పేదల పట్ల చిత్తశుద్ధి ఉంది | There is the will to help the poor | Sakshi
Sakshi News home page

పేదల పట్ల చిత్తశుద్ధి ఉంది

Published Mon, Mar 21 2016 12:18 AM | Last Updated on Tue, Oct 2 2018 5:14 PM

There is the will to help the poor

మండలిలో బడ్జెట్‌పై చర్చకు ఈటల సమాధానం
♦ ఇది అంకెల గారడీ బడ్జెట్ కాదు
♦ అభివృద్ధి కోణంలోనే రూపొందించాం
♦ కేంద్రం నుంచి ఆసరా కరువైంది
♦ బడ్జెట్‌లో 95 శాతం దాకా ఖర్చు చేస్తామని వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం డబ్బును కేంద్ర బిందువుగా చేసుకోవడం లేదని... మనిషిని, మానవత్వాన్ని, సమస్యలను కేంద్రంగా చేసుకుని పనిచేస్తోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పథకాల కోసం అప్పులు తెచ్చుకుంటే ఊబిలో కూరుకుపోతామన్న విపక్షాల విమర్శలు సరికాదన్నారు. పాలనలో ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విజన్ ఉందని, పేదల సంక్షేమం పట్ల నిబద్ధతతో ఉందని చెప్పారు. శాసనమండలిలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చకు ఆదివారం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ సమాధానమిచ్చారు. ‘‘తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని గతంలో జరిగిన ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ గొప్ప వాతావరణాన్ని నెలకొల్పేందుకు బడ్జెట్ తోడ్పడింది.

పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం ఉత్తమ జోన్‌గా దేశవ్యాప్తంగా ఘనతకెక్కి అనేక అవార్డులు అందుకుంది. మిషన్ భగీరథ, రెండు పడకల ఇళ్లు వంటివి దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి.వైషమ్యాలు, సంకుచితం కాకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఊహించిన దానికంటే మిన్నగా, అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలసి సాగుతున్నాయి. మూడుతరాలు పోరాడి సాధించుకున్న తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందితే చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ కోణంలోనే మేం బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం’’ అని పేర్కొన్నారు.

 ఆదాయం పెరుగుతుంది
 ప్రజల అవసరాలను తీర్చడానికే ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేశామని ఈటల చెప్పారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆయా శాఖల అంచనాల్లో ఎక్సైజ్ ఆదాయం 35.35 శాతం, వాహనాలు 26.8 శాతం, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు 19.61శాతం, వ్యాట్ 12.56 శాతం, పన్నేతర వనరుల్లో 78 శాతం, గనులకు సంబంధించి 25 శాతం ఆదాయం సమకూరిందన్నారు. జనవరి-మార్చిలో ఆదాయం ఇంకా పెరిగే అవకాశముందని తెలిపారు. ఈ ఏడాది జీఎస్‌డీపీ 15 శాతంపైగా ఉంటుందని అంచనా వేశామన్నారు. రూ.4 వేల కోట్ల వ్యాట్ బకాయిలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 80 శాతానికి పైగానే బడ్జెట్ వ్యయమవుతుందనే విశ్వాసముందని... 2016-17 బడ్జెట్‌లో 90-95 శాతం ఖర్చు చేసి రికార్డు బద్దలు కొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. 2014-16 మధ్య తీవ్రమైన కరువు ఉండడం ప్రతికూల పరిణామమని, భూగర్భజలాలు గణనీయంగా పడిపోయి వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపిం దని ఈటల చెప్పారు. ఆకలి తెలిసినవాడు, చాయ్‌వాలా పనిచేసిన వ్యక్తి ప్రధాని అయితే ఎంతో మార్పు వస్తుందని అనుకుంటే... సంక్షేమ రంగానికి కోతలు పెట్టారని వ్యాఖ్యానించారు.

 ఆచితూచి వ్యవహరిస్తాం
 మిషన్ భగీరథ, డబుల్‌బెడ్రూం పథకాలకు రూ.55 వేల కోట్లు అప్పులు తీసుకొస్తున్నామని ఆరోపించడంలో అర్థం లేదని ఆర్థిక మం త్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆయా ప థకాలకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నా రు. మండలిలో బడ్జెట్‌పై సభ్యుల ప్రశ్నలకు జవాబిస్తూ.. సంక్షేమ పథకాలకు అప్పులు తెచ్చే విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కనీసం 95 శాతం ఖర్చయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తుం దని చెప్పారు. ఉద్యోగులకు అమలౌవుతున్న కొత్త పెన్షన్ (సీపీఎస్) స్థానంలో పాత విధానాన్ని తేవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
 
 అప్పులతో పథకాలా?:
 ప్రధానమైన పథకాలైన మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల ను అప్పులతో చేపడతామనడం దారుణమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘‘ఈ రెండు పథకాల నుంచి డబ్బులు తిరిగిరావు. వాటి రుణాలకు వడ్డీ పెరుగుతుంది. మరి పన్నులను పెంచకుండా ఆదాయం ఎలా వస్తుందో ప్రభుత్వం చెప్పాలి. ఆదాయమే సరిగా లేనపుడు అసెంబ్లీ, సచివాలయం వంటి వాటికి కొత్త భవనాలు ఎందుకు?..’’ అని నిలదీశారు. ఇక మైనారిటీల సంక్షేమ బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ఖర్చుచేయాలని.. సెట్విన్ సంస్థను మైనారిటీ శాఖ పరిధిలోకి తీసుకురావాలని ఎంఐఎం సభ్యుడు అల్తాఫ్ రిజ్వీ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement