మాట్లాడుతున్న బీవై రామయ్య, వేదికపై ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఇతర నాయకులు
సాక్షి, ఆదోని (కర్నూలు): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బీసీలంటే చులకన అని, ఇందుకు ఎన్నో ఘటనలు సాక్ష్యాలుగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. పట్టణ శివారులోని బాబా గార్డెన్‌లో శనివారం నిర్వహించిన ఆదోని నియోజకవర్గస్థాయి బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎన్నికల ముందు వాల్మీకులు, రజకులు, నాయీబ్రాహ్మణులు, బెస్త కులాల వారిని ఎస్టీలో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అలాగే బలిజ, కాపు కులాలను బీసీల్లో చేర్చుతామంటూ వాగ్దానం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలను మరచిపోయారని, ఎవరైనా గుర్తు చేస్తే ఆగ్రహం వ్యక్తం చేయడం పరిపాటిగా మారిందన్నారు. గిమ్మిక్కులు చేసి ఓట్లు దండుకోవడంలో చంద్రబాబును మించినోళ్లు దేశంలోనే లేరన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. టీడీపీ వర్గాలకు లాభం చేకూర్చేవిగా ఉంటున్నాయని విమర్శించారు.
గోబెల్స్ ప్రచారం
బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని బీవై రామయ్య అన్నారు. బీజేపీతో టీడీపీ మితృత్వం కొనసాగుతోందని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగం ద్వారా పార్లమెంట్ సాక్షిగా తేటతెల్లమైందన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రకటించిన నవరత్నాల పథకాలు అమలైతే ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి లబ్ధి పొం దుతారని, ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అలాగే చంద్రబాబు మోసాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు.
మళ్లీ స్వర్ణయుగం వస్తుంది..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తరహాలోనే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఉంటుందని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. అధికారం లేకపోవడం వల్ల నాలుగేళ్ల పాటు ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, మళ్లీ రాష్ట్రంలో స్వర్ణయుగం చూస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాసంకల్ప పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా లక్షల్లో తరలి వచ్చి జననేత అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీపై ప్రజలు పెట్టుకున్న ఆశ, విశ్వాసాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆయన చేసే గిమ్మిక్కుల్లో ప్రజలు చిక్కుకోకుండా అప్రమత్తం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక టీడీపీ నాయకులు భూ కబ్జాలకు, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి డాక్టర్ మధుసూదన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మునిస్వామి, పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, మైనార్టీ నాయకులు సలీం, అమీన్, సునార్ అబ్దుల్ ఖాదర్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అహ్మద్, సీనియర్ నాయకులు గోవిందరాజులు, రాముడు, మహిళా నాయకులు జిలేకాబీ, శ్రీదేవి, తాయమ్మ, శ్రీలక్ష్మీ, సౌమ్యారెడ్డి, రవిరెడ్డి, నాగేంద్ర, తిమ్మప్ప, విశ్వనాథరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment