నరసాపురం గోల్డ్ మార్కెట్‌లోని ఓ వీధి.. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన బంగారు నెమలి
సాక్షి, నరసాపురం (ప.గో): అరబ్ దేశాల్లో తయారయ్యే బంగారు ఆభరణాల డిజైన్లు రోజుల వ్యవధిలోనే పసిడి ప్రియుల కోసం అక్కడి గోల్డ్ మార్కెట్‌లో రెడీగా ఉంటాయి. జ్యూయలరీ అయినా, గోల్డ్ బిస్కట్లయినా అక్కడి నుంచే రాష్ట్రంలోని చాలా షాపులకు సరఫరా అవుతుంటాయి. అందుకే నరసాపురం గోల్డ్ మార్కెట్ రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మన జిల్లాలో గోల్డ్ మార్కెట్‌ను శాసిస్తున్న ఈ పట్టణం తెలుగు రాష్ట్రాల్లోనే నాణ్యమైన బంగారం బిజినెస్‌కు పెట్టిందిపేరు.. శతాబ్దం పైనుంచే మేలిమి బంగారాన్ని వినియోగదారులకు అందిస్తున్న ఇక్కడి మార్కెట్ ఉభయ గోదావరి జిల్లాల్లో హోల్‌సేల్ వ్యాపారానికి పేరుపడింది. అందుకే కార్పొరేట్ సంస్థలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో బంగారం మార్కెట్‌లో ఇక్కడి వర్తకులు సత్తా చాటుతున్నారు.
1920లలో బంగారం వ్యాపారానికి పునాది
దాదాపు 100 సంవత్సరాల ముందు నుంచే నరసాపురం బంగారం వ్యాపారానికి ప్రఖ్యాతి గాంచింది. 1920 ప్రాంతంలో ఇక్కడ పసిడి మార్కెట్‌ను ప్రారంభించారు. రాజస్థాన్‌కు చెందిన కొన్ని జైన్ కుటుంబాలు బ్రిటిష్ హయాంలో ఇక్కడ స్థిరపడ్డారు. మొదట తాకట్టు వ్యాపారం ప్రారంభించిన జైన్‌లు తరువాత కాలంలో బంగారం వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో చిన్నగా ప్రారంభమైన వ్యాపారం తరువాత కాలంలో భారీగా విస్తరించింది. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 400 వరకూ జ్యూయలరీ షాపులు ఉండగా ఒక్క నరసాపురంలోనే 150 వరకూ షాపులు ఉన్నాయి.
రిటైల్ వ్యాపారమే కాదు.. ఇక్కడి నుంచి ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని షాపులకు హోల్‌సేల్‌గా బంగారం సప్లయ్ చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జ్యూయలరీ షాపులకు కూడా ఇక్కడి హోల్‌సేల్ వ్యాపారులు బంగారం, వెండి సప్లయ్ చేస్తారు. ఇందులో బిస్కెట్ల నుంచి ఆభరణాల వరకూ అన్నీ ఉంటాయి. పలు కార్పొ రేట్ షాపులకు కూడా ఇక్కడి డీలర్లు సప్లయ్ చేస్తుంటారు. నరసాపురం కేంద్రంగా రోజుకు రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకూ వ్యాపారం సాగుతుంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్లలో వ్యాపారం రోజుకు మరో రూ.2 నుంచి రూ.3 కోట్లు అదనంగా ఉంటుంది.
1980 నుంచి రెడీమేడ్ ఆభరణాల హవా
బ్రిటిష్ వారి హయాంలో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అమల్లో ఉండేది. బంగారు బిస్కెట్ల అమ్మకాలకు కొందరికే అనుమతి ఉండేది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లకు నరసాపురం వచ్చేవారని చెబుతారు. ముఖ్యంగా జల రవాణా సౌలభ్యం ఉండటంతో వేరే రాష్ట్రాల వ్యాపారులు అక్రమంగా ఇక్కడకు బంగారం తరలించి అమ్మకాలు చేసేవారని ప్రచారం ఉంది. ఆ సమయంలోనే నరసాపురం బంగారం వ్యాపారానికి పేరుపడింది. 1980 నుంచి రెడీమేడ్ ఆభరణాల హవా ప్రారంభమైంది. ఆ అవకాశాన్ని కూడా ఇక్కడి వ్యాపారులు అందిపుచ్చుకున్నారు. దుబాయ్, సింగపూర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, అమృత్‌సర్ ఇలా దేశ, విదేశాల్లో తయారయ్యే అధునాతన డిజైన్లు రోజుల వ్యవధిలోనే ఇక్కడి వ్యాపారులు తయారుచేసేవారు.
30 మంది వరకూ హోల్‌సేల్ వ్యాపారులు..
నరసాపురంలో 30మంది వరకూ హోల్‌సేల్ వ్యాపా రులు ఉన్నారు. వీరికి నరసాపురం కేంద్రంగా ముంబై, చెన్నై, కోల్‌కతాలో అనుబంధ కార్యాలయాలు ఉంటాయి. రెండు రాష్ట్రాల్లోని జ్యూయలరీ షాపుల నుంచి వచ్చే ఆర్డర్ల మేరకు బంగారం, వెండి తెప్పిస్తారు. వెండి ఆభరణాల తయారీకి దేశంలో తమిళనాడులోని సేలం ప్రసిద్ది. తరువాత స్థానంలో నరసాపురం ఉండటం మరో విశేషం. మన రాష్ట్రంలో వెండి హోల్‌సేల్ వ్యాపారం నరసాపురం నుంచే పెద్దస్థాయిలో జరుగుతుంది.
గోల్డ్ ఎగ్జిబిషన్‌లో నరసాపురం స్టాల్స్
ప్రతీఏటా జులై–నవంబర్ మాసాల మధ్యలో ముంబైలో ఇంటర్నేషనల్ గోల్డ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. గల్ఫ్ దేశాలతో పాటు లాటిన్ అమెరికా, జర్మనీ నుంచి కూడా కస్టమర్లు ఇక్కడకు వస్తారు. ఈ ఎగ్జిబిషన్‌లో నరసాపురం వ్యాపారుల స్టాల్స్‌కు మంచి క్రేజ్. దీంతో నరసాపురం పసిడి ఖ్యాతి ప్రపంచ గుర్తింపు పొందింది.
జిల్లా ప్రజలతో జైన్‌లు మమేకం
బంగారం వ్యాపారం కోసం గణేష్‌మల్, శాంతలాల్, జోట్‌మల్ నట్‌మల్, గులాబ్‌చంద్ కుటుంబాలు వచ్చాయి. ప్రస్తుతం నరసాపురంలో 94 జైన్ కుంటుంబాలు ఉన్నాయి. జిల్లాలోని మరికొన్ని పట్టణాలకు కూడా వీరి వ్యాపారం విస్తరించింది. బంగారంతో పాటు ఇతర వ్యాపారాల్లో కూడా వీరు స్థిరపడ్డారు.
ఎన్నో ఏళ్ల కష్టం దాగిఉంది
నరసాపురం పేరు చెబితే ఇప్పుడు బంగారం పేరు గుర్తుకువస్తుంది. ఓ వ్యాపారం ద్వారా ఊరికి పేరు రావడం గొప్ప విషయం. దీని వెనుక కొన్ని జైన్ కుటుంబాల సంవత్సరాల కష్టం దాగిఉంది. వేరే రాష్ట్రం నుంచి వచ్చినా కూడా ఇక్కడి ప్రజలతో వారు ఏర్పర్చుకున్న బంధం, సేవా దృక్పథం ఈ ఉన్నతికి కారణం. భవిష్యత్‌లో కూడా ఇది కొనసాగాలి
– సీహెచ్ రెడ్డప్ప ధవేజీ, వ్యాఖ్యాత, నరసాపురం
అన్ని డిజైన్లూ దొరుకుతాయి
ఏ మోడల్ ఆభరణం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. అందుకే దూరప్రాంతాల్లో ఉన్న చుట్టాలు కూడా ఎప్పుడైనా బంగారం కొనాలనుకుంటే ఇక్కడకు వచ్చి మా ఇళ్లలో ఉండి కొనుక్కుని వెళతారు. ఫోన్‌లు చేసి బంగారం రేటు ఎంతుందో కనుక్కోమంటారు. ఈ ప్రాంతంలోని అందరి ఇళ్లలోనూ ఇవే అనుభవాలు. బంగారానికి మా ఊరు పెట్టిందిపేరు.
– మేకల కాశీఅన్నపూర్ణ, గృహిణి, నరసాపురం
మా పెద్దల కృషే కారణం
నరసాపురం బంగారం వ్యాపారానికి పేరు రావడానికి కారణం మా పెద్దలు చేసిన కృషే. 1980లో రెడీ మేడ్ ఆభరణాల రాకతో వ్యాపారం బాగా పెరిగింది. దుబాయ్‌లో జరిగే ఇంటర్నేషనల్ గోల్డ్ ఎగ్జిబిషన్‌కు చాలాసార్లు వెళ్లాను. మా ఆభరణాలకు అక్కడ మంచి పేరుంది.
– వినోద్‌కుమార్‌జైన్, నరసాపురం బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment