=పంచమి తీర్థానికి పోటెత్తిన భక్తులు
=నేత్రపర్వంగా చక్రస్నానం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచమితీర్థ (చక్రస్నానం) మహోత్సవం శనివారం అమ్మవారి పుష్కరిణిలో నేత్రపర్వంగా జరిగింది. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి స్వయంగా తన కుంతాయుధంతో తవ్విన పద్మసరోవరం(పుష్కరిణి)లో కార్తీక మాసం, శుక్లపక్ష పంచమి తిథి, ఉత్తరాషాడ నక్షత్రం రోజున స్వర్ణకమలంలో పద్మావతీదేవిగా అమ్మవారు అవతరిం చారు. ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే పాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.
తిరుచానూరు, న్యూస్‌లైన్: అమ్మవారు ఆవిర్భవించిన పద్మసరోవరంలో ప్రతి ఏటా నిర్వహించే పంచమితీర్థం రోజున స్నానమాచరిస్తే సకల పాపాలు హరిం చుకుపోయి కోటిజన్మల పుణ్యఫలం చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఇందులో భాగంగా పద్మావతీ అమ్మవారిని శనివారం వేకువజాము 3.30 గంటలకు సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారికి పల్లకీ వాహన సేవ జరిగింది. అమ్మవారు, చక్రతాళ్వార్లను సన్నిధి నుంచి వేంచేపుగా పుష్కరిణిలోని పంచమితీర్థం మం డపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. తిరుమల నుంచి వచ్చిన సారెతో ఉదయం 10.30 గంటల నుంచి అమ్మవారు, చక్రతాళ్వార్లకు నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
వైభవంగా చక్రస్నానం
స్నపన తిరుమంజనం అనంతరం చక్రతాళ్వార్లను పుష్కరిణిలోకి తీసుకొచ్చి, 12.12 గంటలకు ధనుర్లగ్నంలో చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పద్మసరోవరంలో పవిత్ర స్నానమాచరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ కనుమూరిబాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో గోపాలకృష్ణ, ఏఈవో నాగరత్న పాల్గొన్నారు.
‘జన’సరోవరం
Published Sun, Dec 8 2013 4:38 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM
Advertisement
Advertisement