు చూపే ఫొటోను ఆన్లైన్లో పొందుపర్చిన తర్వాత బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేశారు. ఇల్లు నిర్మించక పోయినా బిల్లులు చకచకా అవుతున్నాయి. నిజమైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసినా బిల్లులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. అంతేకాకుండా లబ్ధిదారుడు ఇంటిని నిర్మించుకోవటానికి ముందు పొజిషన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంది. అయితే రెవెన్యూ అధికారులు స్థలాలను పరిశీలించకుండానే రూ. 300 - 500 వరకు తీసుకుని పొజిషన్ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. జూపాడుబంగ్లా గృహ నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిపై డీఈ చంద్రపాల్‌ను వివరణ కోరగా అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఏన్కూరు, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఏన్కూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వైరా నియోజకవర్గంలోని గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాలకు చెందిన 1250 మంది నిరుపేద గిరిజన రైతులకు 2150 ఎకరాలను పంపిణీ చేశామని అన్నారు. రానున్న రోజుల్లో భూమి లేని గిరిజన రైతులను గుర్తించి పట్టాలు పంపిణీ చేస్తామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూ పంపిణీ ప్రవేశపెట్టారని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకాన్ని ప్రవేశపెట్టలేదని, అది కేవలం మనరాష్ట్రంలో మాత్రమే ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే బాణోత్ చంద్రావ తి, జేసీ సురేంద్రమోహన్, కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమా ర్, జూలూరుపాడు, ఏన్కూరు, కారేపల్లి తహశీల్దార్లు తిరుమలాచారి, నాగమల్లేశ్వరరావు, రజని, అధికారులు పాల్గొన్నారు.