మండపేట :నిత్యావసర ధరలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం.. పేదలపై తాజాగా మరింత భారం మోపింది. రేషన్ దుకాణాల ద్వారా రాయితీపై సరఫరా చేస్తున్న కందిపప్పు ధరను రూ.50 నుంచి రూ.90కి పెంచేసింది. పెరిగిన ధర ఈ నెల నుంచే అమలులోకి రానుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పంటల సాగుతగ్గిపోతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినప్పటికీ నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకుని నిల్వ చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది.
ఇదే అవకాశంగా కొందరు ఉన్న సరుకును నల్లబజారుకు తరలించి, ధరలు పెంచేసి, సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో పప్పు దినుసులు, చింతపండు, ఎండుమిర్చి, వంట నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు భగ్గుమంటూండటంతో పేద, మధ్యతరగతివారి జీవనం దుర్భరంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కిలో కందిపప్పు ధర రూ.200కు చేరిపోయింది. రూ.140కే కిలో కందిపప్పు అందిస్తున్నట్టు అధికారులు ప్రకటించినా అది ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. ధరల నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ భారాన్ని పేదలపై మోపుతూ నిర్ణయం తీసుకుంది. కొరత పేరిట చౌక దుకాణాల ద్వారా రాయితీపై కిలో రూ.50కి అందిస్తున్న కందిపప్పు ధరను రూ.90కి పెంచింది.
జిల్లాలో 14,10,206 తెల్లరేషన్ కార్డులు, 1,523 అన్నపూర్ణ, 89,145 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీరికి 2,643 రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. వీరికి 1,509 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. కాగా పెరిగిన ధర మేరకు ఒక్కో కార్డుదారునిపై రూ.40 అదనపు భారం పడనుంది. దీని ప్రకారం కార్డుదారులపై సుమారు రూ.6 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం మోపింది. నవంబరు నెలకుగానూ ఇప్పటికే కిలో రూ.50 చొప్పున కొందరు డీలర్లు డీడీలు తీయగా, కందిపప్పు ఇంకా రేషన్ దుకాణాలకు చేరలేదు. ఈపోస్ మిషన్‌లో అందించే సరుకుల జాబితా నుంచి కందిపప్పును తొలగించారు. పెరిగిన ధర మేరకు ప్రభుత్వం సాప్ట్‌వేర్‌లో సాంకేతిక మార్పులు చేసి కందిపప్పు సరఫరాకు చర్యలు తీసుకోవచ్చునని అధికారులు అంటున్నారు. ఏదేమైనా రాయితీ కందిపప్పు ధరను ప్రభుత్వం పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేదలపై పెనుభారం
Published Sat, Nov 7 2015 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM
Advertisement