ఎంబీసీలకు కార్పొరేషన్‌ | special corporation for most backward castes(MBCs), says CM KCR | Sakshi
Sakshi News home page

ఎంబీసీలకు కార్పొరేషన్‌

Published Tue, Feb 21 2017 1:45 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

ఎంబీసీలకు కార్పొరేషన్‌ - Sakshi

ఎంబీసీలకు కార్పొరేషన్‌

- అత్యంత వెనుకబడ్డ బీసీ కులాలను అన్నివిధాలా ఆదుకుంటాం
- ఎంబీసీ ప్రతినిధులతో సుదీర్ఘ సమీక్షలో కేసీఆర్‌

- బడ్జెట్‌లో నిధులు.. కార్పొరేషన్‌ ద్వారా ఖర్చు
- ఎంబీసీల ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు
- కుల వృత్తులకు ఆర్థిక సాయం, మార్కెటింగ్‌ వసతి


సాక్షి, హైదరాబాద్‌

సమాజంలో అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బీసీ కార్పొరేషన్‌ను కొనసాగిస్తూనే రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ తరగతుల అభివృద్ధి సంస్థ (మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌–ఎంబీసీడీసీ) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎంబీసీలకు బడ్జెట్లోనే నిధులు కేటాయించి, కార్పొరేషన్‌ ద్వారా ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలు చీకట్లోనే మగ్గిపోతున్నాయని సీఎం ఆవేదన వెలిబుచ్చారు. ఎంబీసీ కులాల్లోని కుటుంబాలకు వెలుగు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఎంబీసీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్షించారు.

ఆర్థిక మంత్రి ఈటల రాజెందర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్, ఎంబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కాళప్ప, ప్రధాన కార్యదర్శి సంగం సూర్యారావు, ఉపాధ్యక్షుడు నేతికార్‌ ప్రేమ్‌లాల్, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు నర్సింగ సాగర్, వడ్డెర సంఘం అధ్యక్షుడు ఎత్తడి అంతయ్య, వడ్డెర సంఘం సలహాదారు ఒర్సు కృష్ణయ్య, వంశరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.సత్యం, ప్రభుత్వ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రవిశంకర్, సగర సంఘం నాయకుడు జె.రాములు, కుమ్మరి సంఘం నాయకుడు శంకర్, జల్ల మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. ఎంబీసీ ప్రతినిధులతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి, ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. బీసీ కులాల అభివృద్ధికి కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఎంబీసీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు.

ఎంబీసీ ప్రతినిధులతోనే కార్పొరేషన్‌
‘పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంది. రాష్ట్రంలో అన్ని వర్గాలు సుఖసంతోషాలతో బతకాలి. ఇప్పటికీ ప్రభుత్వ సాయం లేక, కుల వృత్తులు క్షీణించి కొన్ని కులాలు, కుటుంబాలు చితికిపోయాయి. వారికి ఆర్థికంగా, రాజకీయంగా చేయూత అందలేదు. ఇప్పటికీ చీకట్లోనే మగ్గుతున్నారు. ముఖ్యంగా బీసీల్లో కొన్ని కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. వాటిని గుర్తించి, ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితినీ తెలుసుకుని వారి అవసరాల మేరకు ప్రభుత్వం చేయూతనిస్తుంది. వారికోసం ప్రత్యేకంగా ఎంబీసీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దానికే నేరుగా నిధులు విడుదల చేసి ఖర్చు చేస్తాం. వాటినెలా ఖర్చు చేయాలన్నది కూడా ఎంబీసీ ప్రతినిధులే నిర్ణయించుకునే విధానం ఉంటుంది. ఎంబీసీ ప్రతినిధులతోనే ఈ కార్పొరేషన్‌ ఏర్పాటుచేస్తాం. రాజకీయ జోక్యం లేకుండా వారి అభ్యున్నతికి కార్పొరేషన్‌ ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం’’అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ప్రభుత్వ పనులతో ఉపాధి
కొత్త జిల్లాలతో ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితిపైనా అంచనాకు వస్తున్నట్టు సీఎం చెప్పారు. ‘‘ఎంబీసీ కుటుంబాల పరిస్థితి కూడా తెలుస్తుంది. ఎంబీసీల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవించేవారు, వృత్తులు కూలిపోయి ఉపాధి కోల్పోయిన వారు, అసలు వృత్తే లేనివారు ఉన్నారు. వీరికోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలో నిర్ణయించాలి. మనుగడలో ఉన్న కులవృత్తులను ప్రోత్సహించి ఆర్థిక సహకారం అందిస్తాం. కుల వృత్తుల ఆధునీకరణకు, మార్కెటింగ్‌కు చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం. కులవృత్తి నశించి చితికిపోయిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు అన్వేషించి సహకారమందిస్తాం. వృత్తులే లేని కులాలకు తగిన ఉపాధి చూపుతాం. ప్రభుత్వమే కొన్ని పనులు కల్పిస్తుంది. ప్రభుత్వ నిర్మాణాలు, కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తుంది’’అని వివరించారు. ‘‘ప్రభుత్వం ఎంబీసీలకు నేరుగా నిధులు విడుదల చేస్తుంది. మీ కులాలను మీరే అభివృద్ధి చేసుకొండి. ఏ కులానికి ఏ అవసరముందో, ఏ కుటుంబానికి ఏ అవసరం ఉందో, వారి కులవృత్తిని ప్రోత్సహించేందుకు ఏం చేయాలో నిర్ణయించండి. ప్రభుత్వం కేవలం కావాల్సిన డబ్బులిస్తుంది. పథకాలు, కార్యక్రమాలు మీరే నిర్ణయించుకొండి. ఆచరణాత్మక ధోరణిలో, వాస్తవిక పరిస్థితులను బట్టి ధైర్యంగా ముందడుగు వేయండి’’అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

బ్యాంకు లింకేజీ లేకుండా సాయం
‘ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఎంబీసీ పిల్లలను చేర్పించండి. ఏ పని చేస్తే సమాజంలో బతకగలమో, ఏ పనికి డిమాండ్‌ ఉందో అదే ఎంచుకోండి. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పైసానూ సద్వినియోగం చేసుకోండి. ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తాం. బ్యాంకుతో లింకు పెట్టకుండానే ఆర్థిక చేయూత అందిస్తాం. వాటితో ఉపాధి పొందండి. తెలంగాణలో ఎంబీసీలు బాగు పడాలి. దేశానికి ఆదర్శం కావాలి. మా బతుకు బాగుపడిందని ఎంబీసీ కుటుంబాలు ఆనందంగా ఉంటేనే నాకు సంతృప్తి’’అని సీఎం అన్నారు.

మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది
‘‘గతంలో ఏ ముఖ్యమంత్రీ మాగోడు వినలేదు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రికి బాధలు చెప్పుకున్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’అని ఎంబీసీ నేతలు కాళప్ప, సూర్యారావు తదితరులన్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు తమకు అండగా ఉంటుందనే ఆశలు చిగురించాయన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement