Sakhinetipalli
-
తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సముద్రతీరాన పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోంది. విశాఖ సరిహద్దు కాకినాడ జిల్లా తొండంగి మండలం మొదలు కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వరకూ గల తీర ప్రాంతంలో పారిశ్రామికీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. సహజ వనరులకు లోటు లేని తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి. పెట్రో, పెట్రో ఆధారిత పరిశ్రమలు, ఔషధాలు, బొమ్మలు తయారీ, కాకినాడ గేట్‌వే పోర్టు, వంట నూనెలు, ఆక్వా శుద్ధి ప్లాంట్లు, హేచరీలు, బల్క్ డ్రగ్ పార్క్...ఇలా పలు పరిశ్రమలు 120 కిలోమీటర్లు సముద్ర తీరంలో ఏర్పాటవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కోవిడ్–19 మహమ్మారితో మొదటి రెండేళ్లూ గడచిపోయాయి. ఉన్న పరిశ్రమల్లో ఉత్పత్తిలేక మందగించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికే సమయం సరిపోయింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయడానికి వీలు కాని పరిస్థితి. కోవిడ్ నుంచి కోలుకుని పరిస్థితులు చక్కబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరళీకరించిన పారిశ్రామికీకరణ విధానాలు దిగ్గజాలైన పారిశ్రామికవేత్తలను సైతం ఆకర్షిస్తున్నాయి. సీఎం దూరదృష్టితో తూర్పు తీరంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక పోకస్ పెట్టారు. జిల్లాల పునర్విభజన తరువాత ఏ జిల్లాకు ఆ జిల్లా పారిశ్రామిక ప్రగతికి ప్రణాళికలతో ముందుకు కదులుతున్నాయి. పారిశ్రామిక కారిడార్‌కు ఊతం తీరంలో గతంలో ప్రతిపాదించిన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ప్రభుత్వ విధానాలు ఊతమిస్తున్నాయి. కారిడార్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా స్థానం ఉండటం పారిశ్రామికీకరణకు సానుకూలమవుతోంది. గత పాలకుల హయాంలో వివాదాస్పదంగా మారిన కాకినాడ ఎస్ఈజెడ్ భూ సేకరణను సీఎం జగన్మోహన్రెడ్డి చొరవతో చక్కదిద్దుతున్నారు. మరోపక్క కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. బలవంతంగా సేకరించిన భూములను రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయడమనే ప్రక్రియ దేశంలోనే తొలిసారి కాకినాడ సెజ్‌లో ప్రారంభమైంది. సీఎం సాహసోపేతమైన తాజా నిర్ణయంతో తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు నమ్మకంతో ముందుకు వస్తున్నారు. కాకినాడ తీరంలో ఒక వెలుగు ఆదిత్యబిర్లా, అరవిందో వంటి పారిశ్రామక దిగ్గజాలు తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. తొండంగి మండలం కేపీ పురం–కోదాడ మధ్య బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక రాష్ట్రాలు పోటీపడినప్పటికీ రాష్ట్ర ప్రతిపాదనకు ఆమోదించడం, అదీ కూడా మన కాకినాడ జిల్లాలో ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన క్రమంలోనే ఈ ప్రాజెక్టు లభించడం శుభసూచకంగా అభివర్ణిస్తున్నారు. ఈ పార్క్ ఏర్పాటు ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి. వచ్చే ఎనిమిదేళ్లలో ఈ పార్కులో రూ.46,400 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతూ సుమారు 15వేల మంది యువతకు అవకాశాలు లభించనున్నాయి. ఈ పార్కు ఏర్పాటుతో రాష్ట్రంలోనే ఫార్మా రంగంలో కాకినాడ తీరం ఒక వెలుగు వెలగనుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చురుగ్గా మేజర్ హార్బర్ పనులు కాకినాడ తీరంలో ఉప్పాడలో మినీ హార్బర్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ.50 కోట్లతో ప్రణాళిక సిద్దం చేశారు. ఆయన హఠాన్మరణం తరువాత పాలకులు ఐదేళ్లపాటు ఈ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ మినీ హార్బర్ స్థానే మేజర్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ పనులు తీరంలో వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.422 కోట్లు కేటాయించారు. కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని 25 గ్రామాల్లో 50 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్థి చేకూర్చే ఈ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సముద్ర వేటపై ఆధారపడి జీవితాలను నెట్టుకొచ్చే మత్స్యకారులు ఇంతవరకు వేటాడాక బోటు నిలపడానికి సరైన హార్బర్ కూడా ఉండేది కాదు. ఈ సమస్యను ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్రలో గుర్తించారు. 