సాక్షి, నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం మాధవాయిపాలెం రేవు వద్ద గోదావరి నదిలో గురువారం రాత్రి పంటు నిలిచిపోయింది. పంటులో ఆయిల్ అయిపోవడంతో చిమ్మచీకటిలో గోదావరి మధ్యలో పంటు నిలిచిపోయింది. ఆ సమయంలో పంటుపై 93 మంది ప్రయాణికులు, రెండు కార్లు ఉన్నాయి. సముద్రపు పోటు కారణంగా పంటు అదుపుతప్పి లాకురేవు వైపు వెళ్లిపోయింది. చివరకు అక్కడ మత్స్యకారులు కట్టిన వలకట్ల వద్ద నిలిచింది. రాత్రి 8 గంటల సమయంలో పట్టణంలోని మాధవాయిపాలెం రేవు నుంచి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవుకు పంటు బయల్దేరింది. అయితే, ఆయిల్ లేని కారణంగా గోదావరి మధ్యలోకి వెళ్లగానే పంటు నిలిచిపోయింది. సముద్ర పోటుతో పంటు వేరే మార్గంలోకి వెళ్లి పోతుండటంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు.
రెండున్నర గంటలు గోదావరిలోనే..
పంటు మధ్యలో నిలిచిపోవడంతో అందులో ఉన్న మహిళలు రక్షించండంటూ పెద్దగా అరిచారు. బంధువులకు సెల్‌ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో వారు కూడా పెద్దసంఖ్యలో రేవు వద్దకు చేరుకున్నారు. నరసాపురం ఆర్డీవో ఏఎన్ సలీంఖాన్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రయాణికులతో ఫోన్‌లో మాట్లాడారు. రాత్రి 10.15 గంటలకు ఆయిల్‌ను వేరే పడవలో తీసుకెళ్లి పంటును అవతల గట్టుకు చేర్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. రేవు నిర్వహణపై చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి.
తరచూ ఇలాగే జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. అసలు ఆయిల్ సమస్య కాదని, ఫిట్‌గా లేని పంటును ఉపయోగించారనే వార్తలు కూడా వస్తున్నాయి. పంటులో లైఫ్ జాకెట్లు ఏమీలేవు. పంటులో 50 మందికి మించి ఎక్కించడానికి అనుమతిలేదు. కానీ, పరిమితికి మించి 90 మందికి పైగా జనాన్ని, 2 కార్లను అదీ రాత్రివేళ అనుమతించారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అడుతున్న రేవు నిర్వాహకులపై మరి ఈ ఘటనతోనైనా చర్యలు తీసుకుంటారా? లేదా అనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment