అయినం సాయి గణేష్, సింగులూరి వెంకటేష్
సాక్షి, నిడదవోలు: సరదాగా గోదారిలో స్నానానికి దిగిన ఇద్దరు యవకులు గల్లంతైన విషాద ఘటన నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో ఆదివారం జరిగింది. పెండ్యాల గ్రామానికి చెందిన సింగులూరి వెంకటేష్ (19), పదో తరగతి చదువుతున్న అయినం సాయి గణేష్ (16)తో పాటు సింగులూరి బాబూరావు, నాయుడు రవీంద్ర, దాసరి అభిరామ్, పారేపల్లి వివేక వర్ధన్‌లు ఆదివారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా నదిలో ఉన్న గోతుల్లో పడి వెంకటేష్, సాయిగణేష్ గల్లంతయ్యారు. గ్రామస్తులు బోట్లు ఏర్పాటు చేసి యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు, కొవ్వూరు ఆర్డీఓ డి.లక్ష్మారెడ్డి, సీఐ కె.స్వామి ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద వివరాలను ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులలో ధైర్యాన్ని నింపారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు నదిలో రాత్రి కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన సింగులూరి నాగేశ్వరరావు కుమారుడు సింగులూరి వెంకటేష్ అయిన దానయ్య కుమారుడు సాయి గణేష్. ఐనం సాయి గణేష్ స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సింగులూరు వెంకటేష్ కూలి పనికి వెళుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు.
ఘటనా స్థలంలో గాలింపు చర్యలు, ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు
ఎమ్మెల్యే పరామర్శ
గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జి. శ్రీనివాసనాయుడు ఆదివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. స్నానానికి దిగి గల్లంతవడం చాలా బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానన్నారు. గాలింపు చర్యలకు ఆటంకం కలగకుండా నదిలో నీటిని క్రమబద్దీకరించాలని ఎమ్మెల్యే ఫోన్‌లో ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment