పులివెందుల జనం గొంతెండుతున్నా అధికారుల్లో స్పందన కరువైందంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతుతడపండి అంటూ తహశిల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో మహిళలు బైఠారుుంచారు. పట్టణ వాసుల దాహం తీర్చడానికి సీబీఆర్ నీటిని విడుదల చేయూలంటూ నినదించారు.
పులివెందుల/రూరల్: పులివెందులలో నీటి సమస్య తీవ్రమవుతున్నా టీడీపీ సర్కార్ పట్టించుకోవడం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డిల నేతృత్వంలో ఖాళీబిందెలతో బుధవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
వెంటనే నీరు విడుదల చేయండి : వైఎస్ ప్రమీలమ్మ
నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీరు పూర్తిగా రాకపోతే పులివెందుల మున్సిపాలిటీ ఎడారిగా మారే ప్రమాదం ఉందని మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నీటిలో ఎస్‌ఎస్ ట్యాంకుకు కేవలం 200 మిలియన్ల నీరు మాత్రమే ఇచ్చారన్నారు.
ఈ నీరు మున్సిపాలిటీ పరిధిలోని 70వేల జనాభాకు కేవలం నెలన్నర్ర రోజులకు మాత్రమే సరిపోతుందన్నారు. గతంలో అప్పటి కలెక్టర్ కోన శశిధర్ ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపాలిటీకి తాగునీటిని విడుదల చేశారని, ఆ నీళ్లు దాదాపు 6నెలల వరకు సరిపోయాయన్నారు. ప్రస్తుత కలెక్టర్ కూడా పులివెందుల మున్సిపాలిటీ ప్రజల అవసరాలను గుర్తించి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌ఎస్ ట్యాంకులో 2860 మిలియన్ లీటర్ల నీటిని కచ్చితంగా నింపితే పులివెందుల ప్రజల దాహార్తిని తీర్చే అవకాశం ఉందన్నారు.
మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పులివెందుల పురపాలక ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా మహానేత వైఎస్‌ఆర్ 2008లో ఎస్‌ఎస్ ట్యాంకును రూ.30కోట్లతో నిర్మించి పట్టణ ప్రజలకు బహుమతిగా ఇచ్చారన్నారు. అయితే ఎస్‌ఎస్ ట్యాంకుకు పూర్తిస్థాయిలో నీరు రాకపోవడంతో గత ఏడాది, ఈ ఏడాది ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నిధులతో వెలమవారిపల్లె, న్యాక్ బిల్డింగ్ సమీపంలో బోర్లు వేశారన్నారు. అయితే తీవ్ర వర్షాభావం కారణంగా ఆ బోర్లలో నీరు తగ్గిపోయిందన్నారు. మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చేయాలంటే కాలువల ద్వారా కాకుండా సీబీఆర్ నుంచి ఎస్‌ఎస్ ట్యాంకు వరకు ప్రత్యేక పైపులైన్ వేయాలన్నారు. దీంతోపాటు కృష్ణా జలాలను గండికోట ప్రాజెక్టు నుంచి పైడిపాలెం రిజర్వాయర్ ద్వారా నక్కలపల్లె ఎస్‌ఎస్ ట్యాంకుకు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప మాట్లాడుతూ ఎస్‌ఎస్ ట్యాంకుకు కేటాయించిన నీటిని తెలుగుతమ్ముళ్లు అక్రమంగా వాడుకోవడంతోనే ట్యాంకుకు నీరు చేరలేదన్నారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రుక్మిణీదేవి మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎంతో ఉన్నత ఆశయంతో వైఎస్‌ఆర్ ఎస్‌ఎస్ ట్యాంకును నిర్మిస్తే దానికి పూర్తిస్థాయిలో నీరు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
డీటీ, పీబీసీ డీఈలకు వినతి పత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు :
పులివెందుల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు సీబీఆర్ నుంచి నీటిని విడుదల చేయాలంటూ డిప్యూటీ తహశీల్దార్ సుధాకర్, పీబీసీ డీఈ రామాంజనేయరెడ్డిలకు వైఎస్సార్‌సీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి రసూల్, ప్రధాన కార్యదర్శి వీరభద్రారెడ్డి, రైతు సంఘ నాయకులు బాలవేమారెడ్డి, సర్వోత్తమరెడ్డి, ఎన్‌ఆర్‌ఐ రఘు, ఎంపీటీసీ విశ్వనాథరెడ్డి, డీసీసీ బ్యాంకు డెరైక్టర్ సుదర్శన్‌రెడ్డి, విద్యార్థి సంఘ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
జలం కోసం రణం
Published Thu, Feb 5 2015 3:03 AM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM
Advertisement
Advertisement