2,500 బోట్లు వేటాడాక సరుకును దించేందుకు హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనుబంధంగా మత్స్య ఉత్పత్తుల నిల్వ కోసం హార్బర్ సమీపాన 980 టన్నులతో గిడ్డంగులు, 40 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ఐస్ప్లాంట్లు కూడా సిద్ధవమతున్నాయి. తీరం వెంబడి... ► తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన తదితర తీర ప్రాంత మండలాల్లో సుమారు 20 రొయ్యల శుద్ధి కర్మాగారాలు కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ కర్మాగారాల్లో 10 నుంచి 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ► అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం భలభద్రపురంలో ఆదిత్యబిర్లా తొలి దశలో రూ.841 కోట్ల అంచనా వ్యయంతో గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉత్పత్తి ఇటీవలనే ప్రారంభించింది. ఈ కర్మాగారం ద్వారా 1203 మందికి జీవనోపాధి లభిస్తోంది. ► గతంలో చంద్రబాబు పాలనలో గ్రాసిమ్ కర్మాగారం ఏర్పాటు వివాదాలతో అటకెక్కగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవతో ఆదిత్య బిర్లా ఎంతో నమ్మకంతో ముందుకు వచ్చి ఉత్పత్తిని ప్రారంభించింది. ► తొండంగి మండలం పెరుమాళ్లపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల మధ్య సుమారు రూ.2000 కోట్లతో గేట్‌వే ఆఫ్ కాకినాడ పోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా గ్రూప్ అరవిందో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడున్న రెండు పోర్టులకు అదనంగా కాకినాడ గేట్‌వే పోర్టుకు ఇప్పటికే తుని నియోజకవర్గం తొండంగి మండలంలో పునాదిరాయి పడింది. ► కాకినాడ ఎస్ఈజడ్లో రూ.90 కోట్లతో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ గత ఏప్రిల్‌లోనే ఉత్పత్తి ప్రారంభించింది. (క్లిక్: సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే కీలకంగా ఏపీ) ► పెద్దాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రూ.70 కోట్లతో నిర్మాణంలో ఉన్న దేవీ సీఫుడ్స్‌కు చెందిన ఆక్వా సీడ్ కంపెనీ త్వరలో అందుబాటులోకి రానుంది. ళీ తుని నుంచి అంతర్వేది వరకు పలు ఐస్ఫ్యాక్టరీలు, థర్మాకోల్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. నమ్మకంతో వస్తున్నారు తీర ప్రాంతంలో ఏర్పాటవుతోన్న పరిశ్రమలతో యువతకు ఉజ్వల భవిష్యత్ లభించనుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పాలకులు రైతులపై అక్రమంగా కేసులు బనాయించి బలవంతంగా భూములు లాక్కుని ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. భూములతో వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదించారు. అందుకే పారిశ్రామికవేత్తలు వెనుకంజ వేశారు. ఇందుకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దూరదృష్టి, అతనిపై నమ్మకం ఉండటంతోనే పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వస్తున్నాయి. తుని నియోజకవర్గంలో రెండువేల ఎకరాలను బల్క్ డ్రగ్ పార్కుకు కేటాయిస్తున్నాం. కోదాడ, పెరుమాళ్లపురం గ్రామాల్లో బల్క్ డ్రగ్ పార్కుకు భూమిని కేటాయిస్తారు. – దాడిశెట్టి రాజా, రోడ్లు, భవనాలు శాఖా మంత్రి మత్స్యకారుల అభివృద్దికి పెద్దపీట ప్రజా సంకల్పయాత్రలో కాకినాడలో నిర్వహించిన మత్స్యకారుల సమ్మేళనంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మామీని అధికారంలోకి రాగానే అమలు చేశారు. సుమారు 25 ఏళ్లుగా కొత్తపల్లి, తొండంగి మండలాల మత్స్యకారులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు పరిష్కారం చూపించారు. మినీ హార్బర్ నిర్మించాలని మత్స్యకారులు అడిగితే ఏకంగా మేజర్ హార్భర్ నిర్మాణంకు సీఎం చర్యలు తీసుకోవడం ఒక చారిత్రక నిర్ణయం. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది సాదించడానికి మత్స్యకారుల అభ్యున్నతికి మేజర్ హార్భర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. –పెండెం దొరబాబు, ఎమ్మెల్యే పిఠాపురం -
వామ్మో: 25 కిలోల కచ్చిడి చేప రూ. 2.90 లక్షలా?
