
తెలంగాణ, సీమాంధ్రలో 12న రీ పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర జిల్లాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 12న రీ పోలింగ్ నిర్వహించాలన్న ఆలోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్టు తెలుస్తోంది. ఏ ఏ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించేది శనివారం ఖరారు కానుంది. ఏ ఏ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం, ఏ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం లేదనే వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికల రూపంలో తెప్పించుకున్నారు.
రీ పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నివేదికలను శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం ఉందనే విషయాన్ని శనివారం ఖరారు చేయనుంది.