ఖమ్మం, న్యూస్‌లైన్ : ‘ఆరు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చింది. దీనిపై సీమాంధ్ర ప్రజలు రాద్ధాంతం చేస్తున్నారు. మేం శాంతియుతంగా విడిపోదాం అంటుంటే.. వారు యుద్ధం చేయాలంటున్నారు.. యుద్ధమే చేయాలనుకుంటే మేమూ సిద్ధమే’ అని టీఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఖమ్మంలో శుక్రవారం ఆయన విలేకరులతో, టీఎన్జీవోల సభలో మాట్లాడుతూ, మీరు సమ్మె చేయండి.. మీ జీతాలు మీకిప్పిస్తామని సీమాంధ్ర ఉద్యోగులకు ఓ మంత్రి భరోసా ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
చర్చలకు రమ్మని ఏపీఎన్‌జీవో ఉద్యోగులు పిలుస్తున్నారని, విభజన తర్వాతే వస్తామన్నారు. ఏపీఎన్జీవోల వైఖరివల్లే పీఆర్‌సీ అందకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులకు దసరాలోపు 45 శాతం ఇంటీరియం చెల్లించాలని, లేనిపక్షంలో టీజేఏసీ ఆధ్వర్యంలో అక్టోబరులో మహోద్యమం చేపడతామని హెచ్చరించారు. గ్రామీణ వ్యవస్థకు పునాది అయిన గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ తీరు వివక్షతపూరితంగా ఉందని దేవీప్రసాద్ విమర్శించారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల కేంద్ర సంఘం ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. గ్రామ సహాయకులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి, రూ.15 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, విఠల్ తదితరులు మాట్లాడారు.