పోటెత్తిన మద్యం దరఖాస్తులు
- చివరి రోజు 1500 దాఖలు
- 240 షాపులకు 1938 సమర్పణ
- 95 షాపులకు ఒక్కటీ రాని వైనం
- నేడు మచిలీపట్నంలో లాటరీ
సాక్షి, విజయవాడ : జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజున జిల్లావ్యాప్తంగా పెద్దసంఖ్యలో వ్యాపారులు తరలివచ్చి భారీగా దరఖాస్తులు దాఖలు చేశారు. దీంతో విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయం మద్యం వ్యాపారులతో పోటెత్తింది. చివరి రోజు అత్యధికంగా 1500 దరఖాస్తులు దాఖలయ్యాయి. మొత్తంమీద గత వార్షిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం డివిజన్‌లో అతి తక్కువ దరఖాస్తులు అందాయి. 23న మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలతో ముగిసింది. మొత్తం మీద 335 షాపులకు గాను 240 షాపులకు 1938 దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన 95 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు.
చివరిరోజు పోటెత్తిన వ్యాపారులు...
శుక్రవారం దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావటంతో వ్యాపారులు పోటెత్తారు. ఉదయం 8 గంటల నుంచి గుణదలలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వ్యాపారులు బారులుతీరారు. కొందరు వ్యాపారులు సెంటిమెంట్‌తో వారి కుటుంబసభ్యులు, మహిళలతో దరఖాస్తులను అందజేశారు. దరఖాస్తుల ప్రక్రియ 23న మొదలైనా మొుదటి మూడు రోజులు ఒక్కటీ దాఖలు కాలేదు. గురువారం 115 షాపులకు 438 దరఖాస్తులు అందగా చివరి రోజున 1500 దరఖాస్తులు అందాయి.
మొత్తం 240 షాపులకు 1938 దరఖాస్తులు అందాయి. చివరి రోజు భారీగా దరఖాస్తులు రావటంతో డివిజన్ల వారీగా దరఖాస్తులు లెక్కించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల లోపు లైనులో ఉన్న వ్యాపారులకు టోకెన్లు ఇచ్చి వారి దరఖాస్తులను మాత్రమే స్వీకరించారు. శనివారం ఉదయం మచిలీపట్నంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ ద్వారా షాపులు కేటాయించనున్నారు.