పన్ను ఎగవేసిన రామోజీ
* రూ. 77 లక్షలకు పైగా డాల్ఫిన్ హోటల్ బకాయి
*విశాఖలో ఆస్తి పన్ను చెల్లించని తీరు
* ‘ఈనాడు’ను, రామోజీని చూసి చర్యలకు వెనకాడుతున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం: ఎదుటివారికి చెప్పేందుకే నీతులన్నాయని నమ్మేవారిలో మొదటి వ్యక్తి ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావే. పెన్ను పట్టుకుని ఇతరులపై ఇంతెత్తున లేచే రామోజీరావు... తాను మాత్రం అన్నిటికీ అతీతమనుకుంటారు. ఆఖరికి స్థానిక సంస్థలకు పన్ను కూడా కట్టకుండా ఎగవేస్తున్నారు ఈ రాజగురివింద. విశాఖలో ఈయన కబ్జా చేసిన డాల్ఫిన్ హోటల్ రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నా... గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏటా చెల్లించాల్సిన ఆస్తి పన్నును మాత్రం ఎగవేస్తోంది. జీవీఎంసీ యంత్రాంగం ఎన్నిసార్లు నోటీసులిచ్చినా డాల్ఫిన్ నుంచి స్పందన మాత్రం కరువవుతోంది. అధికారులేమో ఈనాడును, రామోజీరావును చూసి చర్యలకు వెనకాడుతున్నారు.
బకాయిలు రూ.77,31,252
జీవీఎంసీ 28వ వార్డులో రామోజీ గ్రూప్‌కు చెందిన డాల్ఫిన్ హోటల్‌కు మూడు డోర్ నంబర్ల పేరిట మూడు(17225, 17430, 17471) అసెస్‌మెంట్లున్నాయి. వీటికి 1996, 2012 ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా ఆస్తిపన్ను బకాయిలున్నాయి. మధ్యలో కొన్ని సంవత్సరాల బకాయిలు రెండేళ్ల కిందట చెల్లించినా.. అదీ అరకొరే. దీంతో వడ్డీ కూడా భారీగా పేరుకుపోయింది.
గడచిన ఆర్థిక సంవత్సరం నాటికి ఈ వార్డులో మొత్తం పన్ను బకాయిలు రూ.3.50 కోట్లుండగా.. ఇందులో ఒక్క డాల్ఫిన్ హోటల్ యాజమాన్యమే రూ.77 లక్షల 31 వేల 252 చెల్లించాల్సి ఉంది. దీనిపై జీవీఎంసీ ఎన్నిసార్లు నోటీసులిచ్చినా.. యాజమాన్యం నుంచి స్పందన అంతంతమాత్రమేనని అధికారులు చెప్తున్నారు. మిగిలిన వాణిజ్య సంస్థల బకాయిలపై తీసుకున్నంతగా కఠిన చర్యలు వీటిపై తీసుకోలేక చేతులెత్తేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వంత పాడటంతో తామేం చేయలేని పరిస్థితికి చేరుకున్నామని చెప్తున్నారు. నిబంధనల మేరకు ఏళ్ల తరబడి పన్ను బకాయిలున్నవారికి జీవీఎంసీ సేవల్ని నిలిపేయడంతో.. పాటు ఆర్‌ఆర్ చట్టం ప్రకారం ఆస్తుల వేలానికి కూడా వెళ్లొచ్చు. అయితే వీరిపై ఆ స్థాయి చర్యలకు సిద్ధపడే పరిస్థితి లేదు.
వడ్డీ ఎక్కువే!
మొత్తం బకాయిలు రూ.77,31,252లో వడ్డీ రూ.23,47,554 కాగా మిగిలింది ఎగవేసిన మొత్తం. ఎగవేసిన బకాయిలపై ప్రతి నెలా 2 శాతం చొప్పున వడ్డీ పెరిగేలా నిబంధనలుండటంతో మొత్తం బకాయి ఈ స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది వడ్డీ మినహాయింపునిస్తూ ఆస్తిపన్ను చెల్లింపునకు అవకాశం కల్పించినా.. యాజమాన్యం మాత్రం చెల్లించేందుకు మొండికేయడంతోనే.. ఈ స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయని అధికారులు చెప్తున్నారు.
బకాయిల వివరాలు
అసెస్‌మెంట్ నం. ఎప్పటి నుంచి బకాయి (రూ.ల్లో)
17225 2012 28,84,170
17430 2012 6,37,206
17471 1996 42,09,876