సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి): బోటు ప్రమాదంలో నరసాపురానికి చెందిన ముగ్గురు గల్లంతుకావడంతో ఈ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. ఘోరం జరిగి రెండురోజులు గడుస్తున్నా ఇంకా వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో బంధువులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారు. నిలువెల్లా కనులై క్షణక్షణం ఉత్కంఠగా నిరీక్షిస్తున్నారు. ప్రమాదంలో గల్లంతైన అమరేశ్వరస్వామి దేవస్థానం ఆలయ ఈఓ వలవల రఘురామ్, గన్నాబత్తుల ఫణికుమార్(బాలు), చెట్లపల్లి గంగాధర్ నివాసాల వద్ద విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదంలో బయటపడ్డ మండల గంగాధర్ కూడా రాజమండ్రిలోనే ఉన్నారు.
మహిళలకు చెప్పకుండా..!
జరిగింది ఘోర ప్రమాదమని గల్లంతైన వ్యక్తుల బంధువుల్లో పురుషులకు మాత్రమే తెలుసు. ఇక వారు సజీవులుగా వస్తారనే నమ్మకం కూడా వారికి లేదు. అయితే గల్లంతైన వ్యక్తుల భార్యాపిల్లలకు, తల్లులకు ఈ విషయం తెలి యదు. ఏదో చిన్న ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో ఉన్నారని పురుషులు ధైర్యం చెబుతున్నారు. పలకరింపులకు ఇళ్లకు జనం వస్తున్నా.. విషయం బయటే చెప్పి లోపల ఏమీ మాట్లాడొద్దని బతి మాలుకోవడం చూపరుల హృదయాలు కలచివేస్తోంది. కారణం గల్లంతైన ముగ్గురూ 40 ఏళ్ల లోపు వయసువారే. చిన్నచిన్న పిల్లలు, తమపై ఆధారపడ్డ తల్లిదండ్రులు ఉన్నవారు. పైగా ఇందులో కొందరు గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు. దీంతో గల్లంతైన వారి నివాసాల వద్ద మాటల్లో చెప్పలేని దయనీయ పరిస్థితి నెలకొంది.
పేపర్లు కంటపడకుండా జాగ్రత్త
వలవల రఘురాం భార్య నాగజ్యోతి, ఇద్దరు పిల్లలు వేడంగి (పుట్టిల్లు)లో ఉన్నారు. చిన్న ప్రమాదం జరిగిందని, రఘురాం వచ్చేస్తారని నాగజ్యోతికి బంధువులు నచ్చచెబుతున్నారు. టీవీ చూడకుండా, పేపర్లు కూడా ఆమె కంట పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇక పట్టణంలోని ఇంట్లో రఘురాం తల్లి ఉంది. ఆమె గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. చుట్టాలు, స్నేహితులు ఇళ్లకు రావడంతో ఆమెకు కంగారు పట్టుకుంది. ఏం జరిగింది.. రఘు ఎక్కడ అంటూ మాటమాటకు ఆరాతీస్తోంది. ఆమెను ఓ గదిలో పెట్టి అత్తారింటికి వెళ్లాడు అంటూ చెబుతున్నామని రఘురామ్ స్నేహితుడు చెప్పారు.
తల్లికి తెలీనివ్వకుండా..
చెట్లపల్లి గంగాధర్ ఇంటివద్ద పరిస్థితి మరీ దయనీయం. గంగాధర్‌కు తండ్రిలేడు. బంధువర్గం కూడా పెద్దగా లేదు. వృద్ధురాలైన తల్లి వరలక్ష్మి ఇంటివద్దనే ఉంది. కొడుకు రెండు రోజులుగా ఇంటికి ఎందుకు రాలేదో కూడా ఆమెకు ఇప్పటికీ తెలియదు. చిన్న ప్రమాదమని చెప్పారు. సోదరికి మాత్రం విషయం తెలిసింది. తల్లికి చెప్పకుండా ఆమె గుండెలవిసేలా రోధిస్తోంది.
ఆశగా నిరీక్షిస్తున్న ఫణికుమార్ భార్య
పట్టణంలో ప్రముఖ న్యాయవాది గన్నాబత్తుల వల్లభరావు కుమారుడు ఫణికుమార్ ప్రమాదంలో గల్లంతయ్యాడు. ఇతనికి భార్య, 7 ఏళ్ల కుమారుడు ఉన్నారు. భార్యకు విషయం తెలియదు. చిన్న ప్రమాదమని చెప్పడంతో ఆమె ఆశగా ఎదురుచూస్తోంది. తండ్రి వల్లభరావు కూడా తన కొడుకుకు ఏమీ కాదని వచ్చేస్తాడని విలపిస్తూ నిరీక్షిస్తున్నాడు.
రాజమండ్రిలో పడిగాపులు
గల్లంతైన వారి సమీప బంధువులు, స్నేహితులు కొంతమంది ప్రమాదం వార్త తెలిసిన వెంటనే రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. రాత్రంతా అక్కడే ఉన్నారు. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతుండటంతో తమవారి జాడ తెలుస్తుందని అక్కడే పడిగాపులు కాస్తున్నారు.
చదవండి : గాలింపు కొనసాగుతోంది: ఏపీఎస్‌డీఎమ్‌ఏ
Comments
Please login to add a commentAdd a comment