సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పులుంటే చెప్పి, వాటిని మరింత మెరుగ్గా అమలు చేయడానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సిన విపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. 2022 సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశకత్వంలో వైఎస్సార్‌సీపీ మరింత బాధ్యతతో వ్యవహరిస్తుందని చెప్పారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..
ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రగతిపథం
► కోవిడ్ సహా ఎన్ని సవాళ్లు ఎదురైనా, మేనిఫెస్టోలో హామీలన్నింటినీ ఎన్నికలకు మూడేళ్ల ముందే అమలు చేశాం. సంక్షేమ పథకాలను సీఎం జగన్ పూర్తి శాచ్యురేషన్ విధానంలో పారదర్శకంగా అమలు చేస్తున్నారు. ఈ 30 నెలల్లోనే సంక్షేమ పథకాల ద్వారా రూ.1.16 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి. అవ్వా, తాతల పింఛను రూ. 2,500కు పెంచాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం జరుగుతోంది కాబట్టే మిగతా రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి.
► రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం ట్రెండ్ సెట్టరే. సచివాలయ వ్యవస్థ ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 600 జూనియర్ అసిస్టెంట్లు, మెడికల్ సిబ్బందిని నియమిస్తున్నాం. ఉద్యోగాల కల్పన బాధ్యత అనుకున్నామే తప్ప, ప్రచారంతో లబ్ధి పొందాలని చూడలేదు.
► జగనన్న కాలనీల్లో పేదలకు 30 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. రూ.10 వేల కోట్లతో భూమి కొని, అక్కచెల్లెమ్మల పేరు మీద పట్టాలు ఇచ్చి, ఇంటి యజమానులుగా చేశాం. దీనిపై కడుపు మంటతోనే టీడీపీ కోర్టుకు వెళ్లింది. గృహ నిర్మాణ సంస్థ రుణంతో ఇళ్లు కట్టుకున్న 50 లక్షల మందికి రూ.10 వేల కోట్ల రుణం, రూ.4 వేల కోట్ల వడ్డీని మాఫీ చేసి.. నామమాత్రపు ధరతో పూర్తి హక్కులు కల్పిస్తున్నాం. టీడీపీ హయాంలో కనీసం ఆ రుణంపై వడ్డీని కూడా మాఫీ చేయలేదు. ఈ రెండు కార్యక్రమాల ద్వారా మళ్లీ ఎన్నికలకు వెళ్లే 2024 నాటికి రాష్ట్రంలో 80 లక్షల కుటుంబాలు సొంత ఇళ్లల్లో ఆనందంగా గడుపుతాయి.
► నాడు–నేడు కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీల నుంచి కాలేజీల వరకు నూతన భవనాల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. గ్రామాల్లోని ఆస్పత్రులను ప్రభుత్వ ఆస్పత్రులు, సూపర్, మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులతో అనుసంధానం చేయడం ద్వారా ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది.
► ఆర్బీకేలు, సచివాలయాల ద్వారా రైతులకు సలహాలు, మద్దతు ధరలు, ఇతర సేవలు అందుతున్నాయి. అతి తక్కువ కాలంలో ఇంతకు మించి సాధించినవి గతంలో కానీ, భవిష్యత్‌లో కూడా ఉంటాయా?
► సీఎం జగన్ బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలు, మహిళల సాధికారతకు వారికి అన్ని పదవుల్లో సముచిత స్థానం కల్పించారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టం చేయడం ఒక చరిత్ర.
ఆదర్శ పాలన
ఓ వైపు సీఎం వైఎస్ జగన్ ప్రగతిశీల, ఆదర్శ పరిపాలనను అందిస్తుంటే... ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందనే వాదనకు బలం చేకూర్చేలా సీపీఐ వ్యవహరిస్తోంది. బీజేపీ మతమే అజెండాగా పనిచేస్తోంది. లేని విషయాలను పట్టుకుని.. అదే నిజమని భ్రమంపజేసేలా టీడీపీ విషప్రచారం చేస్తోంది. మత రాజకీయాలు చేసే శక్తులతో లౌకికవాదులమని చెప్పుకునే పార్టీలు తిరుపతిలో వేదికను ఎలా పంచుకున్నాయి? ప్రతిపక్షాల విష ప్రచారాన్ని ప్రజలు నమ్మడంలేదన్నది స్థానిక సంస్థల ఎన్నికల్లో రుజువైంది. 90 శాతం స్థానాల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించి.. సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment