ఇసుక రీచ్‌లకు తమ్ముళ్ల గండి
స్వపార్టీ విధానాలనే తెలుగు తమ్ముళ్లు తుంగలో తొక్కుతున్నారు. మహిళలకు అప్పగించిన ఇసుక క్వారీలను చేజిక్కించుకుని ఈజీగా మనీ సంపాదిస్తున్నారు. డ్వాక్రా సమాఖ్యల కళ్లకు గంతలు కట్టి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. లారీల లెక్కన ఇసుక రవాణా చేస్తూ రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇందేమిటని ప్రశ్నిస్తున్న అధికారులకూ ఫలహారాలు పంపుతూ మచ్చిక చేసుకుంటున్నారు. మరో వైపు రీచ్‌ల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి బ్యాంకు డిమాండ్ డ్రాఫ్టులు సైతం విక్రయిస్తూ రెండు చేతులా పోగేసుకుంటున్నారు.
మంగళగిరి
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయడంతోపాటు, డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విధానాలకు ఆ పార్టీ నాయకులే గండికొడుతున్నారు. ఇసుక రీచ్‌లను సొంత చేసుకున్న డ్వాక్రా సంఘాలను పక్కన పెట్టి బోట్స్‌మెన్ సొసైటీల పేరిట టీడీపీ నాయకులే ఇసుక విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో ఇసుక కొనుగోలు భారంగా మారుతోంది.
వివరాల్లోకి వెళితే...
తాడేపల్లి మండలం ఉండవల్లి, తుళ్లూరు మండలం బోరుపాలెం ఇసుక క్వారీ లను ప్రభుత్వం డ్వాక్రా సమాఖ్యలకు అప్పగించింది. పెత్తనం పేరుకు మహిళా సంఘాలదే అయినా వీరి వెనుక ఉంటున్న టీడీపీ నాయకులు అక్రమార్జకు తెరలేపారు.
నదిలో నుంచి ఇసుకను పడవల్లో తీసుకొచ్చి యార్డుల్లో డంప్ చేసే దశలోనే అసలు కథ ప్రారంభమవుతోంది. ఇసుక రవాణా, బోట్స్‌మెన్ సొసైటీల నిర్వహణలో మహిళా సమాఖ్యలకు అవగాహన లేకపోవడాన్ని ఆసరా చేసుకునిటీడీపీ నాయకులు రంగప్రవేశం చేస్తున్నారు. సొసైటీల వెనుక ఉండి ఇసుక రవాణ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కృష్ణా నదిలో నుంచి ఇసుకను బయటకు తెచ్చి డంప్ చేసేందుకు సొసైటీకి ఒక్కో యూనిట్‌కు రూ. 250 చెల్లిస్తున్నారు. యూనిట్ ధరను ప్రభుత్వం రూ. 650 గా నిర్ణయించింది. అందులో రూ. 250 పోనూ మిగిలిన రూ. 400 సీనరేజి రూపం లో ప్రభుత్వానికి చేరాలి.
ఇలా ట్రాక్టర్(మూడు యూనిట్లు) ఇసుకైతే రూ.1950, లారీ అయితే రూ.3,900కు విక్రయించాలి. దీనికి భిన్నంగా ట్రాక్టర్‌కు రూ. మూడు వేలు, లారీకి రూ.ఆరు వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో క్వారీలోనే ఎక్కువ చెల్లిస్తున్న లారీలు, ట్రాక్టర్ల యజమానులు బయట ఇసుక ధర మరింత పెంచి ట్రాక్టర్‌కు రూ.ఐదు నుంచి ఆరు వేలు, లారీ ఇసుక రూ. 9 నుంచి 12 వేలకు విక్రయిస్తున్నారు.
క్వారీలను డ్వాక్రా సమాఖ్యలకు అప్పగించినా ఇసుక ధర తగ్గక పోగా మరింతగా పెరగడంతో కొనుగోలు భారంగా మారింది.
బ్లాక్‌లో బ్యాంకు డీడీలు....
డ్వాక్రా సంఘాలకు అప్పగించిన రీచ్‌ల్లో ఇసుక కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకుల్లో డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ట్రాక్టర్ ఇసుక అయితే రూ 1,950 ,లారీ అయితే రూ, 3,900 బ్యాంకులో చెల్లించి డీడీ తీసుకురావాలి. ఈ విషయం తెలియని చాలా మంది నేరుగా క్వారీల వద్దకు వస్తున్నారు. దీంతో తిరిగి బ్యాంకులకు వెళ్లి డీడీ తెచ్చే సరికి ఎన్ని లారీలు ట్రాక్టర్లు క్యూ లో వుంటాయో అనే ఆందోళనతో కొం తమంది అక్కడే బ్లాక్‌లో డీడీలు కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ముందుగానే ఊహించిన నిర్వాహకులు డీడీలను తీసి బ్లాక్‌లో విక్రయిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం :
డీఆర్‌డీఏ పీడీ ప్రశాంతి
ఇసుక రీచ్‌ల్లో అక్రమాలపై డీఆర్ డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ప్రశాంతిని ‘సాక్షి’ వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనల మేరకు డ్వాక్రా సమాఖ్యలతో ఇసుక విక్రయాలు నిర్వ హిస్తున్నామన్నారు. ఇసుక విక్రయాల్లో సమాఖ్యలతో పాటు సొసైటీలవారు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.