
కోరలు తిరిగిన నాగైనా.. తోక ముడవాల్సిందే..
40 ఏళ్లుగా పాముల్ని పడుతున్న రాములు
వాటితో ఆటాడిస్తేనే కుటుంబానికి సాపాటు
నెల్లిపాక: సాధారణంగా మనుషులకు పామును చూస్తేనే గుండె జల్లుమంటుంది. అరుుతే హరిపిలి రాములు మామూలు మనిషి కాదు..పిల్లలు బొమ్మలతో ఆడుకున్నంత ధీమాగా విషసర్పాలతో చెలగాటమాడే మొనగాడు. తన ఒడుపుతో వాటిని తోకముడిపించగల సాహసికుడు. తెలంగాణ లోని ములకలపల్లి మండలానికి చెందిన రాములుకు గత 40 ఏళ్లుగా వందలాది పాములను పట్టి, కోరలు, పీకి ఆడిం చారు. గత కొన్నేళ్లుగా మండలంలోని గ్రామాల్లో సంచారజీవనం సాగిస్తూ, తన లావంతో ‘పాముల రాములు’గా పేరొందారు. ఆయన కుటుంబంతో పాటు ఒక్కోచోట కొన్నాళ్లుగా గుడారం వేసుకుని ఉంటారు. తనతో పాటు కొద్దిపాటి పందులు, మేకలు, గాడిదలనూ వెంట తీసుకువెళుతుంటారు.
మకాం వేసిన ప్రతిచోటా పరిసరాల్లో తెల్ల, గోధుమ, నల్ల, కోడె వంటి తాచులనూ, చింతనాగులనూ ఎక్కడున్నా పసిగట్టి అవలీలగా పట్టేస్తుంటారు. వాటి కోరలను పీకి, బుట్టల్లో పెట్టి, ఊళ్లలో ఆడిస్తుంటారు. తన నాదస్వరంతో పాముల్ని నాట్యం చేరుుస్తుంటే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే జనం ఇచ్చే డబ్బులతో బతుకుతుంటారు. ఇప్పటికి ఎన్ని వందల పాముల్ని పట్టానో గుర్తు లేదని, పట్టిన పాములను కొన్నిరోజుల పాటు ఆడించి తిరిగి అడవిలోనే వదిలేస్తానని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. పాములు పట్టే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని, అరుునా కొన్నిసార్లు వాటి నుంచి ప్రమాదాలు జరిగాయని తెలిపారు. తనలాగే పాముల్ని పట్టి ఆడించే తన పాముకాటుతోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడని, అరుునా బతుకుతెరువుకు ఆ పాములపైనే ఆధారపడ్డానని నిట్టూర్చారు.