సాక్షి, కడప: మూడు రాజధానులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుది పోరాటం కాదని.. ఆస్తులను కాపాడుకోవడం కోసం చేసే ఆందోళన మాత్రమేనని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌పై వ్యక్తిగత ద్వేషాలతో ప్రజల సమస్యలను జోడించి రెచ్చ గొడుతున్నారన్నారు. వాస్తవాలను వక్రీకరించి దుష్ఫ్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పబ్బం గడుపుకోవడానికే ధర్నాలు చేస్తున్నారని.. చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
చంద్రబాబు కృత్రిమ ఉద్యమాలు..
అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియమించిన నిపుణుల కమిటీల నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి లేకపోతే..రాష్ట్రమే లేదనే విధంగా అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో దారుణంగా పోస్టింగ్‌లు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
దురుద్దేశంతోనే రెచ్చ గొడుతున్నారు..
పవన్‌కల్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని.. చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రాంత రైతులను దురుద్దేశంతోనే రెచ్చగొడుతున్నారని.. ఎన్నికల సమయంలో చేసే కుట్రలు ఇప్పుడు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులపై అన్ని రకాలుగా పరిశీలించి శివరామ కృష్ణన్ నివేదిక ఇచ్చారని.. ఆ నివేదిక రాక ముందే చంద్రబాబు బినామీ నారాయణ నివేదిక ఆధారంగా రాజధాని ప్రకటించారని దుయ్యబట్టారు. అమరావతి రాజధాని వద్దని అప్పట్లో తన అనుకూల మీడియాలోనే వార్తలు రాసారని.. శివరామకృష్ణన్ కమిటీ పై చర్చ జరపాలని అనేక సార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. రాజధాని ప్రాంత రైతులకు ఎలాంటి నష్టం జరగదని...ప్రతి రైతుకు ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేస్తారని స్పష్టం చేశారు.
బ్రోకర్‌లా పవన్ తయారయ్యారు..
‘బీజేపీ-టీడీపీకి మధ్య బ్రోకర్‌లా పవన్‌కల్యాణ్ తయారయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై చాడీలు చెప్పడానికే పవన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నట్లు తెలిసింది. దీన్ని విన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తమకు అన్ని తెలుసునని చెప్పినట్లు సమాచారం’ అని రామచంద్రయ్య పేర్కొన్నారు. వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఏ ముఖం పెట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని..ఇప్పుడు బీజేపీతో వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. పాచిపోయిన లడ్లు ఇచ్చారన్న పవన్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు నేరుగా బీజేపీని సంప్రదించకుండా.. ఇలాంటి మధ్య వర్తిత్వం తీసుకుంటున్నారని రామచంద్రయ్య ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment