అసలే అడవి.. ఆపై చిమ్మ చీకటి... రాత్రయిందంటే ఏమీ కనిపించదు.. విషజంతువులు, సర్పాలు తిరిగే ప్రాంతం. అడవినే నమ్ముకున్న అడవిబిడ్డలు జీవించేది అక్కడే.. పాములు రాత్రివేళ ఇళ్లలోకి దూరి కాటు వేయడంతో బలయిన వారెందరో. అంధకారంలో ఆ జీవితాలు ముగుస్తున్నా.. వారి జీవితాల్లో వెలుగులు నింపడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో చెంచుల జీవితాలు చీకట్లోనే మగ్గుతున్నాయి.
అచ్చంపేట: నల్లమల అడవిలోని చెంచు పెంటలు వెలుగుకు నోచుకోవడం లేదు. చెంచులు చీకట్లో అటవీ జంతువులు, విషసర్పాల మధ్య సహజీవనం చేస్తున్నారు. రాత్రివేళ బొడ్డు గుడిసెలో కట్టెల మంటలు(నెగడి) పెట్టి కాలం వెళ్లదీస్తున్నారు. నెగడే చెంచుల ఇండ్లలో దీపం వెలుతురు. నెగళ్లే వారికి అటవీ జంతువుల నుంచి రక్షణగా నిలుస్తోంది. నెగిడి వల్ల గుడిసెలు తగలబడి అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఐటీడీఏ, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన సోలార్ ల్యాప్‌లు కూడా సక్రంగా పనిచేయడం లేదు. కోర్ ఏరియాలోని చెంచుపెంటల్లో విద్యుత్ సౌకర్యం లేక చెంచులు చీకట్లో కాలం గడుపుతున్నారు. అప్పాపూర్ చుట్టూ ఉన్న చెంచుపెంటలన్నింటినీ ఒకే దగ్గరికి చేర్చి విద్యుత్ సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం అటవీశాఖ నిబంధనలతో నీరుగారిపోయింది.
పరహాబాద్ చౌరస్తా నుంచి అప్పాపూర్‌కు 25కిలో మీటర్ల పొడవున భూగర్భ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 2007లో అప్పటి ప్రభుత్వం రూ. కోటిన్నర నిధులు మంజూరు చేసింది. అయతే, అట వీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. వన్యప్రాణులు, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, టైగర్ ఫారెస్టులో వేటగాళ్లు కరెంటు ఉపయోగించే అవకాశం ఉందన్న వాదన తెరపైకి తీసుకొచ్చారు. విద్యుత్ స్తంభాలకు అల్యూమినియం వైర్లు అమర్చి కరెంటు సరఫరా ఇస్తే సమస్య ఉత్పన్నం అవుతుంది తప్ప, భూగర్భం నుంచి కేబుల్‌వైర్లు వేయడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదని ట్రాన్స్‌కో అధికారులు అంటున్నారు. అప్పాపూర్‌కు రోడ్డు సౌకర్యం ఉండడం, రోడ్డు వెంట కేబుల్ వేయడం వల్ల అడవికి ఎలాంటి నష్టం లేకపోయినా వారు ఒప్పుకోవడం లేదు. కరెంటు సౌకర్యం లేకపోవడం వల్ల చీకటి పడిందంటే ఉన్న పది, పదిహేను బొడ్డుగుడిసెల వారికి ఒకరితో ఒకరికి సంబంధాలు తెగిపోతున్నాయి. వారు రాత్రి వేళ ఒకరిని ఒకరు పలకరించుకొనే పరిస్థితి లేదు. ఈ చెంచుపెంటల్లో ఎలుగుబంట్ల బె డద అధికంగా ఉంది. చీకటి పడిందంటే మా గుడిసెల్లోకి విషసర్పాలు వస్తుంటాయని.. వీటితోనే నిత్యం ఇబ్బంది పడుతున్నామని చెంచులు ఆవేదన వ్యకం చేస్తున్నారు. గతంలో చెంచులకు మైదాన ప్రాంత గ్రామాలతో సంబంధం లేకపోయేది. ప్రస్తుతం మారిన కాలానుగుణగా వారికి గ్రా మాలతో ఇప్పుడు ఇప్పుడే సంబంధాలు ఎర్పడుతున్నాయి. దీనివల్ల గ్రామాల్లో ఉండే మౌలిక వసతులు, సదుపాయాలు, విద్యుత్, తాగునీటి వంటి వసతులు చూసి వారు ఆశ్యర్యపోతున్నారు. ఈ వసతులు మాకు అడవిలో ఉంటే బాగుండేదన్న ఆభిప్రాయం వెలువరిస్తున్నారు.
