సాక్షి, కొవ్వూరు(పశ్చిమ గోదావరి) : అమ్మాయికి టీసీఎస్‌లో మంచి ఉద్యోగం. నెలకు రూ.లక్ష జీతం. కొడుకు ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇంకేముంది కూతురి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నారు. రూ.లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు రీ మోడలింగ్ కూడా చేయించారు. అంతలోనే వారి ఆశలు అడియాసలయ్యాయి. కరోనా మహమ్మారి రూపంలో వచ్చిన మృత్యువు ఆ కుటుంబాన్ని మింగేసింది. పశివేదల గ్రామానికి చెందిన పరిమి వెంకట నరసింహరావు (నరసయ్య) ఈనెల 16న కోవిడ్‌కు చికిత్స పొందుతూ మృతి చెందారు.
దీంతో ఆయన కుటుంబ సభ్యులు మూడు రోజులుగా మనస్తాపానికి గురయ్యారు. భార్య సునీత(41), కుమారుడు ఫణికుమార్(25), కుమార్తె లక్ష్మి అపర్ణ(23) మంగళ వారం రాత్రి 11 గంటల సమయంలో గోదావరిలోకి దూకడంతో గల్లంతయ్యారు. ఇంటి నుంచి ముగ్గురూ కారులో బయలుదేరి రోడ్డు కం రైలు వంతెనపైకి చేరుకుని నదిలోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు స్వాధీనం చేసుకున్నారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు, బంధువులు నది వెంబడి గాలిస్తున్నారు.
అసలేం జరిగిందో..!
ఈనెల 7న నరసయ్యకు జ్వరం వచ్చింది. స్థానిక ఆర్‌ఎంపీతో వైద్యం చేయించుకున్నారు. తొలుత సీజనల్ ఫీవర్‌గా భావించారు. ఎంతకీ తగ్గకపోవడంతో ఈనెల 14న సీటీ స్కాన్ చేయించారు. కరోనా సోకినట్లు గుర్తించారు. రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించారు. అప్పటికే పరిస్థితి విష మించి నరసయ్య ప్రాణాలొదిలారు. దీంతో బంధువులెవరూ అంత్యక్రియలకు రాలేదు. అప్పటి నుంచి భార్య సునీత, ఇద్దరు పిల్లలు మనోవేదనకు గురయ్యారు. ఫణికుమార్ కర్ణాటకలో మైనింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. లక్ష్మీఅపర్ణ టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు.
ఇద్దరూ విద్యావంతులే. జీవితంలో స్థిరపడిన వారే. అయినా ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికులను కలచివేస్తోంది. నరసయ్య భార్య సునీత పుట్టినిల్లు కొవ్వూరు. దుర్ఘటనతో కొవ్వూరు, పశివేదలల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి సుమారు పదెకరాల పొలం, కొవ్వూరులో విలువైన స్థలాలు ఉన్నట్లు చెబుతున్నారు. నరసయ్య మృతి తర్వాత కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది. ఒకవేళ వీరికి కరోనా లక్షణాలు కనిపించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్డీఓ డి.లక్ష్మారెడ్డి పశివేదల వెళ్లి ఘటనపై ఆరా తీశారు. మృతుడు నరసయ్య బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేవీ రమణ కేసు నమోదు చేశారు.
ఇంటిలో లేఖ :
నరసయ్య ఇంట్లోని లక్ష్మి అపర్ణ డైరీలో ఓ లేఖ పోలీసులకు లభ్యమైంది. ఆ లేఖలో ‘మా అందరి కోరిక నిహారిక ఓణీల ఫంక్షన్ బాగా చేయాలి. దొరబాబు మావయ్య మమ్మల్ని క్షమించు. తాతయ్య, అమ్మమ్మల ఆరోగ్యం జాగ్రత్త. మా నాన్నని విడిచి మేం ఉండలేకపోతున్నాం.’ అంటూ లక్ష్మి అపర్ణ రాసినట్టు ఉన్న లేఖ లభ్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment