ఇళ్లకే పౌష్టికాహారం పంపిణీ | Ration And Food Distributing in Vizianagaram | Sakshi
Sakshi News home page

ఇళ్లకే పౌష్టికాహారం పంపిణీ

Published Thu, Mar 26 2020 1:23 PM | Last Updated on Thu, Mar 26 2020 1:23 PM

Ration And Food Distributing in Vizianagaram - Sakshi

తెర్లాం వెలగవలస స్కూల్‌ నుంచి సరుకులను తీసుకెళ్తున్న గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ కార్యదర్శి, వలంటీర్లు

విజయనగరం అర్బన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పాఠశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం  మధ్యాహ్న భోజనానికి బ్రేక్‌ పడనీయలేదు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారం ఇళ్లకే చేర్చాలని నిర్ణయించింది. ఆ దిశగా ఇచ్చిన ఆదేశాలను జిల్లాలో విద్యాశాఖ అమలు చేస్తోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. పాఠశాల విద్యార్థుల ఇళ్లకు వెళ్లి నేరుగా తల్లిదండ్రులకు బియ్యం, గుడ్లు, చెక్కీలు పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో చేపట్టింది. ఈ బాధ్యతను ఆయా పాఠశాల పరిధిలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు, వలంటీర్లకు అప్పగించింది. సంబంధిత పాఠశాల హెచ్‌ఎం నుంచి విద్యార్థుల నమోదు సంఖ్యను తీసుకుని సచివాలయాల పరిధిలో ఉన్న వలంటీర్లు దగ్గరుండి అందజేయాలి. పంపిణీ పూర్తయిన వివరాలను సంబంధిత విద్యాశాఖ మధ్యాహ్న భోజన విభాగానికి ఎప్పటికప్పుడు పంపాలి.  

జిల్లాలో 2,701 పాఠశాలలు        
జిల్లాలోని  2,701 వరకు ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్‌ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ స్కూళ్లలో 1,84,184 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా భోజనం అందుతోంది.  2,196 ప్రాథమిక పాఠశాలల్లో  90,473 మంది, 262 ప్రాథమికోన్నత పాఠశాలల్లో  55,132 మంది, 243 ఉన్నత పాఠశాలల్లో 38,579 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా మధ్యాహ్న భోజన పథకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో పౌష్టకాహారంతో రూపొందించిన నూతన భోజన మెనూను అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన సామగ్రిని ప్రస్తుత సెలవుల్లో కూడా విద్యార్థులకు అందించాలని ఇచ్చిన ముఖ్యమంత్రి ఆదేశాలను సచివాలయాల సిబ్బంది  క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. 

పాఠశాల స్థాయిని బట్టి సరుకులు  
ఇంతవరకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూలోని ప్రధాన సరుకులు బియ్య, గుడ్లు, చెక్కీలు పంపిణీ చేయాలి. ప్రస్తుతం పాఠశాలల్లో ఈ  నెల 31వ తేదీ వరకు సిద్ధం చేసుకున్న  సరకులన్నింటినీ  ఆయా విద్యార్థులకు అందజేయాలి. 

గర్భిణుల ఇళ్ల వద్దకే సరుకులు
విజయనగరం ఫోర్ట్‌:  ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో బు«ధవారం పట్టణంలో వారి ఇళ్ల వద్దకే ఐసీడీఎస్‌ సిబ్బంది వెళ్లి టేక్‌ హోం రేషన్‌ (ఇంటివద్దకే సరుకులు) అందించారు. లబ్ధిదారులకు బియ్యం, నూనె, కందిపప్పు, గుడ్లు, పాలు ఇళ్ల వద్దకే  వెళ్లి అంగన్‌వాడీ కార్యకర్తలు, వార్డు సెక్రటరీల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.  పట్టణంలోని గుడ్డు వీధి, లంకాపట్నం, కొత్తపేట, యాత వీధిల్లో సరుకులు అందజేశారు.  

సరుకులను అప్పగించాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన సరుకులను ఆయా     పాఠశాలల పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించాం. అదేవిధంగా గ్రామాల్లోని విద్యార్థుల వివరాలను సచివాలయాల సిబ్బందికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందజేశారు. క్షేత్రస్థాయిలో వాటి పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. పంపిణీ పూర్తి వివరాలను సేకరిస్తున్నాం.          –జి.నాగమణి, డీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement