
బాబుపై ప్రజలు కోర్టుకెళ్లే రోజులు దగ్గర్లోనే....
కడప : హామీల అమలులో జాప్యం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రజలు త్వరలోనే కోర్టుకెళ్లే రోజులున్నాయని మండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య అన్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని ఇందిరాభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హామీలు ఇచ్చానని, ఇప్పుడు రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉన్నందున వాటిని నెరవేర్చలేనని చేతులెత్తెయ్యడం సిగ్గు చేటన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 600 హామీలు గుప్పించిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయారని, త్వరలో ప్రజలు ఆ విషయాన్ని కోర్టు ద్వారా గుర్తు చేయనున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్న ప్రతిపక్షాలను రాక్షసులంటావా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ వైఫల్యాలను శాసన సభలో ఎండ గట్టిన ప్రతిపక్ష నేత జగన్‌ను, చంద్రబాబు వ్యక్తిగతంగా విమర్శించడం దుర్మార్గపు చర్య అన్నారు. సొంతింటి నిర్మాణానికి పునాది రాయి వేసినట్లు రాజధానికి భూమి పూజ నిర్వహించారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలను ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. ఓ వైపు రేవంత్‌రెడ్డిని పంపించి ఓటుకు నోటు వ్యవహారం నడిపించిన చంద్రబాబు.. అవినీతి లేని సమాజాన్ని నిర్మిస్తామని చెప్పడం చూస్తుంటే దొంగే.. దొంగ, దొంగ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.