MBC corporation
-
ఈ నెల 19న ముంబైకి ప్రధాని రాక.. బీఎంసీ ఎన్నికల కోసమేనా?
సాక్షి, ముంబై: ప్రధాని మోదీ జనవరి 19న ముంబైని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేయనున్నారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేస్తారు. కాగా, జనవరి 15 నుంచి 19 వరకు దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరుకావాల్సి ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో తమ ప్రణాళికను మార్చుకోవచ్చు. మెట్రో 2ఏ, 7 లైన్ల ప్రారంభం.. ఈ పర్యటనలో సెంట్రల్ పార్క్–బేలాపూర్ స్టేషన్ల మధ్య నవీ ముంబై మెట్రో యొక్క 5.96–కిమీ విస్తరణను ప్రధాని ప్రారంభించనున్నట్లు సమాచారం. అలాగే ముంబై మెట్రో యొక్క 2ఏతోపాటు 7వ లైన్లలోని 35 కి.మీ. విస్తరణ కూడా అదే రోజున ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ రెండు మెట్రో లైన్లు లింక్ రోడ్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే గుండా వెళతాయి. వీటివల్ల ఈ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ తగ్గడంతోపాటు ప్రస్తుతం ఉన్న సబర్బన్ లోకల్ రైలు సరీ్వసుల్లోనూ రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. 2022 ఏప్రిల్‌లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మొదటి దశ 2ఏ, 7 లైన్లను ప్రారంభించారు. ఈ రెండు లైన్లు మొత్తం 30 స్టేషన్లు, 35 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌తో ఉన్నాయి. ఇవి రోజుకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవని మహా ముంబై మెట్రో ఆపరేషన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఎంఓసీఎల్) అధికారులు తెలిపారు. రూ.1,750 కోట్ల విలువైన పనుల శంకుస్థాపన మెట్రోతోపాటు వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్టు, ముంబైలో 400 కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఆప్లీ చికిత్సా (మన వైద్యం) ప«థకంలో భాగంగా భాండూప్‌లో నిరి్మంచనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఓషీవరాలో ప్రసూతి గృహం, గోరేగావ్‌లోని సిద్ధార్ధ్ ఆస్పత్రి పునరుద్ధరణ పనులు.. మొత్తం రూ.1,750 కోట్ల ఖర్చుతో కూడిన 500పైగా అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇందులో వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్టు పనులకు రూ.26 వేల కోట్లు, ముంబైలో 400 కిలోమీటర్ల సీసీ రోడ్డు పనులకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అదేవిధంగా ముంబైలో లక్షా మంది హాకర్లకు ప్రధాని సొంత నిధి పథకం ద్వారా రూ.10 వేల చొప్పున రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. బీఎంసీ ఎన్నికల కోసమేనా? ఇదిలా ఉండగా బీఎంసీ ఎన్నికల తేదీ ఇంకా ఖరారు కాలేదు. అయినా.. ప్రధాని ముంబై పర్యటనకు రావడం, వివిధ అభివృద్ధి పనులు జాతికి అంకితం చేయడం, కొన్ని పనులకు శంకు స్ధాపన చేయడాన్ని బట్టి త్వరలో బీఎంసీ ఎన్నికల నగారా మోగుతుండొచ్చని రాజకీయ పారీ్టలు చర్చిస్తున్నాయి. ఇప్పటికి బీఎంసీ కార్పొరేటర్ల పదవి కాలం గడువు ముగిసి సంవత్సరం కావస్తోంది. అప్పటి నుంచి కార్పొరేషన్లన్నీ ఖాళీగా ఉన్నాయి. 2022 మార్చి 8వ తేదీ నుంచి బీఎంసీ పరిపాలన పగ్గాలు అడ్మిన్ చేతిలోకి వచ్చాయి. అప్పటి నుంచి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అని మాజీ, సిట్టింగ్ కార్పొరేటర్లతోపాటు ఆశావాహులందరు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ముంబై పర్యటనతో అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి. -
బడుగులకు బలిమి
సాక్షి, అమరావతి: సంచార జాతికి చెందిన ఈయన పేరు పెండ్ర వీరన్న. ఉండేది పూరి గుడిసెలో. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురం సౌత్ గ్రామానికి చెందిన వీరన్న సంచార జాతుల అభ్యున్నతి కోసం అహరహం శ్రమించేవారు. వీరన్న కృషిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనను అత్యంత వెనుకబడిన సంచార జాతుల (ఎంబీసీ) కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఈమె పేరు జింకా విజయలక్ష్మి. న్యాయవాద వృత్తి చేపట్టి సివిల్, క్రిమినల్ కేసుల వాదనలో పట్టు సాధించారు. సామాజిక, రాజకీయ రంగాల్లో చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఆమెకు ఏపీ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు సీఎం వైఎస్ జగన్. వీరిద్దరే కాదు.. వెనుకబడిన తరగతులకు చెంది.. నాయకత్వ లక్షణాలు కలిగి.. తమ జాతి అభివృద్ధిని కాంక్షించే వారిని, రాజకీయ రంగం ద్వారా సమాజానికి మేలు చేయాలనే తపన గల వారిని ఏరికోరి వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో 139 బీసీ కులాలకు 56 వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లను 2020 అక్టోబర్‌లో ఏర్పాటు చేశారు. ఆయా సామాజిక వర్గాల్లోని పేదలకు అండగా నిలిచి ఇబ్బందులను దూరం చేసేలా.. వారందరికీ ఆర్థిక, సామాజిక బలిమి చేకూరేలా సంబంధిత కార్పొరేషన్లను తీర్చిదిద్దారు. కార్పొరేషన్లను సామాజిక చైతన్య వేదికలుగా మలిచి రాష్ట్రంలో కొత్త చరిత్రకు సీఎం జగన్ నాంది పలికారు. వాస్తవానికి వెనుకబడిన తరగతుల్లో బయట ప్రపంచానికి పేర్లు సైతం తెలియని కులాలను కూడా గుర్తించారు. అత్యంత వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురైన అనేక కులాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కార్పొరేషన్‌కు ఒక చైర్మన్, 12 డైరెక్టర్లను నియమించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక రికార్డు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్ల చైర్మన్లు, 672 డైరెక్టర్ల పదవుల్లో 50 శాతం పదవులను మహిళలకే కట్టబెట్టి మరో రికార్డును నెలకొల్పారు. -
సంచార జాతులకు సీఎం పెద్దపీట
సాక్షి, అమరావతి: సంచార జాతులకు ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక నేత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న అధ్యక్షతన సంచార జాతుల రాష్ట్రస్థాయి ముఖ్య నేతల సమావేశం మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని, వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్ పూర్తి న్యాయం చేస్తున్నారని తెలిపారు. సమాజంపై, ప్రజలపై ముఖ్యమంత్రికి ప్రేమ ఉండటంవల్లే ఇది సాధ్యమైందన్నారు. సీఎం చెప్పినట్లు అందరూ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భారతీయ సమాజానికి సంస్కృతి నేర్పింది బీసీలేనని.. అలాంటి వర్గాలు వారి వెనుకబాటుతనానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బీసీల అభ్యున్నతికి ఆనాడు దివంగత సీఎం వైఎస్సార్, నేడు ఆయన తనయుడు సీఎం జగన్ చేసినట్లు మరే ఇతర ముఖ్యమంత్రులు చేయలేదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బీసీల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. ఎంబీసీల్లో ఉన్న 32 ఉప కులాల సంక్షేమం కోసమే దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని సజ్జల చెప్పారు. సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోండి బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం రాజ్యమేలుతోందని.. దీన్ని వెనుకబడిన తరగతుల్లోని అన్ని కులాల వారు సంక్షేమ ఫలాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, మోస్ట్ బ్యాక్‌బోన్ క్యాస్ట్ అని సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎలుగెత్తి చాటిందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన కూడు, గూడు, గుడ్డకు కూడా నోచని దుర్భర స్థితిలో ఉన్న సంచార జాతుల జీవనంలో సమూలమైన మార్పు తెచ్చేందుకు సీఎం జగన్ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్పారు. -
సంచార జాతులకు ప్రాధాన్యత ఇచ్చిన నేత సీఎం జగన్
-
సంచార జాతులకు ప్రాధాన్యత ఇచ్చిన నేత సీఎం జగన్
సాక్షి, అమరావతి: సంచార జాతులకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని, వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో ఇన్ని అవకాశాలు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. సమాజంపై, ప్రజలపై సీఎం జగన్‌కు ప్రేమ ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. సీఎం చెప్పినట్లు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా పెండ్ర వీరన్న
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా పెండ్ర వీరన్న ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పెండ్ర వీరన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సంచార జాతులకు చెందిన వ్యక్తిని స్టేట్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అనడానికి ఇదే నిదర్శనం. ప్రజా సంకల్ప యాత్రలో సంచార జాతులకు వైభవం తీసుకు వచ్చే కార్యక్రమాలు చేపడతాం అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే సంచారజాతులకు న్యాయం జరిగే విధంగా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుంది. గత ప్రభుత్వాలు బీసీ కులస్తులను మభ్యపెట్టి మోసం చేశారు. నాపై నమ్మకంతో పదవి కట్టబెట్టిన సీఎం జగన్‌కు, వైఎస్సార్సీపీకి వన్నె తెస్తాను. అని పేర్కొన్నాడు. బీసీ కార్పొరేషన్ల ద్వారా అన్ని సామాజిక వర్గాల్లో అభివృద్ధి చేస్తాం.. సీఎం జగన్ మోహన్ రెడ్డి కలలు నిజం చేస్తాం అని విశాఖ జిల్లాకు చెందిన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ బీసీ కార్పొరేషన్ చైర్మన్ లను సీఎం జగన్ ప్రకటించడం పట్ల విశాఖ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు సంబంధించి మొత్తం ఐదుగురు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కే వీళ్ళు ముగ్గురు మహిళలు. తద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల అభివృద్ధి ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదాన్ని రుజువు చేశారని పేర్కొన్నారు ఈ మేరకు చైర్మన్ పదవులు దక్కిన నేతలు తమ సామాజిక వర్గం అభివృద్ధి అన్ని రకాలుగా పనిచేస్తామని అన్నారు. తాజాగా కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం పట్ల హర్షం తోపాటు బాధ్యతాయుతంగా పనిచేస్తానని మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు పేర్కొన్నారు. -
ఎంబీసీలకు మరో ఛాన్స్
సాక్షి, విజయనగరం : గత ప్రభుత్వం వారిని మభ్యపెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్‌గా భావించిన వారు స్వయం ఉపాధి నిమిత్తం రుణాలకోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసినా వాటిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రుణ పరిమితిని రూ. 50వేలకు పెంచింది. అంతేగాకుండా మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జిల్లాలో 32 కులాలను ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించింది. వీరు చేసుకునే వృత్తిని బట్టి రూ.30వేలు (90 శాతం రాయితీ) రుణాలను నాన్‌బ్యాకింగ్, ఆ పై లక్షదాకా రుణాలను బ్యాంకింగ్ ద్వారా ఇచ్చేందుకు ఆదేశాలిచ్చింది. అప్పట్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలాగైనా బీసీ ఓటర్ల ను ఆకర్షించేందుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో మంది ఎంబీసీలు ఆన్లైన్లో రుణాలకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి ఈ రుణాలు ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం మోసం చేసింది. ప్రోత్సహిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ గతంలో జరిగిన అక్రమాలు, ఎన్నికల్లో బీసీలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన కుట్రలను గమనించి వాటిని రద్దు చేసింది. ఎంబీసీ రుణాల కోసం అవసరమైన ధ్రువపత్రాలతో ఆన్లైన్లో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంతేగాదు ఎంబీసీ రుణాలను రూ.30వేల నుంచి రూ.50వేలకు పెంచిం ది. ఈ రుణాలను 90 శాతం రాయితీతో అందిస్తున్నామని ప్రకటించింది. రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 30వ తేదీ వరకు గడువునిచ్చింది. అవకాశం దక్కడంతో మళ్లీ ఎంబీసీ లు ధ్రువ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకునే పనిలో పడ్డారు. అత్యంత వెనుకబడిన కులాలంటే... సంచారం చేస్తూ జీవనం సాగించే సంచార జాతులుగా గుర్తించి, దారిద్య్రరేఖకు అత్యంత దిగువన గల 32 వెనుకబడిన తరగతులకు చెందిన కులాలైన బాలసంతు, బందార, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దులవారు, జంగం, జోగి, కాటికాపల, కొరచా, మొండివాళ్లు, పిచ్చి గుంట్ల, పాములోళ్లు, పర్థి, పంబాల, దమ్మలి, వీర ముష్టి, గుడల, కంజరబట్ట, రెడ్డిక, మండపట్ట, నొక్కర్, పరికిముగ్గుల, యాట, చోపెమరి, కైకడి, జోషినన్, దివలస్, మండుల, కునపులి, పట్రా, రాజన్నల, కసిగపడి కులాల ప్రజలు రుణాలు పొందటానికి అర్హులు, గతేడాది జిల్లాలో 1590 మందికి రూ.4.78 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారులు కోరుకున్నట్లయితే ఆయుర్వేదిక్ షాపులు, పండ్ల వ్యాపారం, బ్యాంగిల్‌స్టోర్స్, పూసల వ్యాపారం, పూల బొకే వ్యాపారం, కొవ్వొత్తుల తయారీ, హెయిర్ కలెక్షన్, కార్పెట్స్ తయారీ, చికెన్ షాపులు, కారప్పొడి తయారీ, కొబ్బరికాయల వ్యాపారం, కూల్‌డ్రింక్ షాపు, గుడ్ల వ్యాపారం, చేపల వ్యాపారం, పిండిమిల్, కూరగాయల వ్యాపారం, పచ్చళ్ల తయారీ, పాన్ లేదా సోడా షాపు, తదితర యూనిట్లను ఏర్పాటుచేసుకోవచ్చు. అయితే గత ప్రభుత్వం కనీసం ఒక్కరికైనా రుణం అందజేయకపోవటం విశేషం. ఎంబీసీలు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి అత్యంత వెనుకబడినతరగతులకు చెందిన వారు 21 నుంచి 50 సంవత్సరాలలోపు వయ స్సు కలిగి ఉడి, పట్టణ ప్రాంతా ల వారి ఆదాయం రూ.75వేలు, గ్రామీణ ప్రాంతాల వారి ఆదాయం రూ.60వేలు కలిగిన వారు అర్హులు. గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా ఎలాంటి ఆర్థిక సహాయం పొందనివారు అర్హులు. గతంలో దరఖాస్తు చేసుకున్నా... రుణాలు మంజూరు కానివారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. – ఆర్.వి నాగరాణి, ఈడీ, బీసీ కార్పొరేషన్, విజయనగరం -
పెండింగ్‌లో 10 లక్షలు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉద్యోగానికి బదులు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఉపాధి కల్పనకు తలపెట్టిన స్వయం ఉపాధి పథకాలు నీరసించాయి. నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటం... పథకాల వార్షిక కార్యా చరణను ఆమోదించడంలో తాత్సారం చేయడంతో నిరుద్యోగుల ఆశలు గల్లంతవుతున్నాయి. దరఖాస్తులు సమర్పించిన వారు ఆమేరకు యూనిట్ల ఏర్పాటుకు ఏళ్లుగా ఎదురు చూడాల్సి వస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల పరిధిలో దాదాపు 10.29లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలించి అర్హతను నిర్ధారించాల్సిన బాధ్యత ఆర్థిక సహకార సంస్థలపై ఉంది.ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పరిశీలన మొదలుపెట్టి అర్హులను గుర్తించి రాయితీ పంపిణీ చేయాలి. ఇది పూర్తిగా గాడితప్పింది. కార్పొరేషన్లు సమర్పించిన వార్షిక ప్రణాళికలకు ప్రభుత్వం ఆమోదించకపోవడంతో పరిశీలన సైతం ప్రారంభం కాలేదు. రెండుసార్లు వెయ్యికోట్లు... ఎంబీసీ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వెయ్యి కోట్ల వంతున రెండుసార్లు కేటాయించింది. తొలి ఏడాది ఎంబీసీ కులాలపై స్పష్టత లేకపోవడంతో గందరగోళంలో పడ్డా... ఆ తర్వాతి ఏడాది వీటిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీ పథకాల పంపిణీపై గందరగోళం వీడలేదు. నిధులు కేటాయించినప్పటికీ... లబ్ధిదారుల ఎంపికపై యంత్రాంగం శ్రద్ధ తీసుకోలేదు. దీంతో కేటాయించిన నిధులు ఏటా మురిగిపోతున్నాయి. -
నిధుల కేటాయింపుల్లో వెనుకబాటు..
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో బీసీసంక్షేమానికి ప్రాధా న్యం తగ్గింది. 2019–20 వార్షిక సంవత్సరా నికి వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.4,528.01 కోట్లు మాత్రమే కేటాయించింది. గత కేటాయింపు లతో పోలిస్తే ఈసారి బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.1,391.82 కోట్లు తగ్గింది. జనాభాలో సగం ఉన్న బీసీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి కేటాయించా లని గత కొంతకాలంగా డిమాండ్ వస్తుండగా 2017 డిసెంబర్ నెలలో బీసీల సంక్షేమంపై సీఎం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2018– 19 వార్షిక బడ్జెట్లో బీసీ ప్రత్యేక అభివృద్ధి నిధిని అమల్లోకి తీసుకొస్తారని అంతా భావించినా బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 850కోట్లు అదనంగా కేటాయించి కొంత ప్రాధాన్యమిచ్చారు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో అదే తరహా ప్రాధాన్యం దక్కు తుందని భావించినా తాజా బడ్జెట్ గణాంకాలను చూస్తే పెద్ద మొత్తానికి కోత పెట్టడం గమనార్హం. అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 2017–18 వార్షిక సంవత్సరంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. అదేతరహాలో 2018–19లో రూ.వెయ్యి కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో కూడా రూ. 1,000 కోట్లు కేటాయించింది. తొలి ఏడాది నిధులు కేటాయించినా ఎంబీసీలపై స్పష్టత రాకపోవడంతో ఆ నిధులను ఖర్చు చేయ లేదు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో ఎంబీసీలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసినా.. ఎంబీసీ కార్పొరేషన్ మాత్రం రూ.50కోట్లు ఖర్చు చేసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కానీ రాయితీ రుణాలు, స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై పెద్దగా స్పందన లేదు. తాజా బడ్జెట్లో రూ. 1,000 కోట్లు కేటాయించగా ఈ సారైనా పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తారో లేదో చూడాలి. అయితే బీసీ కార్పొరేషన్, 12 బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. 2019–20 వార్షిక సంవత్సరంలో రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో బీసీలకు 23 గురుకులాలే ఉండగా.. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని 2017–18 వార్షిక సంవత్సరంలో 119 గురుకులాలను ఏర్పాటు చేసింది. తాజాగా మరో 119 గురుకులాలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ ఏడాది జూన్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. సంక్షేమానికి తగ్గిన కేటాయింపులు గతేడాది కంటే రూ.170.58 కోట్లు తక్కువ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ సంక్షేమానికి ప్రాధాన్యత దక్కలేదు. 2019–20 వార్షిక సంవత్సరానికి ఈ శాఖకు రూ.1,628.24 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే తాజా కేటాయింపుల్లో రూ.170.58 కోట్లు తగ్గింది. 2018–19 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.1,798.82 కోట్లు, 2017–18లో రూ.1,731.50 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయిం చింది. కొత్త పథకాలేవీ ప్రవేశపెట్టనప్పటికీ గతేడాది నుంచి అమల్లోకి వచ్చి న స్త్రీ శక్తి కేంద్రాలు, సఖి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోలేదు. పశుసంవర్ధక, మత్స్యశాఖకు 1,204 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.1,204.97 కోట్లు కేటాయించింది. ఇందులో పశుసంవర్థక శాఖకు రూ.650 కోట్ల నిధులు ఉన్నాయి. పశువులకు సంబంధించిన మందుల కొనుగోలు, గడ్డి విత్తనాల పంపిణీ, ఇతర పథకాల అమలు, సిబ్బంది వేతనాలకు కలిపి రూ.200 కోట్లు ప్రతిపాదించింది. విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహకం చెల్లిస్తున్నారు. మరో 4 ప్రైవేట్ డెయిరీలకు పాలు, 2.13 లక్షల మంది రైతులకు ప్రోత్సాహకం ఇస్తున్నారు. మత్స్యశాఖకు రూ.320 కోట్లు ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేప పిల్లల పంపిణీ, రొయ్యల పెంపకానికి నిధులు ప్రతిపాదించారు. -
శిక్షణ... ఉపాధి కల్పన...!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని నిరుద్యోగుల అభ్యున్నతికి వెనుకబడిన తరగతులు ఆర్థిక సహకార సంస్థ(బీసీ కార్పొరేషన్) కొత్త కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. శిక్షణ, ఉపాధి కల్పనకు కార్యాచరణ సిద్ధపరుస్తోంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఈ తరహా శిక్షణ, ఉపాధి కార్యక్రమాల అమలుతో మంచి ఫలితా లు సాధిస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తోంది. 2019–20 వార్షిక సంవత్సరంలో కనిష్టంగా 10వేల మందికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. బీసీల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపును సైతం క్రమంగా పెంచుతోంది. గత రెండేళ్లుగా ఎంబీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున కేటాయించింది. రూ.50 వేల మొత్తంలో ఏర్పాటు చేసే అన్ని స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేసిన బీసీ కార్పొరేషన్ ఆ మేరకు లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చింది. 2018–19 సంవత్సరంలో దాదాపు రూ.300 కోట్లకుగాను చెక్కులు ఇచ్చారు. అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. కోడ్ ముగిసిన తర్వాత చర్యలు తీసుకోనున్నట్లు చెబుతు న్నారు. ఉపాధి కల్పన వైపు దృష్టి సారించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగం గా 2019–20 సంవత్సరంలో రూ.220 కోట్లతో ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కులవృత్తుల్లో మెళకువల కోసం.. గతేడాది నాయీబ్రాహ్మణ ఫెడరేషన్, కుమ్మరి శాలివాహన ఫెడరేషన్ల ద్వారా వారి కులవృత్తుల్లో యువతకు మెళకువలు నేర్పి మినీ బ్యూటీపార్లర్ల, మట్టి విగ్రహాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేశారు. శిక్షణ పొందిన మెజార్టీ యువతకు ఉపాధి దక్క డంతో కార్పొరేషన్ అధికారులు ఈ దిశగా దృష్టి సారించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాలను ఎంచుకుని ఆ మేరకు శిక్షణ చేప ట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనాన్ని ఇస్తారు. అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఆతిథ్య రంగం, హోటల్ నిర్వహణ, నిర్మాణ రంగాలను శిక్షణకు ఎంచుకున్నారు. -
ఎంబీసీల రాయితీ పథకాలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: ఎంబీసీ(అత్యంత వెనుకబడిన కులాలు)ల రాయితీ పథకాలకు లైన్ క్లియర్ అయ్యిం ది. ఇప్పటివరకు ఎంబీసీ జాబితాలో ఎవరున్నారనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఎంబీసీ కార్పొరేషన్ రెండేళ్ల నుంచి ఎదురు చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నా.. కార్పొరేషన్ పరిధిలోకి ఏయే కులాలు వస్తాయనే అంశం తేలకపోవడంతో ఆ నిధులు ఖర్చు చేయలేదు. 36 కులాలను ఎంబీసీలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా కులాలకు చెంది న కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు ఎంబీసీ కార్పొరేషన్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎంబీసీ కులాల్లోని నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకున్న యంత్రాంగం.. వారి కోసం ప్రత్యేకంగా రాయితీ పథకాలను రూపొందిస్తోంది. వీటికి తోడు వృత్తి నైపుణ్య శిక్షణపైనా దృష్టి సారించిన అధికారులు.. తాజా ప్రణాళికలో ప్రాధాన్యత ఇస్తున్నారు. 20 వేల మందికి నేరుగా రాయితీ.. అత్యంత వెనుకబడిన వర్గాల్లోని యువతకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ఎంబీసీ కార్పొరేషన్ రాయితీ రుణాలను నేరుగా ఇవ్వాలని భావిస్తోంది. బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా నేరుగా రాయితీని విడుదల చేయనుంది. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్లో అమల్లో ఉన్న ఈ నిబంధనలను ఎంబీసీ కార్పొరేషన్ కూడా అడాప్ట్ చేసుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అత్యవసర కోటా కింద 20 వేల మందికి రాయితీ రుణాలు ఇవ్వనుంది. ఎంబీసీ కులాల్లోని నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ఈ పథకాన్ని అమలు చేయనుంది. గరిష్టంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష చొప్పున రాయితీ ఇవ్వనుంది. ఈ మేరకు నెలాఖరులోగా కార్యాచరణ రూపొందించి జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించనుంది. వీటిని ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఆమోదం వచ్చిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక చేపట్టనుంది. అక్టోబర్ నాటికి 20 వేల యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా ఎంబీసీ కార్పొరేషన్ చర్యలు చేపడుతోంది. దీనికి రూ.200 కోట్లతో వార్షిక ప్రణాళికను తయారు చేస్తోంది. ఎంబీసీ కులాల్లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తూ సమన్యాయం చేయనున్నట్లు కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. -
ఎంబీసీ చిట్టా.. తేలేదెట్టా?
