జూపాడుబంగ్లా, న్యూస్‌లైన్: పేదలకు గూడు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం.. అధికార పార్టీ నాయకుల అనుచరులకు వరంగా మారింది. జూపాడుబంగ్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణంలో అవినీతి గూడు కట్టుకుంది. ఇల్లు మంజూరు నుంచి బిల్లుల పంపిణీ వరకు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు సైతం అధికారపార్టీ నేతల కనుసన్నల్లో మెలగాల్సిన పరిస్థితి దాపురించింది.
గ్రామానికి మొదట, రెండో విడత రచ్చబండ కింద 177, ఎమ్మెల్యే కోటా కింద 60 గృహాలు మంజూరయ్యాయి. వీటిని అధికార పార్టీ మద్దతుదారుల్లో 140 మంది చేజిక్కించుకున్నారు. వీటిలో చాలా వరకు చనిపోయినా, ఊర్లో లేకున్నా వారి పేర్ల మీదనే మంజూరయ్యాయి. లబ్ధిదారులు గృహాలు నిర్మించుకున్న తర్వాత గృహ నిర్మాణశాఖ అధికారులు పరిశీలించి ఆధారాలు చూపే ఫొటోను ఆన్‌లైన్‌లో పొందుపర్చిన తర్వాత బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేశారు. ఇల్లు నిర్మించక పోయినా బిల్లులు చకచకా అవుతున్నాయి.
నిజమైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసినా బిల్లులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. అంతేకాకుండా లబ్ధిదారుడు ఇంటిని నిర్మించుకోవటానికి ముందు పొజిషన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంది. అయితే రెవెన్యూ అధికారులు స్థలాలను పరిశీలించకుండానే రూ. 300 - 500 వరకు తీసుకుని పొజిషన్ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. జూపాడుబంగ్లా గృహ నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిపై డీఈ చంద్రపాల్‌ను వివరణ కోరగా అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జూపాడు‘బంగ్లా’అక్రమాలు నిండా!
Published Sat, Feb 8 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement