దేవరపల్లి : జిల్లాలో రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది. గురువారం ఉదయానికి ఈ పోస్ యంత్రాల్లో డేటాను అధికారులు పూర్తిగా తొలగించారు. ఉదయం రేషన్ దుకాణాలు తెరిచిన డీలర్లు సరుకులు పంపిణీ చేసేందుకు సమాయత్తం కాగా, యంత్రాల్లో కార్డుదారుల వివరాలు, సరుకుల వివరాలు క నిపించలేదు. ‘సరుకుల పంపిణీ నిలుపుదల చేయబడింది. వివరాలకు జిల్లా పౌర సరఫరాల అధికారిని సంప్రదించండి’ అని ఈ పోస్ యంత్రాల్లో కనిపించడంతో కంగుతినడం డీలర్ల వంతయ్యింది.
విషయాన్ని మండల, జిల్లా అధికారుల దృష్టికి డీలర్లు తీసుకెళ్లగా.. తాము చేయగలిగిందేమీ లేదని చేతులెత్తేశారు. ఫలితంగా సరుకుల కోసం రేషన్ దుకాణాల వద్ద కార్డుదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా ప్రయోజనం లేకపోయింది. జిల్లాలో 11 లక్షల 25 వేల పాత కార్డుదారులు ఉండగా, 25 శాతం సరుకులు పంపిణీకి నోచుకోలేదు. కొన్ని మండలాల్లో 60 శాతం మంది కార్డుదారులకు మాత్రమే సరుకులు పంపిణీ అయ్యాయి. డీలర్ల నుంచి అందిన సమాచారం ప్రకా రం కనీసం 2.81 లక్షల కార్డుదారులకు సరుకుల సరఫరా నిలిచిపోయింది.
25వ తేదీ వరకు గడువున్నా.. : ఈ నెలలో రేషన్ డిపోలకు గోదాముల నుంచి సకాలంలో సరుకులు అందలేదు. 10వ తేదీ వరకు బియ్యం, పంచదార డిపోలకు సరఫరా చేస్తూ వచ్చారు. 7వ తేదీ నుంచి చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేయాలని ఆదేశించటంతో డీలర్లు 13 వరకు ఆ పనిలో నిమగ్న మయ్యారు. ఈనెల 14న బియ్యం, పంచదార, కిరోసిన్ పంపిణీ ప్రారంభించారు. 15, 16 తేదీలు సంక్రాంతి సెలవులు కావటంతో సరుకుల పంపిణీ జరగలేదు. 17వ తేదీ నుంచి బియ్యం, పంచదార, కిరోసిన్ పంపిణీ చేయడం మొదలుపెట్టారు. సరుకుల పంపిణీకి 25వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ, గురువారం నుంచి ఈ పోస్ యంత్రాల్లో డేటాను తొలగించడంతో సరుకులు ఉన్నా కార్డుదారులకు పంపిణీ చేయలేని పరిస్థితి తలెత్తింది.
ఈ నెలకు సంబంధించిన సరుకుల పంపిణీ నిలిచిపోయినట్టేనని అధికారులు చెప్పడంతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. మరో 5 రోజులు గడువున్నా, ముందుగానే ఈ పోస్ యంత్రాల్లో సమాచారాన్ని నిలుపుదల చేయడమేమిటని కార్డుదారులు నిలదీస్తున్నారు. డీలర్ల నిల్వలున్నా.. : జిల్లాలో ఇంకా 25 శాతానికి పైగా కార్డుదారులకు బియ్యం, పంచదార, కిరోసిన్ వంటి సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రేషన్ డీలర్ల వద్ద సరుకులు నిల్వ ఉన్నాయి.
అయినా, కార్డుదారులకు పంపిణీ చేయలేని దుస్థితి తలెత్తింది. ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులపైనే ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాల వారికి అవి అందకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. చంద్రన్న సంక్రాంతి పేరిట కానుకలు ఇచ్చి రేషన్ ఎగ్గొట్టారని విమర్శిస్తున్నారు. వినియోగదారులకు పూర్తి స్థాయిలో సరుకులు పంపిణీ కాకపోవటంతో రేషన్ డిపోల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. మిగిలిపోయిన సరుకుల ఆధారంగా ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయాల్సిన సరుకుల్లో తగ్గించి అలాట్‌మెంట్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో సరుకులు ఇచ్చే అవకాశం లేదంటున్నారు.
వారం రోజులుగా తిరుగుతున్నా..
రేషన్ సరుకుల కోసం వారం రోజులుగా తిరుగుతున్నాను. మెషిన్లు పనిచేయడం లేదని ఇవ్వలేదు. పండగకు కానుకలు ఇచ్చినప్పుడు బియ్యం,
పంచదార ఇవ్వలేదు. కానుకలు ఇచ్చి బియ్యం, పంచదార ఇవ్వకపోతే మేం
ఏం తినాలి.
- మస్తాన్‌బీ, గోపాలపురం
ఎలా బతకాలి
బియ్యం. పంచదార ఇవ్వకపోతే నెల రోజులు ఎలా బతకాలి. నాలుగు రోజులుగా సరుకుల కోసం తిరుగుతున్నాను. మెషిన్లు పనిచేయటం లేదని సరుకులు ఇవ్వలేదు. ఇప్పుడు వస్తే సరుకుల పంపిణీ మెషిన్‌లో ఆగిపోయిందని చెబుతున్నారు. సరుకులు ఇవ్వకపోతే పస్తు ఉండాల్సిందే.
- కె. లక్ష్మమ్మ, గోపాలపురం
కానుక ఇచ్చి.. రేషన్ ఎగ్గొట్టారు
Published Fri, Jan 22 2016 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM
Advertisement
Advertisement