ఏఎల్‌ఏగా రవీంద్రనాథ్‌కు పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రాష్ట్ర విభాగం న్యాయ సలహాదారు (డీఎల్‌ఏ) బళ్లా రవీంద్రనాథ్‌కు పదోన్నతి లభించింది. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం స్పెషల్ క్రైమ్స్ విభాగం అదనపు న్యాయ సలహాదారు (ఏఎల్‌ఏ)గా ఆయన నియమితులయ్యారు. ప్రస్తుతం రవీంద్రనాథ్ బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్ విభాగాల న్యాయ సలహాదారుగా పనిచేస్తున్నారు.
ఏఎల్‌ఏగా ఈ నెల 30న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 1958 జూలై 9న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో రవీంద్రనాథ్ జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీలో 1982లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. 1983-91 మధ్య కాకినాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి.. 1992లో సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎంపికయ్యారు. 1997లో సీనియర్ పీపీగా, 2008లో డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ (డీఎల్‌ఏ)గా పదోన్నతి పొందారు.
నకిలీ స్టాంపుల కుంభకోణంతోపాటు సత్యం కంప్యూటర్స్, ఓఎంసీ, ఎమ్మార్ తదితర ముఖ్యమైన కేసుల్లో ప్రాథమిక దశలో వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే, రాష్ట్ర సీబీఐ విభాగంలో తమిళనాడుకు చెందిన అధికారుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు అన్ని కీలక విభాగాల అధిపతులుగా తమిళనాడుకు చెందిన వారే ఉన్నారు.