సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉద్యోగానికి బదులు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఉపాధి కల్పనకు తలపెట్టిన స్వయం ఉపాధి పథకాలు నీరసించాయి. నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటం... పథకాల వార్షిక కార్యా చరణను ఆమోదించడంలో తాత్సారం చేయడంతో నిరుద్యోగుల ఆశలు గల్లంతవుతున్నాయి. దరఖాస్తులు సమర్పించిన వారు ఆమేరకు యూనిట్ల ఏర్పాటుకు ఏళ్లుగా ఎదురు చూడాల్సి వస్తోంది.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల పరిధిలో దాదాపు 10.29లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలించి అర్హతను నిర్ధారించాల్సిన బాధ్యత ఆర్థిక సహకార సంస్థలపై ఉంది.ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పరిశీలన మొదలుపెట్టి అర్హులను గుర్తించి రాయితీ పంపిణీ చేయాలి. ఇది పూర్తిగా గాడితప్పింది. కార్పొరేషన్లు సమర్పించిన వార్షిక ప్రణాళికలకు ప్రభుత్వం ఆమోదించకపోవడంతో పరిశీలన సైతం ప్రారంభం కాలేదు.
రెండుసార్లు వెయ్యికోట్లు...
ఎంబీసీ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వెయ్యి కోట్ల వంతున రెండుసార్లు కేటాయించింది. తొలి ఏడాది ఎంబీసీ కులాలపై స్పష్టత లేకపోవడంతో గందరగోళంలో పడ్డా... ఆ తర్వాతి ఏడాది వీటిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీ పథకాల పంపిణీపై గందరగోళం వీడలేదు. నిధులు కేటాయించినప్పటికీ... లబ్ధిదారుల ఎంపికపై యంత్రాంగం శ్రద్ధ తీసుకోలేదు. దీంతో కేటాయించిన నిధులు ఏటా మురిగిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment