పౌరసరఫరాల కమిషనర్ రాజశేఖర్‌కు వినతిపత్రం అందిస్తున్న రేషన్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
పౌరసరఫరా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనటంలో ఎటువంటి సందేహం లేదు. రేషన్ డిపోలను ్రౖక్రమేణా ప్రైవేటుకు అప్పగిస్తుండడం ఒకఎత్తయితే, బియ్యం మినహా ఇతర అన్ని వస్తువుల సరఫరాను నిలిపివేయడం ఇప్పటికే జరిగాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనూ నమ్ముకుని ఉన్నటువంటి డీలర్లను ప్రభుత్వం పొమ్మనలేక పొగపెట్టి సాగనంపే ప్రయత్నాలు చేస్తుండడంతో వారు పోరుబాట పట్టే యోచనలో ఉన్నారు...
సాక్షి,విజయవాడ: పేదలకు ఎంతో ఉపయుక్తంగా వుండే చౌకధరల దుకాణాల వ్యవస్థను ప్రభుత్వం క్రమేణా బలహీనం చేస్తోంది. ఇప్పటికే ఒక్క బియ్యం మినహా అన్ని వస్తువులను ఆపేసిన ప్రభుత్వం ప్రజలను క్రమంగా ప్రైవేటుకు అలవాటు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది..
నామినీ తొలగింపు, హెల్పర్స్‌కు నో....
గతంలో రేషన్ డీలర్లతో పాటు ఇద్దరు నామినీల వేలిముద్రలు ఆన్‌లైన్‌లో తీసుకునేవారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఈ–పోస్ మిషన్ ఆపరేట్ చేసేందుకు వీలుఉండేది. అయితే ఈ విధానానికి స్వస్తి పలికి, కేవలం జీవిత భాగస్వామి మాత్రమే నామినీగా ఉండాలనే నిబంధన విధించారు. జిల్లాలో 2,147 రేషన్ దుకాణాలు ఉండగా...73 మంది డీలర్ల జీవిత భాగస్వాములు రేషన్ దుకాణం నిర్వహించే స్థితిలో లేరు. కొందరు డీలర్లు ఒంటరిగా జీవిస్తుండగా, మరికొంతమంది అనారోగ్యంతో మంచంలో ఉన్నాను. కొంతమంది ఆదాయం సరిపోక భాగస్వాములు వేరే ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే జీవిత భాగస్వామి కాకుండా హెల్పర్‌కు అవకాశం కల్పించమని డీలర్లు కోరుతుంటే, ఈ నెలలో జీవితభాగస్వామిని కూడా నామినీగా అధికారులు తొలగించారు.
దుకాణం నడిపేది ఏలా ?
రేషన్ డీలర్ ఒకరి వేలి ముద్ర మాత్రమే తీసుకున్నారు. ఒక్క రేషన్ డీలరే దుకాణం నడపాలంటే చాలా కష్టం అతనే కార్డుదారుడు చేత వేలిముద్ర వేయించాలి. డబ్బులు తీసుకుని సరుకులు కాటా వేయాలి, రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల హెల్పర్ ఉంటే ఉపయుక్తంగా వుంటుందన్న డీలర్ల విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ప్రతిపక్షనేతను కలవొద్దంటూ హుకుం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల నగరానికి చెందిన కొంతమంది డీలర్లు ఆయన్ను కలిసి తమ సమస్యలను వివరించేందుకు సిద్ధపడ్డారు. అయితే ఈ సమాచారం తెలుగుదేశం పార్టీ నేతలకు, పౌరసరఫరాల అధికారులకు తెలిసింది. దీంతో డీలర్లు సంఘానికి చెందిన కొంతమంది నేతల్ని పిలిచి ప్రతిపక్షనేత వద్దకు వెళ్లవద్దంటూ హుకుం జారీ చేశారు. ఆ విధంగా వెళ్లిన డీలర్లపై చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తమకు కొత్తనిబంధనలు పెట్టి ప్రభుత్వం మరింత ఇబ్బంది పెడుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని లేదంటే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ చేస్తామని డీలర్ల సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు.
మొరాయిస్తున్న ఈ–పోస్ మిషన్లు
ఈ– పోస్ మిషన్లు పాతపడిపోవడంతో పాటు సాఫ్ట్‌వేర్ సరిగా స్పందించడం లేదు. దీంతో రేషన్ డీలర్లకు బియ్యం ఇవ్వడం ఇబ్బందిగా మారింది. ఈ–పోస్ మిషన్లు మార్చి కొత్తవి ఇవ్వమని డీలర్లు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు కేవలం ఒక్క బియ్యం మాత్రమే సరఫరా చేయడం వల్ల తమకు కనీసం ఆదాయం రావడం లేదని, అందువల్ల తమకు గౌరవ వేతనం లేదా క్లాస్–4 ఉద్యోగస్తులుగా భావించి జీతం ఇవ్వమని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.
సమస్యలు పరిష్కరించకుంటేమే1 నుంచి బంద్..
రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్ దృష్టికి శుక్రవారం తీసుకువెళ్లాం. ఆయన వృద్ధులైన రేషన్ డీలర్లకు నామినీలు పెట్టుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. మా సమస్యలు పరిష్కరించకుంటే మే1వ తేది నుంచి రేషన్ దుకాణాలు బంద్ చేస్తాం. – మండాది వెంకట్రావ్, రేషన్ డీలర్లఅసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment