ఆరేస్తున్నా... | ration rice illegal transport in vizianagaram district | Sakshi
Sakshi News home page

ఆరేస్తున్నా...

Published Mon, Apr 11 2016 12:01 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

ration rice illegal transport in vizianagaram district

 ఈ ఏడాది నమోదైన  6 ఎ కేసులు: 60
 ఇందులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై వచ్చినవి: సుమారు 42
 ఈ నెలలో పదిరోజుల్లో నమోదైన కేసులు :3
 విజిలెన్స్  పరిధిలో రెండు జిల్లాల్లో ఏటా నమోదయ్యే కేసులు: సుమారు 60

 
విజయనగరం కంటోన్మెంట్: ఆదివారం తెల్లవారు జామున విజయనగరం జిల్లా బాడంగి మండలం డొంకినవలస రైల్వేస్టేషన్ గుండా 54 బస్తాల రేషన్ బియ్యం తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు దాడులు చేసిపట్టుకున్నారు. స్టేషన్ వరకూ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను సీజ్ చేసి బాడంగి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. బియ్యానికి  పక్కనే ఉన్న తెంటువలస రేషన్ డీలర్‌ను కస్టోడియన్‌గా రికార్డు రాశారు. ఈనెల 4న జిల్లా కేంద్రంలోని పీడబ్ల్యుడీ మార్కెట్‌లో మహేష్ అనే వ్యాపారస్తుడి నుంచి రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని కొను గోలు చేసి మెంటాడ మండలం పోరాం తరలిస్తుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆర్‌ఐ పట్టుకుని కేసు నమోదు చేశారు. బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్-1కు అప్పగించారు. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే.

కేసుల దారి దానిదే మా దారి మాదే అంటూ రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా ఇతర రాష్రాలకు  తరలించేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏటా  6ఎ కేసులు సుమారు 60  నమోదవుతున్నాయి. పేద ప్రజల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి పంపిణీ చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ గాడితప్పుతోంది. ఈపాస్, ఈ వేయింగ్, బయోమెట్రిక్, ఐరిస్ అంటూ ఎన్నో సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నా రేషన్ బియ్యం మాత్రం  పేద ప్రజలకు చేరడం లేదు. వ్యాపారస్తులు, దళారులు  కలిసి పేద ప్రజల బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పీడీఎస్ బియ్యం దాదాపు 60 శాతం ఇలానే దుర్వినియోగమవుతున్నాయి.

 చిరు వ్యాపారులకు స్వయం ఉపాధి
 కొన్ని ప్రాంతాల్లో మిల్లులకు కూడా బియ్యాన్ని తరలించి దానిని సీఎంఆర్ బియ్యంగా తిరిగి ప్రభుత్వానికే తిరిగి అప్పగిస్తున్నట్టు పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాలో ఉన్న 6.80లక్షల తెలుపు రంగు రేషన్ కార్డులకు ప్రతి నెలా సుమారు 9వేల మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాలోని 1380 రేషన్ షాపుల ద్వారా విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని గ్రామాల్లో ఉన్న దళారులు, చిరు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారు. కిలో రూ.12కు  కొనుగోలు చేసే వారు ఆ బియ్యాన్ని కిలో రూ.17, 18కు విక్రయిస్తున్నారు. ఇలా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ దాదాపు 430మందికి పైగా చిరువ్యాపారులు దీనిని స్వయం ఉపాధి మార్గంగా ఎంచుకుని నాలుగు రాళ్లు వెనకేసుకు వస్తున్నారు. వీరిలో కొందరు బడా వ్యాపారస్తులకు విక్రయించి రిస్క్ తప్పించుకుంటున్నారు. పెద్ద వ్యాపారస్తులకు విక్రయించిన బియ్యాన్ని మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు.


 రైళ్లలో ఇతర రాష్ట్రాలకు జిల్లాలోని పీడీఎస్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లకు ఈ బియ్యాన్ని తరలించి అక్కడి నుంచి రైళ్లలో రాయగడ, జైపూర్, కొరాపుట్ తదితర ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఎస్ కోట, కొత్తవలస, బొబ్బిలి, డొంకినవలస, తదితర స్టేషన్ల గుండా బియ్యం తరలిస్తున్నట్టు తెలుస్తోంది.

 ఒడిశాకు ఎందుకంటే ?
 జిల్లాలోని బియ్యం ఒడిశా తదితర ప్రాంతాలకు తరలిస్తుండడం దళారులకు సులువైన మార్గంగా ఉంది. ఎందుకంటే రవాణా సులువైన పని. అలాగే అక్కడ వరిపంట తక్కువ కావడంతో పాటు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.50 నుంచి రూ.60 వరకూ బియ్యం ధర పలుకుతోంది.  

 నీరుగారుతున్న నిఘా వ్యవస్థ
 జిల్లాలోని పౌరసరఫరాల శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ చేష్టలుడిగి చూస్తోంది. ఎక్కడెక్కడ పీడీఎస్ వ్యాపారం జరుగుతుందో వీరికి కచ్చితంగా తెలుస్తోంది. కానీ దాడులు చేసి పట్టుకోవడం చేయడం లేదు. ఒక వేళ దళారుల మధ్య ఎప్పుడైనా గొడవలొచ్చి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటే తప్ప అధికారులు ముందుకు కదలడం లేదు.
 
 ఒడిశాకు తరలిస్తున్నారు
జిల్లాలో రేషన్ డిపోల నుంచి పన్నెండు రూపాయలకు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. వాటిని వ్యాపారులకు, ఒడిశాలోని వర్తకులకు రూ.18కు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్ కన్నా తక్కువకు దొరుకుతుండడంతో ఈ బియ్యం కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నాయి. విజిలెన్స్ తరపున తరచూ దాడులు నిర్వహిస్తున్నాం. రెండు జిల్లాల్లో కలిపి ఏటా సుమారు 60 కేసులు నమోదవు తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున డొంకినవలస రైల్వేస్టేషన్‌లో 27 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశాం. -డీవీవీ సతీష్ కుమార్, విజిలెన్స్ సీఐ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement