శింగనమలకు చెందిన మసూద్‌వలి రచ్చబండ-2 కార్యక్రమం కింద రేషన్ కార్డు పొందాడు. రేషన్ కార్డు మంజూరు చేసిన తరువాత రెండు నెలలు రేషన్ అందించారు. ఆ తర్వాత నుంచి అతనికి కష్టాలు మొదలయ్యాయి.
డీలరు వద్దకు వెళితే రేషన్ రావడం లేదన్నాడు. తహ శీల్దారు కార్యాలయానికి వెళ్లి అడిగితే రేషన్.. డీలరుకు పంపించామని చెప్పారు. మళ్లీ డీలర్ దగ్గరకు వస్తే మీ కార్డులకు రేషన్ సరఫరా చేయలేదని రికార్డులు చూపించాడు. ఎందుకిలా అని పలువురు అధికారులను కలిసి ఆరా తీస్తే రచ్చబండలో ఇచ్చిన రేషన్ కార్డులను ‘ఆన్‌లైన్’లో ఫొటో, ఆధార్ కార్డు నంబర్‌ను అధికారులు అప్‌లోడు చేయకపోవడం వల్లే రేషన్ నిలిపివేశారని తెలిసింది.
శింగనమల/పెద్దపప్పూరు, న్యూస్‌లైన్ : శింగనమల నియోజకవర్గంలోని శింగనమల, నార్పల, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, యల్లనూరు, పుట్లూరు మండలాల్లోని 11 వేల మంది పేదలకు ‘రచ్చబండ-2’ కింద రేషన్‌కార్డులు (కూపన్లు) మంజూరు చేశారు. లబ్ధిదారుల ఫొటో, ఆధార్ నంబర్లు అప్‌లోడ్ చేయకపోవడంతో 4 వేల రేషన్ కార్డులకు మార్చి నెల నుంచి కోటాలో కోత విధించారు.
దీనితో కార్డుదారులు రేషన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. తహశీల్దారు కార్యాలయాలకెళ్లి అడిగితే ఎన్నికల విధుల్లో ఉన్నాం.. తరువాత పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పుడు ఎన్నిక లు పూర్తయినా అధికారులు పట్టించుకోవడం లేదని పేదలు వాపోతున్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే కానీ ఆ నాలుగు వేల కార్డులకు రేషన్ పునరుద్ధరణ జరగదు.
కీ రిజిస్టర్ నుంచి
167 రేషన్‌కార్డుల తొలగింపు
ఆధార్ నంబర్ అనుసంధానం చేయకపోవడంతో పెద్దపప్పూరు మండలంలో 167 కార్డులను కీ రిజిష్టర్ నుంచి తొలగించారు. దీంతో ఆయా కార్డుదారులకు రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేశారు.
ఆధార్ అనుసంధానం ప్రక్రియను అధికారులు చౌకడిపో డీలర్లకు అప్పగించారు. రేషన్‌కార్డుదారులు ఆధార్ నంబర్లు సమర్పించినప్పటికీ డీలర్లు నిర్లక్ష్యం చేశారు. దీంతో పెద్దపప్పూరులో 18, ముచ్చుకోటలో 15, గార్లదిన్నెలో 12, శింగనగుట్టపల్లిలో 2, బొందెలదిన్నెలో 13, చాగల్లులో 20, తబ్జులలో 6, వరదాయపల్లిలో 10, తిమ్మనచెరువులో 12, చెర్లోపల్లిలో 6, పెద్ద ఎక్కలూరులో 10తోపాటు మరో 43 కార్డులకు రేషన్ కట్ చేశారు. ఆధార్‌తో లింకు పెట్టి పేదల కడుపు కొట్టడం దారుణమని లబ్ధిదారులు వాపోతున్నారు.
పరేషన్!
Published Thu, May 29 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement