సింగరాయకొండ: పేద ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందుకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలు అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 2047 సంవత్సరం నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తు న్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం 17 రకాల పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆయా పథకాల గురించి అందరికీ తెలిసేలా చేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని వివరించారు.
కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చాకిరాల పంచాయతీ భూతంవారిపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు కొమ్మాలపాటి వెంకట రమణమ్మతో ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. డ్రోన్ ద్వారా సాంకేతిక పద్ధతిలో చేస్తున్న వ్యవసాయం ద్వారా ఆమెకు కలిగిన లబ్ధిని, అనుభవాలను చెప్పాలని మోదీ కోరారు. రమణమ్మ మాట్లాడుతూ తాను ఎంఏ బీఈడీ చదివానన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాల ద్వారా డ్రోన్ ద్వారా వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు.
అందుకోసం ఆచార్య రంగా యూనివర్సిటీలో 12 రోజుల పాటు శిక్షణ పొందానన్నారు. ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసుకుంటున్నానని, నీటి అవసరం కూడా బాగా తగ్గిందని ఆమె చెప్పారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతి రైతూ సాంకేతిక పద్ధతిలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. అలాగే సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామంలోని మరికొంతమందితోనూ ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నదని కొనియాడారు.
అనంతరం 24 స్వయం సహాయ గ్రూపులకు రూ.4.80 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందించారు. పారిశుధ్య పనులు చేస్తున్న క్లాప్ మిత్రలను సత్కరించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం చేశారు. ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. ఉజ్వల భారత్ పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారు. డ్రోన్ వినియోగంలో శిక్షణ పొందిన రమణమ్మకు లైసెన్స్ పత్రాన్ని అందజేశారు. కలెక్టర్ దినేష్‌కుమార్, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం జిల్లా ఇన్‌చార్జి ఎం.రామచంద్రుడు, జేసీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment