సాక్షి, ముంబై: ప్రధాని మోదీ జనవరి 19న ముంబైని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేయనున్నారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేస్తారు. కాగా, జనవరి 15 నుంచి 19 వరకు దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం ఏక్‌నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరుకావాల్సి ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో తమ ప్రణాళికను మార్చుకోవచ్చు.
మెట్రో 2ఏ, 7 లైన్ల ప్రారంభం..
ఈ పర్యటనలో సెంట్రల్ పార్క్–బేలాపూర్ స్టేషన్ల మధ్య నవీ ముంబై మెట్రో యొక్క 5.96–కిమీ విస్తరణను ప్రధాని ప్రారంభించనున్నట్లు సమాచారం. అలాగే ముంబై మెట్రో యొక్క 2ఏతోపాటు 7వ లైన్లలోని 35 కి.మీ. విస్తరణ కూడా అదే రోజున ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ రెండు మెట్రో లైన్లు లింక్ రోడ్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే గుండా వెళతాయి. వీటివల్ల ఈ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ తగ్గడంతోపాటు ప్రస్తుతం ఉన్న సబర్బన్ లోకల్ రైలు సరీ్వసుల్లోనూ రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు.
2022 ఏప్రిల్‌లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మొదటి దశ 2ఏ, 7 లైన్లను ప్రారంభించారు. ఈ రెండు లైన్లు మొత్తం 30 స్టేషన్లు, 35 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌తో ఉన్నాయి. ఇవి రోజుకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవని మహా ముంబై మెట్రో ఆపరేషన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఎంఓసీఎల్) అధికారులు తెలిపారు.
రూ.1,750 కోట్ల విలువైన పనుల శంకుస్థాపన
మెట్రోతోపాటు వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్టు, ముంబైలో 400 కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఆప్‌లీ చికిత్సా (మన వైద్యం) ప«థకంలో భాగంగా భాండూప్‌లో నిరి్మంచనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఓషీవరాలో ప్రసూతి గృహం, గోరేగావ్‌లోని సిద్ధార్ధ్ ఆస్పత్రి పునరుద్ధరణ పనులు.. మొత్తం రూ.1,750 కోట్ల ఖర్చుతో కూడిన 500పైగా అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇందులో వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్టు పనులకు రూ.26 వేల కోట్లు, ముంబైలో 400 కిలోమీటర్ల సీసీ రోడ్డు పనులకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అదేవిధంగా ముంబైలో లక్షా మంది హాకర్లకు ప్రధాని సొంత నిధి పథకం ద్వారా రూ.10 వేల చొప్పున రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు.
బీఎంసీ ఎన్నికల కోసమేనా?
ఇదిలా ఉండగా బీఎంసీ ఎన్నికల తేదీ ఇంకా ఖరారు కాలేదు. అయినా.. ప్రధాని ముంబై పర్యటనకు రావడం, వివిధ అభివృద్ధి పనులు జాతికి అంకితం చేయడం, కొన్ని పనులకు శంకు స్ధాపన చేయడాన్ని బట్టి త్వరలో బీఎంసీ ఎన్నికల నగారా మోగుతుండొచ్చని రాజకీయ పారీ్టలు చర్చిస్తున్నాయి. ఇప్పటికి బీఎంసీ కార్పొరేటర్ల పదవి కాలం గడువు ముగిసి సంవత్సరం కావస్తోంది. అప్పటి నుంచి కార్పొరేషన్లన్నీ ఖాళీగా ఉన్నాయి. 2022 మార్చి 8వ తేదీ నుంచి బీఎంసీ పరిపాలన పగ్గాలు అడ్మిన్ చేతిలోకి వచ్చాయి. అప్పటి నుంచి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అని మాజీ, సిట్టింగ్ కార్పొరేటర్లతోపాటు ఆశావాహులందరు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ముంబై పర్యటనతో అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment