పేదల నోటికి చేదుకాలం
పండుగల వేళ పిండివంటల మాట అటుంచి పేదల ఇళ్లలో నిత్యావసర సరుకులే నిండుకుంటున్నాయి. గతంలో ఇలాంటి సందర్భాల్లో అదనపు రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు.. ఎప్పుడూ ఇచ్చే సరుకులకే ఎగనామం పెట్టారు. బియ్యం, పంచదార, కిరోసిన్ తప్ప ఇతర నిత్యావసర సరుకులు కార్డుదారులకు దూరమయ్యాయి. మరొకపక్క అనేక సాకులతో కార్డుల్లో ఉన్న సభ్యులను తొలగించడమే కాక.. కార్డులకూ కోత పెడుతున్నారు.
సాక్షి, కాకినాడ :జిల్లాలోని 2,561 రేషన్‌షాపుల పరిధిలో 15,28,598 కార్డులున్నాయి. వీటిలో 13,52,429 తెల్లకార్డులుండగా, రచ్చబండ-2లో ఇచ్చిన మరో 87,477 కూపన్లున్నాయి. ఇక అంత్యోదయ అన్నయోజన కార్డులు 87,018, అన్నపూర్ణ కార్డులు 1,674 ఉన్నాయి. గత మార్చి వరకు బియ్యం, కిరోసిన్, పంచదారతో పాటు తొమ్మిది నిత్యావసరసరుకులను ‘అమ్మహస్తం’లో పంపిణీ చేయగా ఏప్రిల్ నుంచి పామాయిల్ సరఫరాను నిలిపివేశారు. తర్వాత ఒక్కొక్కటిగా అమ్మహస్తం సరుకులన్నింటికీ ఎసరు పెట్టారు. పూర్వం నుంచీ ఇస్తున్న కందిపప్పును కూడా గత మూడు నెలలుగా ఇవ్వడం మానేశారు. చివరికి ‘ఉప్పు’ను కూడా జాబితా నుంచి తొలగించారు. అక్టోబర్ నుంచి కేవలం బియ్యం, కిరోసిన్, పంచదార మాత్రమే పంపిణీ చేయనున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక పేదలు గగ్గోలు పెడుతున్నారు. పండుగలవేళ పిండివంటలు కాదు కదా.. కనీసం పప్పన్నానికీ గతి లేకుండా చేశారని వాపోతున్నారు.
ప్రభుత్వం సరఫరా నిలిపి వేసిన సరుకుల ధరలు బహిరంగ మార్కెట్‌లో భగ్గుమంటున్నాయి. రేషన్‌షాపులో రూ.40కు సరఫరా చేసే కిలో పామాయిల్ మార్కెట్‌లో రూ.55-60 మధ్య, రూ.50కే సరఫరా చేసే కిలో కందిపప్పు బయటమార్కెట్‌లో రూ.80కు పైగా, రూ.17కే సరఫరాచేసే కిలో గోధుమపిండి రూ.25-30 మధ్యచ అరకిలో రూ.6.75కు సరఫరా చేసే చక్కెర కిలో రూ.35-40 మధ్య, రూ.5కు సరఫరా చేసే కిలో ఉప్పు రూ.10-15 మధ్య పలుకుతున్నాయి. జన్మభూమి పుణ్యమాని ఈ నెల రేషన్ సరుకుల తరలింపులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. దీంతో రేషన్‌షాపుల్లో సరుకులందక పేదలు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది.
సర్కారుకు నెలకు రూ.4.5 కోట్ల ఆదా!
గత రెండుమూడు నెలలుగా సరుకులు తీసుకోనందున, మనుగడలో లేనట్టు పరిగణించి 3.87 లక్షల యూనిట్ల (కార్డుల్లోని సభ్యులు)కుఅక్టోబర్ నుంచి సరుకులు నిలిపివేశారు. కొన్ని కార్డుల్లో ఒకరిద్దరిని లేనట్టు లెక్కించి, సరుకులు నిలిపివేస్తే మరికొన్ని కార్డులనే పక్కన పెట్టేశారు. యూనిట్ల పరంగా చూస్తే కాకినాడ డివిజన్‌లో 74,886 మందికి, రాజమండ్రిలో 1,02,616 మందికి, అమలాపురంలో 67,422 మందికి, పెద్దాపురంలో 77,249 మందికి, రామచంద్రపురంలో 49,011 మందికి, రంపచోడవరంలో 22,082 మందికి సరుకులు నిలిపి వేశారు. ఇలా ప్రభుత్వానికి నెలకు రూ.నాలుగున్నర కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా. నిజానికి మనుగడలో లేరని తొలగించిన కార్డుదారుల్లో చాలా మంది బతికే ఉన్నారని, పనుల నిమిత్తం నెలల తరబడి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారే సరుకులు తీసుకోలేకపోయారని అంటున్నారు. మరొక పక్క ఆధార్ సాకుతో రేషన్‌కార్డుల్లో భారీగా కోత పెట్టారు. జిల్లాలోని తెల్లరేషన్‌కార్డుల ద్వారా 47,79,552 మంది లబ్ధిదారులున్నారు. వీరిలో ఇప్పటి వరకు ఆధార్ నంబర్లు సమర్పించిన వారు 41,74,722 మంది. మరో 6 లక్షల మందిని ఆధార్ నమోదు చేసుకోని కారణంగా తిరస్కరించారు. ఈ నెల నుంచి మనుగడలో లేని వారిని తొలగించిన ప్రభుత్వం దశలవారీగా ఆధార్ నంబర్లు లేని వారికి, వివిధ కారణాలతో తిరస్కరించిన వారికి కూడా సరుకులు నిలిపివేయనుందని చెబుతున్నారు.
జనాగ్రహానికి వేదిక కానున్న జన్మభూమి..
తమ కార్డులను తొలగించడం అన్యాయమంటూ మామిడికుదురు మండలం లూటుకుర్రులో జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామ సభలో బాధితులు అధికారులను నిలదీశారు. ఇదే పరిస్థితి మరికొన్ని చోట్ల జరిగిన సభల్లో కూడా కనిపించింది. ఈ నెల 20 వరకు జరగనున్న జన్మభూమి సభల్లో ఒక వైపు పింఛన్లు..మరొక వైపు కోతపెట్టిన లక్షలాది కార్డుదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని అధికారులు గుబులు పడుతున్నారు.