సమావేశంలో మాట్లాడుతున్న సజ్జల
సాక్షి, అమరావతి: సంచార జాతులకు ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక నేత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న అధ్యక్షతన సంచార జాతుల రాష్ట్రస్థాయి ముఖ్య నేతల సమావేశం మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని, వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్ పూర్తి న్యాయం చేస్తున్నారని తెలిపారు. సమాజంపై, ప్రజలపై ముఖ్యమంత్రికి ప్రేమ ఉండటంవల్లే ఇది సాధ్యమైందన్నారు. సీఎం చెప్పినట్లు అందరూ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భారతీయ సమాజానికి సంస్కృతి నేర్పింది బీసీలేనని.. అలాంటి వర్గాలు వారి వెనుకబాటుతనానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బీసీల అభ్యున్నతికి ఆనాడు దివంగత సీఎం వైఎస్సార్, నేడు ఆయన తనయుడు సీఎం జగన్ చేసినట్లు మరే ఇతర ముఖ్యమంత్రులు చేయలేదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బీసీల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. ఎంబీసీల్లో ఉన్న 32 ఉప కులాల సంక్షేమం కోసమే దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని సజ్జల చెప్పారు.
సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోండి
బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం రాజ్యమేలుతోందని.. దీన్ని వెనుకబడిన తరగతుల్లోని అన్ని కులాల వారు సంక్షేమ ఫలాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదని, మోస్ట్ బ్యాక్‌బోన్ క్యాస్ట్ అని సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎలుగెత్తి చాటిందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన కూడు, గూడు, గుడ్డకు కూడా నోచని దుర్భర స్థితిలో ఉన్న సంచార జాతుల జీవనంలో సమూలమైన మార్పు తెచ్చేందుకు సీఎం జగన్ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment