Jupadubangla
-
ధర్మారెడ్డికి వైఎస్ విజయమ్మ పరామర్శ
సాక్షి, నంద్యాల(జూపాడుబంగ్లా): పుత్రశోకంతో బాధపడుతున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పరామర్శించారు. మంగళవారం ఆమె ధర్మారెడ్డి స్వగ్రామమైన పారుమంచాలకు చేరుకొన్నారు. ముందుగా ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి చిత్రపటం వద్ద పూలువేసి నివాళులర్పించారు. అనంతరం ధర్మారెడ్డి దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడి ఓదార్చారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని తెలిపారు. వైఎస్ విజయమ్మ పారుమంచాలకు వస్తున్నారనే విషయం తెలిసి గ్రామస్తులు తండోపతండాలుగా ధర్మారెడ్డి ఇంటివద్దకు చేరుకొన్నారు. ఇంటి నుంచి బయటకు రాగానే గ్రామస్తులు ఆనందంతో కేకలువేస్తూ అభివాదం చేశారు. చదవండి: (టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సీఎం జగన్ పరామర్శ) -
నపుంసకునితో వివాహం చేశారని..
సాక్షి, జూపాడుబంగ్లా(కర్నూలు): నమ్మించి తనకు నపుంసకునితో వివాహం చేసి మోసం చేశారని మండ్లెం గ్రామానికి చెందిన మంతసాగరిక అనే యువతి సోమవారం జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ తిరుపాలు తెలిపిన వివరాలు.. మండ్లెం గ్రామానికి చెందిన సుశీలమ్మ కుమార్తె మంత సాగరికను కృష్ణగిరి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన కుమారస్వామి కుమారుడు వెంకటేశ్వర్లుకు ఇచ్చి 2018 ఆగస్టు 17న వివాహం చేశారు. వివాహమైనప్పటి నుంచి తన భర్త తనతో కాపురం చేయటం లేదని బాధితురాలు అత్త కృష్ణవేణి, మామ కుమారస్వామిలకు తెలియజేయటంతోపాటు డాక్టర్ల వద్ద చూపించినా ప్రయోజనం లేకపోయిందని పేర్కొంది. విషయం.. పుట్టింలోగానీ, ఇంకా ఎవరికైనా గానీ చెబితే చంపేస్తామంటూ శారీరకంగా, మానసికంగా తనను అత్త, మామలు చిత్రహింసలకు గురిచేశారని వాపోయింది. కొడుకు నపుంసకుడని తెలిసి తనను మోసం చేసి, అతనితో వివాహం చేసి, తనను మోసగించి, జీవితాన్ని నాశనం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. (చదవండి : ఘరానా మోసగాడు.. ఏడు పెళ్లిళ్లు) -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
జూపాడుబంగ్లా: జూపాడుబంగ్లాలో ఓ వృద్ధురాలు అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోవిందు సోదరి పెద్దక్క(68)కు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరందరికి పెళ్లిళ్లు కాగా దివ్యాంగురాలైన కుమార్తెతోపాటు ఆమె విడిగా నివాసం ఉంటున్నారు. గేదెల పోషణతో జీవనోపాధి పొందుతున్న ఆమె నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. మంగళవారం స్థానిక సిద్దేశ్వరం కాలనీకి సమీపంలో ఉన్న ఇసుకవాగులో పెద్దక్క మృతదేహం బయటపడింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో ఓ వ్యక్తికి ఆమె రూ. లక్ష అప్పు ఇవ్వగా.. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆ తర్వాత పెద్దక్క అదృశ్యమైంది. అయితే నాలుగు రోజులు గడిచినా కుటుంబీకులు, బంధువులు ఫిర్యాదు చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మృతురాలి కుమారుడు లక్ష్మన్న తమ తల్లి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుళ్లు డేనియల్ రాజు, సంజీవయ్య గ్రామానికి చేరుకుని వద్ధురాలి మృతిపై విచారణ చేస్తున్నారు. -
జూపాడు‘బంగ్లా’అక్రమాలు నిండా!
జూపాడుబంగ్లా, న్యూస్‌లైన్: పేదలకు గూడు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం.. అధికార పార్టీ నాయకుల అనుచరులకు వరంగా మారింది. జూపాడుబంగ్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణంలో అవినీతి గూడు కట్టుకుంది. ఇల్లు మంజూరు నుంచి బిల్లుల పంపిణీ వరకు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు సైతం అధికారపార్టీ నేతల కనుసన్నల్లో మెలగాల్సిన పరిస్థితి దాపురించింది. గ్రామానికి మొదట, రెండో విడత రచ్చబండ కింద 177, ఎమ్మెల్యే కోటా కింద 60 గృహాలు మంజూరయ్యాయి. వీటిని అధికార పార్టీ మద్దతుదారుల్లో 140 మంది చేజిక్కించుకున్నారు. వీటిలో చాలా వరకు చనిపోయినా, ఊర్లో లేకున్నా వారి పేర్ల మీదనే మంజూరయ్యాయి. లబ్ధిదారులు గృహాలు నిర్మించుకున్న తర్వాత గృహ నిర్మాణశాఖ అధికారులు పరిశీలించి ఆధారాలు చూపే ఫొటోను ఆన్లైన్లో పొందుపర్చిన తర్వాత బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేశారు. ఇల్లు నిర్మించక పోయినా బిల్లులు చకచకా అవుతున్నాయి. నిజమైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసినా బిల్లులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. అంతేకాకుండా లబ్ధిదారుడు ఇంటిని నిర్మించుకోవటానికి ముందు పొజిషన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంది. అయితే రెవెన్యూ అధికారులు స్థలాలను పరిశీలించకుండానే రూ. 300 - 500 వరకు తీసుకుని పొజిషన్ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. జూపాడుబంగ్లా గృహ నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిపై డీఈ చంద్రపాల్‌ను వివరణ కోరగా అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.