
లాహోర్ జైల్లో... ఈ రమేష్ ఎవరు ?
ఖమ్మం : పాకిస్థాన్లోని లాహోర్ జైలులో మగ్గుతున్న రమేష్ (20) వివరాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు ఆరా తీస్తున్నారు. జమ్మూకాశ్మీర్ పాక్ సరిహద్దు రేఖ దాటి పాకిస్థాన్ భూభాగంపై అడుగిడిన నేరానికిగాను అతడిని అక్కడి సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని లాహోర్ జైలులో నిర్బంధించారు. ఖైదీలను ఇచ్చిపుచ్చుకునే విషయమై ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అక్కడి జైలులో ఉన్న రమేష్ వివరాలను పాక్ ప్రభుత్వం మన దేశ కేంద్రం హోంమంత్రిత్వశాఖకు అందజేసింది.
ఆ వివరాలను హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు కేంద్రం పంపింది. రమేష్ది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా అని ఉంది. కానీ, అతని వివరాలు అక్కడ లభించలేదు. దీందో అతడి ఫొటోలను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పోలీసు శాఖ పంపించింది. ఇతడి ఎత్తు ఐదు అడుగులు ఏడు అంగుళాలు ఉన్నాడని, మెడపై పుట్టు మచ్చ ఉందని పాక్ పంపిన వివరాల్లో ఉంది. ఇతనిని ఎవరైనా గుర్తించినట్లుయితే తన సెల్ సెంబర్ ((94407 95318)కు తెలపాలని స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ తెలిపారు.