తూర్పుగోదావరి జిల్లా పల్లిపాలెం చేపల రేవులో 25 కేజీలున్న మగ కచ్చిడి చేపను నర్సాపురానికి చెందిన పాటదారుడు రూ.2.90 లక్షలకు దక్కించుకున్నాడు. మగ చేప బంగారు వర్ణంతో ఉండటంతో దీనిని బంగారు చేప అని కూడా పిలుస్తారు. ఈ చేప గాల్‌బ్లాడర్‌ను ఆపరేషన్ సమయంలో కుట్లు వేసే దారం తయారీలో, బలానికి వాడే మందులు తయారీలోనూ ఉపయోగిస్తారు. అందుకే ఈ చేపకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఖరీదైన వైన్ తయారీలోనూ ఈ చేప శరీర భాగాలను వినియోగిస్తారట. అందుకే ఈ కచ్చిడి చేపను గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. – సఖినేటిపల్లి -
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవలో సజ్జల
-
ఎస్బీఐ బ్రాంచ్‌లో భారీ కుంభకోణం
సాక్షి, తూర్పుగోదావరి : సఖినేటిపల్లి ఎస్బీఐ బ్రాంచ్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. బంగారం రుణాలపై సుమారు అయిదు కోట్ల వరకూ స్వాహా చేసినట్లు సమాచారం అందింది. అదే బ్యాంకులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ భారీ స్కాంకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇతనికి మరో ఉద్యోగి సహకరించినట్లు కూడా సమాచారం. అయితే ఖాతాదారులు బంగారం విడిపించుకునే క్రమంలో సదరు ఉద్యోగి జాప్యం చేయడంతో బండారం బయట పడింది. దీనిపై స్పందించిన బ్రాంచ్ మేనేజర్.. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు, స్కాంపై విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. -
అయ్యో! కొడుకా..
ఆ కుటుంబాలకు ఆ యువకులే ఆధారం.. తల్లిదండ్రుల ఆశలన్నీ వారిపైనే.. ఓ యువకుడు తన స్నేహితుడితో కలసి శుభకార్యానికి వెళుతుండగా కారు అదుపుతప్పి పంట కాలువలో పడి మృత్యువాత పడితే.. మరో యువకుడు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం వద్ద, జగ్గంపేట మండలం రామవరం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. 25 ఏళ్ల యువకుల జీవితాలను చిదిమేశాయి. శుభకార్యానికి వెళ్లి.. మలికిపురం: సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదంలో మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామానికి చెందిన నక్కా హరీష్(25) అనే యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నక్కా హరీష్ స్నేహితుడితో కలసి కారులో ఆదివారం రాత్రి సఖినేటిపల్లి మండలం అప్పనరాముని లంక గ్రామంలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో టేకిశెట్టిపాలెం వచ్చే సరికి కారు అదుపు తప్పి పి.గన్నవరం ప్రధాన పంట కాలువలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న గుర్రం జాన్ వెస్లీ తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పట్టాడు. హరీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. (చదవండి: ఉరితాడు కోసి.. ఊపిరి పోసి ) ఒక్కగానొక్క కొడుకు.. గుడిమెళ్లంక గ్రామానికి చెందిన నక్కా తులసీరావు, నాగమణికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు హరీష్ ఉన్నారు. సుమారు పదేళ్ల క్రితమే భర్త తులసీరావు చనిపోవడంతో నాగమణి విదేశాలకు వెళ్లి ఉపాధి పొందుతూ కుటుంబ పోషణ చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసింది. కుమారుడు హరీష్‌ను ఎంసీఏ చదివించింది. భర్త చని పోయినా కుమారుడు కుటుంబానికి అండగా ఉంటాడని ఆశ పడిన ఆ తల్లి ఆశలు అడియాసలయ్యాయి. కుమారుడు మరణ వార్త తెలుసుకున్న నాగమణి కువైట్ నుంచి దుఃఖంతో స్వస్థలం బయల్దేరింది. కాలువలో పడిన కారు మృతుడు నక్కా హరీష్ రామవరంలో కారు ఢీకొని.. జగ్గంపేట: జాతీయ రహదారి–16పై జగ్గంపేట శివారు భగత్‌సింగ్ నగర్ వద్ద కారు ఢీ కొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. జగ్గంపేట ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళుతున్న కియో కారు జగ్గంపేట శివారు భగత్ సింగ్ నగర్ వద్దకు వచ్చేసరికి మోటారు సైకిల్‌పై రోడ్డు దాటుతున్న రామవరానికి చెందిన ఏడాకుల మధుబాబు(25)ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్ నుజ్జునుజ్జుయ్యి, కారు ముందుభాగం కూడా బాగా దెబ్బతింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి జగ్గంపేట ఎస్సై రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు యజమానిపై కేసు నమోదు చేశారు. కుటుంబానికి అతడే ఆధారం మధుబాబు ట్రాక్టర్ డ్రైవర్. కుటుంబానికి అతడే ఆధారం. టవర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మధుబాబు తల్లితోపాటు టవర్ కాలనీలో నివాస ముంటున్నాడు. అతడి తండ్రి హైదరాబాద్‌లో చిన్న కంపెనీలో చిరు ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడి మధుబాబే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వివాహం చేయాలని భావిస్తున్న తరుణంలో మృత్యువాత పడ్డాడని కుటుంబ సభ్యులు బోరున విలపించడం అందరిని కలిచివేసింది. రోజు ట్రాక్టర్ పై వెళ్లే వాడని, ఈ రోజు పనిలేదని తిరిగి వచ్చి జగ్గంపేట వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు విలపించారు. -
బిక్కుబిక్కుమంటూ గోదావరిలోనే..
సాక్షి, నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం మాధవాయిపాలెం రేవు వద్ద గోదావరి నదిలో గురువారం రాత్రి పంటు నిలిచిపోయింది. పంటులో ఆయిల్ అయిపోవడంతో చిమ్మచీకటిలో గోదావరి మధ్యలో పంటు నిలిచిపోయింది. ఆ సమయంలో పంటుపై 93 మంది ప్రయాణికులు, రెండు కార్లు ఉన్నాయి. సముద్రపు పోటు కారణంగా పంటు అదుపుతప్పి లాకురేవు వైపు వెళ్లిపోయింది. చివరకు అక్కడ మత్స్యకారులు కట్టిన వలకట్ల వద్ద నిలిచింది. రాత్రి 8 గంటల సమయంలో పట్టణంలోని మాధవాయిపాలెం రేవు నుంచి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవుకు పంటు బయల్దేరింది. అయితే, ఆయిల్ లేని కారణంగా గోదావరి మధ్యలోకి వెళ్లగానే పంటు నిలిచిపోయింది. సముద్ర పోటుతో పంటు వేరే మార్గంలోకి వెళ్లి పోతుండటంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. రెండున్నర గంటలు గోదావరిలోనే.. పంటు మధ్యలో నిలిచిపోవడంతో అందులో ఉన్న మహిళలు రక్షించండంటూ పెద్దగా అరిచారు. బంధువులకు సెల్ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వారు కూడా పెద్దసంఖ్యలో రేవు వద్దకు చేరుకున్నారు. నరసాపురం ఆర్డీవో ఏఎన్ సలీంఖాన్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రయాణికులతో ఫోన్లో మాట్లాడారు. రాత్రి 10.15 గంటలకు ఆయిల్‌ను వేరే పడవలో తీసుకెళ్లి పంటును అవతల గట్టుకు చేర్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. రేవు నిర్వహణపై చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. తరచూ ఇలాగే జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. అసలు ఆయిల్ సమస్య కాదని, ఫిట్‌గా లేని పంటును ఉపయోగించారనే వార్తలు కూడా వస్తున్నాయి. పంటులో లైఫ్ జాకెట్లు ఏమీలేవు. పంటులో 50 మందికి మించి ఎక్కించడానికి అనుమతిలేదు. కానీ, పరిమితికి మించి 90 మందికి పైగా జనాన్ని, 2 కార్లను అదీ రాత్రివేళ అనుమతించారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అడుతున్న రేవు నిర్వాహకులపై మరి ఈ ఘటనతోనైనా చర్యలు తీసుకుంటారా? లేదా అనేది చూడాలి. -
గోదావరిలో కృష్ణా జిల్లా వాసి గల్లంతు
సఖినేటిపల్లి : తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలోని ఫెర్రీ ఘాట్‌లో కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఓ యువకుడు శనివారం గల్లంతయ్యాడు. గుడివాడకు చెందిన కామరాజు దీక్షిత్ (18) కుటుంబ సభ్యులతో కలసి శనివారం సఖినేటిపల్లికి వెళ్లారు. దీక్షిత్ తండ్రి పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు గోదావరిలో దిగారు. వెంట దీక్షిత్, మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఈ క్రమంలో దీక్షిత్ ప్రమాదవశాత్తు గోదావరి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
తడిసి ముద్దయిన తూర్పు
మొన్నటి వరకూ పగటివేళ నిప్పులు చెరిగిన ఆకాశం.. ఇప్పుడు పగలూరాత్రీ తేడా లేకుండా నీటిధారలు కురిపిస్తోంది. మొన్నటి వరకూ వడగాలి జడిపిస్తే.. ఇప్పుడు జడివాన వణికిస్తోంది. వరుసగా రెండోరోజూ కురిసిన వర్షంతో జిల్లా తడిసి ముద్దవుతోంది. పిఠాపురం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా అంతటా వానలు పడుతూనే ఉన్నారుు. ఓ వైపు కడలి అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండగా, మరోవైపు కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నారుు. పలుచోట్ల జనజీవనానికి అంతరాయం కలిగే స్థారుులో వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ, కోనపాపపేట, సఖినేటిపల్లి మండలం అంతర్వేది తదితర ప్రాంతాల్లో కడలి అలలు విరుచుకుపడడంతో తీరం కోతకు గురవుతోంది. కాకినాడ- ఉప్పాడ బీచ్‌రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సముద్రంలో చేపల వేటపై తాత్కాలిక నిషేధం విధించిన అధికారులు చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసారు. జిల్లావ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాలలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలతో పాటు పలు పట్టణాల్లో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. డ్రెరుునేజీ వ్యవస్థ లోపభూరుుష్టంగా ఉండడంతో మురుగుకాలువల్లోని రోడ్ల పైకి పొర్లింది. సామర్లకోట, కాకినాడ తదితర ప్రాంతాలలో బస్స్టేషన్లు నీట మునిగాయి. కొత్తపల్లి, పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లలోకి నీరు చేరడంతో రికార్డులు భద్రపరచడానికిపోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఈదురు గాలులకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో అనేక గ్రామాలు శుక్రవారం రాత్రి చీకట్లో మగ్గుతున్నాయి. ఏజెన్సీలో భారీ వర్షం కారణంగా కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తూ రహదారులను ముంచెత్తారుు. ఈ కారణంగా అనేక చోట్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయూరుు. వర్షం కారణంగా కొన్ని చోట్ల అపరాలు, కూరగాయల పంటలు దెబ్బ తిన్నారుు. మొలకెత్తుతూ ఉన్న నారుమడులకు కూడా ఈ వర్షం నష్టమేనని రైతులు అంటున్నారు. కాగా వర్షం కొన్ని రకాల వాణిజ్యపంటలకు మేలేనంటున్నారు. -
వందనం.... ప్రేమ సందనం
సఖినేటిపల్లి : ముఖమే 'లవ్ సింబల్' లా ఉన్న ఈ విలక్షణ పక్షి గురువారం తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వీవీమెరకలో దర్శనమిచ్చింది. గుంపుగా దాడి చేస్తున్న కాకుల మధ్య ఏకాకిగా, నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ పక్షి ఆదర్శ రైతు గంటా శేఖర్‌కి పొలంలో కనిపించింది. ఆయన కాకులను తరిమి, ఆ పక్షిని ఇంటికి తెచ్చి 'ప్రేమ'గా సపర్యలు చేయటంతో కోలుకుంది. ఇంతకీ ఆ పక్షి పేరు ఏంటనేది తెలియాల్సి ఉంది. -
ఏఎల్‌ఏగా రవీంద్రనాథ్‌కు పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రాష్ట్ర విభాగం న్యాయ సలహాదారు (డీఎల్ఏ) బళ్లా రవీంద్రనాథ్‌కు పదోన్నతి లభించింది. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం స్పెషల్ క్రైమ్స్ విభాగం అదనపు న్యాయ సలహాదారు (ఏఎల్ఏ)గా ఆయన నియమితులయ్యారు. ప్రస్తుతం రవీంద్రనాథ్ బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్ విభాగాల న్యాయ సలహాదారుగా పనిచేస్తున్నారు. ఏఎల్‌ఏగా ఈ నెల 30న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 1958 జూలై 9న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో రవీంద్రనాథ్ జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీలో 1982లో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. 1983-91 మధ్య కాకినాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి.. 1992లో సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎంపికయ్యారు. 1997లో సీనియర్ పీపీగా, 2008లో డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ (డీఎల్ఏ)గా పదోన్నతి పొందారు. నకిలీ స్టాంపుల కుంభకోణంతోపాటు సత్యం కంప్యూటర్స్, ఓఎంసీ, ఎమ్మార్ తదితర ముఖ్యమైన కేసుల్లో ప్రాథమిక దశలో వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే, రాష్ట్ర సీబీఐ విభాగంలో తమిళనాడుకు చెందిన అధికారుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు అన్ని కీలక విభాగాల అధిపతులుగా తమిళనాడుకు చెందిన వారే ఉన్నారు. -
వంతెన పనులను అడ్డుకుంటున్న ఎంపీ
సఖినేటిపల్లి, న్యూస్‌లైన్ :సఖినేటిపల్లి, నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి నదిపై మంజూరైన వంతెన పనులను అమలాపురం ఎంపీ హర్షకుమార్ కావాలని పనిగట్టుకుని ఆపారని రాజోలు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు అల్లూరు కృష్ణంరాజు ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. ఆదివారం సఖినేటిపల్లిలో ఆయన స్వగృహంలో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం పర్యటన వల్ల ముంపు బాధిత కుటుంబాలకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. సీఎం బాధితులకు తగిన సాయం ప్రకటించకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి హయాంలో ముంపు బాధితులకు వెంటనే సాయం అందజే సినట్టు ఆయన స్పష్టం చేశారు. జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించడమే కిరణ్‌కుమార్ రెడ్డి పనిగాపెట్టుకున్నారని కృష్ణంరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు లోపాయికారిగా కుమ్మక్కయ్యారన్నారు. ఇటీవల ఖమ్మం పర్యటనలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను అడ్డుకుని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడుకు అనుమతివ్వడం దీనికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన వె ంటనే నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమంగా జగన్ చేతులుమీదుగా వంతెన పనులను ప్రారంభింపజేస్తామని ఆయన వెల్లడించారు. కేంద్రంలో వైఎస్సార్ సీపీ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నియోజకవర్గంలో సుమారు 45 వేల ఎకరాల్లో వరి పూర్తిగా దెబ్బతిందని, పలు కాలనీలు ఇప్పటికీ చెరువులుగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. పార్టీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 29 కాలనీలను ముంపునీరు ముంచెత్తడం వల్ల 10వేల మంది నిరాశ్రయులయ్యారని ఆయన అన్నారు. ప్రభుత్వం బాధితులకు సాయం అందించలేదని ఆయన తెలిపారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కుచ్ఛర్లపాటి సూర్యనారాయణ రాజు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అల్లూరు రంగరాజు, మలికిపురం, మామిడికుదురు మండల శాఖల అధ్యక్షులు యెనుముల నారాయణస్వామి, బొలిశెట్టి భగవాన్, సఖినేటిపల్లి, మలికిపురం గ్రామ శాఖల అధ్యక్షులు నల్లి బాలరాజు, గంటా ప్రకాశరావు, చింతలమోరి సర్పంచ్ కారుపల్లి విజయమోహన్, గ్రామ మాజీ సర్పంచ్ బళ్ల నోబుల్ ప్రభాకర్, నాయకులు బెల్లంకొండ సూరిబాబు, గొల్ల చంటిబాబు, గెడ్డం తులసీభాస్కర్, అడబాల పద్మకేశవరావు పాల్గొన్నారు.