సాక్షి, హైదరాబాద్: బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీలు) చెందిన వారెవరన్న అంశంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. గత బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఎంబీసీ కులాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కానీ ఏడాది గడిచినా ఏయే కులాలను ఎంబీసీ జాబితాలో చేర్చాలో నిర్ణయించలేదు. బీసీల్లో మొత్తం 113 కులాలు ఉండగా.. వీటిలో 96 కులాలను ఎంబీసీలుగా పరిగణించాలని పలుమార్లు సీఎం సమక్షంలో జరిగిన సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. కానీ ఏయే కులాలను చేర్చాలి, వేటిని మినహాయించాలనేది ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ బాధ్యతను తెలంగాణ బీసీ కమిషన్‌కు అప్పగించినా... కమిషన్ సైతం ఈ దిశగా తమ నివేదికను అందించలేదు. గతేడాది బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. నాయీ బ్రాహ్మణులు, రజకులకు రూ.250 కోట్ల చొప్పున కేటాయించింది. బడ్జెట్ తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ బీసీల సమగ్రాభివృద్ధి పేరుతో జాప్యం జరగడంతో ఈ నిధులు ఇప్పటికీ ఖర్చు కాలేదు. ఈ లోగా యాదవులకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ, నేతన్నలకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వచ్చే బడ్జెట్లో నాయీ బ్రాహ్మణులు, రజకులకు కులవృత్తులకు వీలుగా రాయితీతో ఆధునిక పనిముట్లు అందించాలని, విశ్వకర్మలు, శాలివాహనులు, సంచార జాతులకు ప్రత్యేక పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. సంచార జాతులను ఎంబీసీలుగా పరిగణిస్తారనే విషయం ప్రచారంలో ఉంది. కానీ తమను ఎంబీసీల్లో చేర్చవద్దని, ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని సంచార జాతులు డిమాండ్ చేస్తున్నాయి. -
లక్ష మందికి రాయితీ రుణాలు
సాక్షి, హైదరాబాద్: అత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) కార్పొరేషన్ రాయితీ రుణాల కార్యాచరణను రూపొందిస్తోంది. బ్యాంకుతో లింకు లేకుండా రూ.వెయ్యి కోట్లతో లక్ష మందికి రాయితీ రుణాలు ఇవ్వాలన్న యోచనలో ఉంది. అత్యంత వెనుకబడిన కులాలకు ఆర్థిక చేయూతనిచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 2017–18 వార్షిక సంవ త్సరంలో రూ.1,000 కోట్లు కేటాయించింది. అయితే ఎంబీసీలపై స్పష్టత ఇవ్వకపోవ డంతో రుణాల పంపిణీ ప్రక్రియ అప్పట్నుంచీ నిలిచిపోయింది. తాజాగా వార్షిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో కేటాయించిన నిధుల ను వినియోగించుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా వెనుకబడ్డ కులవృత్తుల వారు, సంచార జాతులకు రాయితీ రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. నాలుగు కేటగిరీల్లో లబ్ధి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటైన తొలి ఏడాదే ప్రభుత్వం భారీగా కేటాయింపులు జరిపిన నేపథ్యంలో అధికారులు సైతం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని భావి స్తున్నారు. ఈ క్రమంలో రుణ వితరణ 4 కేటగిరీల్లో జరపాలని యోచిస్తున్నారు. రూ. 50 వేల రాయితీ కింద 25 వేల మందికి, రూ. లక్ష చొప్పున 40 వేల మందికి, రూ. రెండు లక్షల చొప్పున 20 వేల మందికి, అదేవిధంగా మిగిలిన వారికి గరిష్టంగా రూ. 5 లక్షల రాయితీ ఇచ్చేలా ప్రాథమిక ప్రణాళిక తయారు చేశారు. దీనికి తుది మెరుగులు దిద్దుతున్న అధికారులు ప్రభుత్వానికి సమర్పించేందుకు చర్యలు చేపట్టారు. బ్యాంకులతో లింకు లేకుండా... ప్రస్తుతం కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలకు బ్యాంకు లింకు తప్పనిసరి. బ్యాంకులతో ముడిపెట్టడంతో మెజారిటీ లబ్ధిదారులు రుణాలు పొందలేక పోతున్నారనే విమర్శలున్నాయి. బ్యాంక ర్లు సహకరించడం లేదని ఏకంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సైతం పలు సమావేశాల్లో పెదవి విరిచారు. ఈ క్రమం లో ఎంబీసీ కార్పొరేషన్ రూపొందించే ప్రణాళికలో బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలనే అంశంపై చర్చిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే వారంలో ఈ ప్రతిపాదనలు సమర్పిస్తామని.. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. -
కులాలవారీగా ‘ఎంబీసీ’ సమీక్ష
- సమగ్ర ప్రణాళిక కోసం ప్రత్యేక కార్యచరణ - మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిస్తాం: చైర్మన్ తాడూరి శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎంబీసీ కార్పొరేషన్ (అత్యంత వెనుకబడిన తరగతుల సహకార సంస్థ) వార్షిక కార్యాచరణ రూపకల్పనకు ఉపక్రమించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించింది. నిధుల వినియోగంపై ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించేందుకు ఎంబీసీ కార్పొరేషన్ చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రోజుకో కులానికి సంబంధించిన ప్రతినిధులు, సభ్యులతో సమావేశం నిర్వహిస్తోంది. ఆయా కులాల అవసరాలు, డిమాండ్లను తెలుసుకొని పరిష్కారాల కోసం పథకాలు రూపొందించాలని ఎంబీసీ కార్పొరేషన్ భావిస్తోంది. స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనే లక్ష్యంగా ఆర్థిక సహకార పథకాలపైనే దృష్టి సారించింది. శనివారం శాలివాహన సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించింది. హరితహారం పథకంలో భాగంగా పూలకుండీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆ కులస్తులు డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణతోపాటు ఆ కుల వృత్తిని ప్రోత్సహించినట్లవుతుందని భావించిన అధికారులు ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. ఉత్పత్తిని పెంచే పథకాలే చేపడతాం: తాడూరి కులవృత్తులను ప్రోత్సహించే ప్రక్రియలో భాగంగా ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త పథకాలను ప్రవేశపెడుతోందని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. రజకులు, నాయీ బ్రాహ్మణుల ఉపాధి పథకాల కోసం రూ.500 కోట్లు కేటాయించిందని, ఇదే పద్ధతిలో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా ప్రణాళికలు తయారు చేస్తున్నామని, ఉత్పత్తిని పెంచే కులాలకు రాయితీ పద్ధథిలో రుణాలు ఇస్తామని చెప్పారు. ‘కులవృత్తులపై ఆధారపడిన వారికి పనిముట్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రస్తుతం కులాల వారీగా సమీక్షలు మొదలుపెట్టాం. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం’అని చెప్పారు. -
ఎంబీసీలకు కార్పొరేషన్ : సీఎం కేసీఆర్
-
ఎంబీసీలకు కార్పొరేషన్
- అత్యంత వెనుకబడ్డ బీసీ కులాలను అన్నివిధాలా ఆదుకుంటాం - ఎంబీసీ ప్రతినిధులతో సుదీర్ఘ సమీక్షలో కేసీఆర్ - బడ్జెట్లో నిధులు.. కార్పొరేషన్ ద్వారా ఖర్చు - ఎంబీసీల ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు - కుల వృత్తులకు ఆర్థిక సాయం, మార్కెటింగ్ వసతి సాక్షి, హైదరాబాద్ సమాజంలో అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బీసీ కార్పొరేషన్‌ను కొనసాగిస్తూనే రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ తరగతుల అభివృద్ధి సంస్థ (మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్–ఎంబీసీడీసీ) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎంబీసీలకు బడ్జెట్లోనే నిధులు కేటాయించి, కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలు చీకట్లోనే మగ్గిపోతున్నాయని సీఎం ఆవేదన వెలిబుచ్చారు. ఎంబీసీ కులాల్లోని కుటుంబాలకు వెలుగు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఎంబీసీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్షించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజెందర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎంబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కాళప్ప, ప్రధాన కార్యదర్శి సంగం సూర్యారావు, ఉపాధ్యక్షుడు నేతికార్ ప్రేమ్‌లాల్, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు నర్సింగ సాగర్, వడ్డెర సంఘం అధ్యక్షుడు ఎత్తడి అంతయ్య, వడ్డెర సంఘం సలహాదారు ఒర్సు కృష్ణయ్య, వంశరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.సత్యం, ప్రభుత్వ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిశంకర్, సగర సంఘం నాయకుడు జె.రాములు, కుమ్మరి సంఘం నాయకుడు శంకర్, జల్ల మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. ఎంబీసీ ప్రతినిధులతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి, ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. బీసీ కులాల అభివృద్ధికి కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఎంబీసీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ఎంబీసీ ప్రతినిధులతోనే కార్పొరేషన్ ‘పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంది. రాష్ట్రంలో అన్ని వర్గాలు సుఖసంతోషాలతో బతకాలి. ఇప్పటికీ ప్రభుత్వ సాయం లేక, కుల వృత్తులు క్షీణించి కొన్ని కులాలు, కుటుంబాలు చితికిపోయాయి. వారికి ఆర్థికంగా, రాజకీయంగా చేయూత అందలేదు. ఇప్పటికీ చీకట్లోనే మగ్గుతున్నారు. ముఖ్యంగా బీసీల్లో కొన్ని కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. వాటిని గుర్తించి, ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితినీ తెలుసుకుని వారి అవసరాల మేరకు ప్రభుత్వం చేయూతనిస్తుంది. వారికోసం ప్రత్యేకంగా ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికే నేరుగా నిధులు విడుదల చేసి ఖర్చు చేస్తాం. వాటినెలా ఖర్చు చేయాలన్నది కూడా ఎంబీసీ ప్రతినిధులే నిర్ణయించుకునే విధానం ఉంటుంది. ఎంబీసీ ప్రతినిధులతోనే ఈ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తాం. రాజకీయ జోక్యం లేకుండా వారి అభ్యున్నతికి కార్పొరేషన్ ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం’’అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వ పనులతో ఉపాధి కొత్త జిల్లాలతో ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితిపైనా అంచనాకు వస్తున్నట్టు సీఎం చెప్పారు. ‘‘ఎంబీసీ కుటుంబాల పరిస్థితి కూడా తెలుస్తుంది. ఎంబీసీల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవించేవారు, వృత్తులు కూలిపోయి ఉపాధి కోల్పోయిన వారు, అసలు వృత్తే లేనివారు ఉన్నారు. వీరికోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలో నిర్ణయించాలి. మనుగడలో ఉన్న కులవృత్తులను ప్రోత్సహించి ఆర్థిక సహకారం అందిస్తాం. కుల వృత్తుల ఆధునీకరణకు, మార్కెటింగ్‌కు చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం. కులవృత్తి నశించి చితికిపోయిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు అన్వేషించి సహకారమందిస్తాం. వృత్తులే లేని కులాలకు తగిన ఉపాధి చూపుతాం. ప్రభుత్వమే కొన్ని పనులు కల్పిస్తుంది. ప్రభుత్వ నిర్మాణాలు, కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తుంది’’అని వివరించారు. ‘‘ప్రభుత్వం ఎంబీసీలకు నేరుగా నిధులు విడుదల చేస్తుంది. మీ కులాలను మీరే అభివృద్ధి చేసుకొండి. ఏ కులానికి ఏ అవసరముందో, ఏ కుటుంబానికి ఏ అవసరం ఉందో, వారి కులవృత్తిని ప్రోత్సహించేందుకు ఏం చేయాలో నిర్ణయించండి. ప్రభుత్వం కేవలం కావాల్సిన డబ్బులిస్తుంది. పథకాలు, కార్యక్రమాలు మీరే నిర్ణయించుకొండి. ఆచరణాత్మక ధోరణిలో, వాస్తవిక పరిస్థితులను బట్టి ధైర్యంగా ముందడుగు వేయండి’’అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. బ్యాంకు లింకేజీ లేకుండా సాయం ‘ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎంబీసీ పిల్లలను చేర్పించండి. ఏ పని చేస్తే సమాజంలో బతకగలమో, ఏ పనికి డిమాండ్ ఉందో అదే ఎంచుకోండి. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పైసానూ సద్వినియోగం చేసుకోండి. ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తాం. బ్యాంకుతో లింకు పెట్టకుండానే ఆర్థిక చేయూత అందిస్తాం. వాటితో ఉపాధి పొందండి. తెలంగాణలో ఎంబీసీలు బాగు పడాలి. దేశానికి ఆదర్శం కావాలి. మా బతుకు బాగుపడిందని ఎంబీసీ కుటుంబాలు ఆనందంగా ఉంటేనే నాకు సంతృప్తి’’అని సీఎం అన్నారు. మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది ‘‘గతంలో ఏ ముఖ్యమంత్రీ మాగోడు వినలేదు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రికి బాధలు చెప్పుకున్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’అని ఎంబీసీ నేతలు కాళప్ప, సూర్యారావు తదితరులన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు తమకు అండగా ఉంటుందనే ఆశలు చిగురించాయన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.