కరెంటులేని పెంటలు..
మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో నల్లమల విస్తరించి ఉంది. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 112 చెంచుగూడెలలో 7,500 జనాభా ఉంది.హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారిలో ఉన్న వట్టువర్లపల్లి, సార్లపల్లికి మన్ననూర్ నుంచి ప్రభుత్వం విద్యుత్ సౌకర్యం కల్పించినా.. మిగతా చెంచుపెంటలకు ఇవ్వలేకపోతుంది. సార్లపల్లి- కుడిచింతలబైలు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. సార్లపల్లికి క రెంటు ఇచ్చిన అధికారులు కుడిచింతలబైలుకు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిలో పర్హాబాద్ చౌర స్తా వద్ద వట్టువర్లపల్లికి విద్యుత్ లైన్ ఉంది. ఇక్కడి నుంచి మల్లాపూర్ 7 కిలోమీటర్లు, మల్లాపూర్ మలుపు నుంచి పుల్లాయిపల్లి 15 కిలోమీటర్లు, పుల్లాయిపల్లి నుంచి రాంపూర్ 5 కిలోమీటర్లు, ఆగర్లపెంట 15 కిలోమీటర్లు, అప్పాపూర్ 4 కిలోమీటర్లు ఉంటుంది.
అప్పాపూర్-బౌరపూర్ 12 కిలోమీటర్లు, బౌరపూర్ - మెడిమొల్క ల 8 కిలోమీటర్లు, మెడిమొల్కల- ఈర్లపెంట 10 కిలోమీటర్లు, ఈర్లపెంట నుంచి సంగండిగుండాలు 12 కిలోమీటర్లు, సంగండిగుండాలు -తాటిగుండాలు 6 కిలోమీటర్లు, తాటిగుండా లు-పందిబొర్రె 7కిలోమీటర్లు దూరం ఉం టుంది. మద్దిమడుగు- గీసుగండి 16 కిలోమీటర్లు, పదర-కండ్లకుంట 4కిలోమీటర్లు ఉం టుంది. ఈ చెంచుపెంటలకు కరెంటు ఇవ్వడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టక పోవడంతో వారు నేటికీ చీకట్లో జీవిస్తున్నారు.
పనిచేయని సోలార్ దీపాలు...
అప్పాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, మల్లాపూర్, బౌరపూర్ చెంచు పెంటలకు సోలార్ ల్యాంపులు అందజేసినా అవి పనిచేయడం లేదు. ఐటీడీఏ ఏర్పాటు చేసిన వీధి దీపాలు, గుడిసెలపై అమర్చిన సోలార్ ప్లేట్ నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. పోలీసుశాఖ చెంచులకుపంపిణీ చేసిన టీవీలు మూలకు పడ్డాయి. విద్యుత్తుకు బదులు ప్రత్యామ్నాంగా ఉపయోగిస్తున్న సోలార్ దీపాలు పనిచేయకపోవడంతో చెంచులు చీకట్లో కాలం గడుపుతున్నారు. అప్పాపూర్ ఆశ్రమ పాఠశాల ఆవరణలో సోలారాసీస్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంటికో బల్బు, వీధిలైట్లు ఏర్పాటు చేసి చెంచుపెంట అంతటా వెలుతురు ఇచ్చేలా ఏర్పాటు చేసిన అదికూడా పనిచేయడం లేదు.
అప్పాపూర్ ఒక్కటే వెలుగుకు నోచుకొంటే మేమంతా చీకట్లో ఉండాలా అని ఈర్లపెంటకు చెందిన ఒక యువకుడు సోలార్ ప్లేట్ తీసుకెళ్లాడు. తర్వాత ఆశ్రమ పాఠశాలపై ఉన్న మరో నాలుగు ప్లేట్లు కూడా తీసుకెళ్లడంతో పూర్తిగా సోలార్ వెలుతురు నిలిచిపోయింది. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన సోలార్ సిస్టం నేడు నిరుపయోగంగా ఉంది.
చీకట్లో చెంచులు
Published Fri, Feb 27 2015 11:54 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement