మార్కాపురం టు కాకినాడ! | Ration Rice Smuggling Caught in Prakasam | Sakshi
Sakshi News home page

మార్కాపురం టు కాకినాడ!

Published Fri, Jan 11 2019 11:26 AM | Last Updated on Fri, Jan 11 2019 11:26 AM

Ration Rice Smuggling Caught in Prakasam - Sakshi

స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాల వద్ద విజిలెన్స్‌ అధికారులు

ప్రకాశం, మార్కాపురం: పశ్చిమ ప్రకాశంలో పేదలకు దక్కాల్సిన సబ్సిడీ బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నాయి. ఈ వ్యాపారం కొందరు డీలర్లకు అక్రమ ఆదాయానికి మార్గంగా మారింది. ఇక్కడ సేకరించిన రేషన్‌ బియ్యం లారీల్లో అనంతపురం, కాకినాడ పోర్టుకు చేర్చి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కిలో రూపాయి ప్రకారం ఒక వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం బయట సుమారు రూ.25 చెల్లించి కొనుగోలు చేస్తోంది. మార్కాపురం నుంచి నంద్యాల మీదుగా అనంతపురం, యర్రగొండపాలెం నుంచి కోస్తా జిల్లాలకు అక్రమంగా రవాణా అవుతోంది. మొత్తం మీద నెలకు 1000 బస్తాల బియ్యాన్ని తరలిస్తున్నారు.

పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, గిద్దలూరు, కంభం, యర్రగొండపాలెంలలో పౌరసరఫరాల శాఖ గోడౌన్లు ఉన్నాయి. మార్కాపురం గోడౌన్‌ నుంచి మార్కాపురం పట్టణ, రూరల్, పెద్దారవీడు, పెద్దదోర్నాల, తర్లుపాడు మండలాల్లోని రేషన్‌ దుకాణాలకు, గిద్దలూరు గోడౌన్‌ నుంచి గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాలకు, కంభం గోడౌన్‌ నుంచి కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాలకు, యర్రగొండపాలెం గోడౌన్‌ నుంచి యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాలకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. రేషన్‌ బియ్యాన్ని జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి సివిల్‌ సప్లయ్‌ గోడౌన్లకు చేరుస్తారు. అక్కడి నుంచి ఆయా గ్రామాల్లోని రేషన్‌ షాపులకు తరలిస్తారు. త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, కంభం, మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లో కొంత మంది డీలర్లు రేషన్‌ బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని రైసు మిల్లుల ద్వారా లెవి రూపంలో మళ్లీ ప్రభుత్వానికి సుమారు రూ.22లకు అమ్ముతున్నారు. మరికొంత మంది వ్యాపారులు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, ద్వారక తిరుమల దేవస్థానాల్లోని కాంట్రాక్టర్లకు నిత్యాన్నదానానికి విక్రయిస్తున్నట్లు తెలిసింది.  

అక్రమాలు జరుగుతోందిలా..
బియ్యం నాణ్యంగా లేకపోవటంతో కొందరు కార్డుదారులు తీసుకోవడం లేదు. మరికొంత మందికి డీలర్లు ఇవ్వడం లేదు. ప్రతి మండలం నుంచి సుమారు 50 బస్తాల బియ్యం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. డివిజన్‌లోని 12 మండలాలతో పాటు తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో కూడా వ్యాపారులు బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఈ పాస్‌ విధానం వచ్చినా అక్రమాలు ఆగటం లేదు. బయోమెట్రిక్‌ విధానంలో డీలర్లు కార్డుదారుల నుంచి వేలిముద్రలు సేకరిస్తున్నారు.  

అక్రమ రవాణా ఇలా..
మార్కాపురం ప్రాంతంలో కొనుగోలు చేసిన బియ్యాన్ని మార్కాపురం, తర్లుపాడు, కంభం, గిద్దలూరు రైల్వేస్టేషన్‌లలో రైళ్లు, లారీల నుంచి నంద్యాల, అనంతపురానికి చేరుస్తున్నారు. మరికొన్ని బియ్యాన్ని కోస్తా జిల్లాలకు చేర్చి అక్కడి నుంచి పోర్టులకు తరలించి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. రేషన్‌ డీలర్ల నుంచి వ్యాపారులు బియ్యాన్ని కొనుగోలు చేసి పట్టణ శివారు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచి రాత్రి పూట తరలిస్తున్నారు. ఇలా తరలించిన బియ్యాన్ని నంద్యాల, అనంతపురం ప్రాంతాల్లో పాలీష్‌ పెట్టి మళ్లీ సన్న బియ్యంగా ప్రజలకు అమ్ముతున్నారు.  

ఇటీవల నమోదైన కేసులు
గతేడాది జూలై 2వ తేదీన తర్లుపాడు బాలాజీ రైస్‌ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 349 బస్తాల బియ్యాన్ని (ఒక్కో బస్తా 50 కేజీలు) స్వాధీనం చేసుకున్నారు.
గతేడాది జూలై 6న మార్కాపురం పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీ వద్ద ఓ గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 310 బస్తాల రేషన్‌ బియ్యాన్ని, రూ.1.02 లక్షల నగదు, లారీని పోలీసులు సీజ్‌ చేశారు.
జూలై 11న పట్టణ శివార్లలోని ఆర్టీఓ కార్యాలయం వెనుక ఉన్న గోడౌన్‌లో పోలీసులు దాడులు చేసి 485 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గతేడాది జూన్, జూలైల్లో తర్లుపాడు మండలం తుమ్మలచెరువులో అక్రమంగా నిల్వ ఉంచిన 60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఏడాది జనవరి 9వ తేదీ అర్ధరాత్రి ఒకటిన్నర గంట సమయంలో భగత్‌సింగ్‌ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన 500 బస్తాల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  513 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం
పేదలకు అందించాల్సిన రేషన్‌ బియ్యాన్ని ఓ గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచగా విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో జరిగింది. విజిలెన్స్‌ సీఐలు బీటీ నాయక్, అజయ్‌కుమార్, పట్టణ ఎస్‌ఐ కోటయ్యలు పట్టణంలోని కరెంట్‌ ఆఫీసు వెనుక ఉన్న భగత్‌సింగ్‌ కాలనీలోని సబ్బుల ఫ్యాక్టరీపై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 513 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిర్వాహకుడైన పి.హనుమంతురావుపై కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement