రుణలక్ష్యం రూ.100 కోట్లు.. ఇచ్చింది 0 | includes Rs 100 crore .. 0 | Sakshi
Sakshi News home page

రుణలక్ష్యం రూ.100 కోట్లు.. ఇచ్చింది 0

Published Fri, Dec 26 2014 1:59 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

రుణలక్ష్యం రూ.100 కోట్లు.. ఇచ్చింది 0 - Sakshi

రుణలక్ష్యం రూ.100 కోట్లు.. ఇచ్చింది 0

నెల్లూరు(అగ్రికల్చర్): రుణమాఫీలో కౌలురైతులకు మొండిచేయి చూపించిన సర్కారు నూతన రుణ మంజూరులోను అలసత్వం ప్రదర్శిస్తోంది. కౌలు రైతుల కష్టాలు దేవుడికే ఎరుక అన్నట్లు బాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ముగిసి, రబీ ప్రారంభమైనా ఇప్పటికి కౌలు రైతులను పట్టించుకున్న నాధుడే లేరు.
 
 జిల్లాలో కౌలు రైతులకు ఈఏడాది రూ.100 కోట్ల రుణాలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా, ఇప్పటివరకు కౌలురైతులకు ఒక్క రూపాయి కూడా రుణం మంజూరు చేయలేదంటే వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుంది. జిల్లావ్యాప్తంగా లక్షమంది కౌలురైతులను ఈఏడాది ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఖరీఫ్‌లో అప్పులపాలయ్యారు. సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెట్టుబడులకు అందినచోటల్లా అప్పులు చేశారు. ఏదో ఒక సమయంలో ప్రభుత్వం పట్టించుకోకపోతుందా అని ఆశించిన కౌలు రైతులకు నిరాశే ఎదురవుతోంది. చివరకు అప్పులే మిగిలేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.
 
  ప్రభుత్వ లక్ష్యాల మేరకు పంట రుణాలు అందించడం, వివిధ కారణాలతో పంటలను నష్టపోయిన కౌలుదారులను ఆదుకుని, తిరిగి సాగుకు ప్రోత్సహించే విధంగా 2011లో భూ అధికృత రైతుల చట్టాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా కౌలురైతులను గుర్తించి కార్డులను అందజేయాలి. తద్వారా బ్యాంకు రుణం పొందే అవకాశం కల్పించాలి. అయితే ప్రభుత్వం కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏదో మొక్కుబడిగా కౌలు రైతుల గుర్తించి చేతులు దులుపుకొంది. జిల్లావ్యాప్తంగా లక్షమంది కౌలు రైతులు ఉన్నట్లు సమాచారం. కౌలురైతు గుర్తింపు కార్డులను పొందాలంటే భూయజమానులు రిజిస్ట్రర్ కౌలుకు అంగీకరించాలి. ఈ మేరకు రెవెన్యూ అధికారులు వారిని గుర్తించి గుర్తింపుకార్డులను అందజేస్తారు.
 
 ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామమాత్రపు సంఖ్యలో గుర్తింపుకార్డులను ఇచ్చి చేతులు దులుపుకోవడంతో కౌలురైతుల నానాఅగచాట్లు పడుతున్నారు.  జిల్లాలో 50వేల మంది కౌలు రైతులున్నట్లు గుర్తించి భూఅధీకృత గుర్తింపు కార్డు( రుణ అర్హత పత్రం)లను పంపిణీ చేశారు. గత ఏడాది బ్యాంకులు వీరికి నామమాత్రంగానే రుణాలను మంజూరు చేశాయి. కేవలం 4,870 మందికి మాత్రమే రూ.22.19 కోట్ల రుణాలను వివిధ బ్యాంకులు అందజేశాయి. రుణమాఫీ నేపథ్యంలో ఈ ఏడాది బ్యాంకులు రుణాలను ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడం, రుణ మంజూరుకు బ్యాంకర్లు విముఖత వ్యక్తం చేయడంతో కౌలురైతులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఖరీఫ్ ఆరంభంలో వాతావరణం అనుకూలించకపోవడం, పెరిగిన ఎరువుల ధరలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. సాగు పెట్టుబడిలతో పాటే అప్పులూ పెరిగాయి. కనీసం రబీ సీజన్‌లోనైనా బ్యాంకులు రుణాలిస్తాయని ఎదురుచూసిన రైతులకు భంగపాటు తప్పలేదు. రబీ సీజన్ రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు బ్యాంకులు ఒక్క రూపాయి కూడా రుణం మంజూరు చేయకపోవడంతో కౌలు రైతులు తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలే తెలియక తలలు పట్టుకుంటున్నారు.
  గుర్తింపు కార్డు ఉంటేనే రుణం...
 -వెంకటేశ్వర్లు, లీడ్ డిస్ట్రిక్ బ్యాంకు
 మేనేజరు(ఎల్‌డీఎం)
 
 కౌలురైతులకు రెవెన్యూ అధికారులు మంజూరు చేసిన గుర్తింపుకార్డుల ఆధారంగా బ్యాంకులు పంటరుణాలను మంజూరు చేస్తాయి. ఈ ఏడాది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలను అందజేయడంలో అలస్యమైనందున రుణం మంజూరు చేయలేదు. త్వరలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు కౌలు రైతులకు రుణాలను అందించే దిశగా చర్యలను తీసుకుంటాం. ఈ మేరకు కౌలు రైతులు గుర్తింపుకార్డులను తీసుకుని ఆయా బ్యాంకులలో రుణాలను పొందాలి. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో కూడా కౌలురైతులను లబ్ధిదారులుగా ఎంపిక చేశాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement