సాక్షి, హైదరాబాద్: అత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) కార్పొరేషన్ రాయితీ రుణాల కార్యాచరణను రూపొందిస్తోంది. బ్యాంకుతో లింకు లేకుండా రూ.వెయ్యి కోట్లతో లక్ష మందికి రాయితీ రుణాలు ఇవ్వాలన్న యోచనలో ఉంది. అత్యంత వెనుకబడిన కులాలకు ఆర్థిక చేయూతనిచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 2017–18 వార్షిక సంవ త్సరంలో రూ.1,000 కోట్లు కేటాయించింది. అయితే ఎంబీసీలపై స్పష్టత ఇవ్వకపోవ డంతో రుణాల పంపిణీ ప్రక్రియ అప్పట్నుంచీ నిలిచిపోయింది. తాజాగా వార్షిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో కేటాయించిన నిధుల ను వినియోగించుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా వెనుకబడ్డ కులవృత్తుల వారు, సంచార జాతులకు రాయితీ రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది.
నాలుగు కేటగిరీల్లో లబ్ధి
ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటైన తొలి ఏడాదే ప్రభుత్వం భారీగా కేటాయింపులు జరిపిన నేపథ్యంలో అధికారులు సైతం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని భావి స్తున్నారు. ఈ క్రమంలో రుణ వితరణ 4 కేటగిరీల్లో జరపాలని యోచిస్తున్నారు. రూ. 50 వేల రాయితీ కింద 25 వేల మందికి, రూ. లక్ష చొప్పున 40 వేల మందికి, రూ. రెండు లక్షల చొప్పున 20 వేల మందికి, అదేవిధంగా మిగిలిన వారికి గరిష్టంగా రూ. 5 లక్షల రాయితీ ఇచ్చేలా ప్రాథమిక ప్రణాళిక తయారు చేశారు. దీనికి తుది మెరుగులు దిద్దుతున్న అధికారులు ప్రభుత్వానికి సమర్పించేందుకు చర్యలు చేపట్టారు.
బ్యాంకులతో లింకు లేకుండా...
ప్రస్తుతం కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలకు బ్యాంకు లింకు తప్పనిసరి. బ్యాంకులతో ముడిపెట్టడంతో మెజారిటీ లబ్ధిదారులు రుణాలు పొందలేక పోతున్నారనే విమర్శలున్నాయి. బ్యాంక ర్లు సహకరించడం లేదని ఏకంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సైతం పలు సమావేశాల్లో పెదవి విరిచారు. ఈ క్రమం లో ఎంబీసీ కార్పొరేషన్ రూపొందించే ప్రణాళికలో బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలనే అంశంపై చర్చిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే వారంలో ఈ ప్రతిపాదనలు సమర్పిస్తామని.. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment