సాక్షి, హైదరాబాద్: ఎంబీసీ(అత్యంత వెనుకబడిన కులాలు)ల రాయితీ పథకాలకు లైన్ క్లియర్ అయ్యిం ది. ఇప్పటివరకు ఎంబీసీ జాబితాలో ఎవరున్నారనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఎంబీసీ కార్పొరేషన్ రెండేళ్ల నుంచి ఎదురు చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నా.. కార్పొరేషన్ పరిధిలోకి ఏయే కులాలు వస్తాయనే అంశం తేలకపోవడంతో ఆ నిధులు ఖర్చు చేయలేదు.
36 కులాలను ఎంబీసీలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా కులాలకు చెంది న కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు ఎంబీసీ కార్పొరేషన్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎంబీసీ కులాల్లోని నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకున్న యంత్రాంగం.. వారి కోసం ప్రత్యేకంగా రాయితీ పథకాలను రూపొందిస్తోంది. వీటికి తోడు వృత్తి నైపుణ్య శిక్షణపైనా దృష్టి సారించిన అధికారులు.. తాజా ప్రణాళికలో ప్రాధాన్యత ఇస్తున్నారు.
20 వేల మందికి నేరుగా రాయితీ..
అత్యంత వెనుకబడిన వర్గాల్లోని యువతకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ఎంబీసీ కార్పొరేషన్ రాయితీ రుణాలను నేరుగా ఇవ్వాలని భావిస్తోంది. బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా నేరుగా రాయితీని విడుదల చేయనుంది. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్‌లో అమల్లో ఉన్న ఈ నిబంధనలను ఎంబీసీ కార్పొరేషన్ కూడా అడాప్ట్ చేసుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అత్యవసర కోటా కింద 20 వేల మందికి రాయితీ రుణాలు ఇవ్వనుంది.
ఎంబీసీ కులాల్లోని నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ఈ పథకాన్ని అమలు చేయనుంది. గరిష్టంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష చొప్పున రాయితీ ఇవ్వనుంది. ఈ మేరకు నెలాఖరులోగా కార్యాచరణ రూపొందించి జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించనుంది. వీటిని ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఆమోదం వచ్చిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక చేపట్టనుంది. అక్టోబర్ నాటికి 20 వేల యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా ఎంబీసీ కార్పొరేషన్ చర్యలు చేపడుతోంది. దీనికి రూ.200 కోట్లతో వార్షిక ప్రణాళికను తయారు చేస్తోంది. ఎంబీసీ కులాల్లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తూ సమన్యాయం చేయనున్నట్లు కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment