నెల రోజుల క్రితం వరకు బంగారం ధర రూ.26 వేల నుంచి రూ. 28 వేల వరకే ఉండడంతో చాలా మంది బంగారంపైనే పెట్టుబడి పెట్టారు.
బాన్సువాడ/ కామారెడ్డి, న్యూస్‌లైన్: నెల రోజుల క్రితం వరకు బంగారం ధర రూ.26 వేల నుంచి రూ. 28 వేల వరకే ఉండడంతో చాలా మంది బంగారంపైనే పెట్టుబడి పెట్టారు. దీని ప్రభావం భూములు, ప్లాట్ల కొనుగోళ్లపై పడింది. జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూ ర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పతనావస్థలో ఉంది. ప్లాట్లను విక్రయిద్దామంటే కొనుగోలు చేసే వారే లే రు. జిల్లా కేంద్రంలో ప్రతి రోజూ వందకు పైగా రిజి స్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు సగానికి పడిపోయాయి. బాన్సువాడలో రోజూ 10 నుంచి 20 రిజిస్ట్రేషన్లు జరగగా, ఇప్పుడు 3, 4 రిజిస్ట్రేషన్లకు మించి జరగడం లేదు. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు జోరుగా సాగిన సమయంలో వ్యాపారులకు పెట్టుబడులు ఏడాది లోపే రెట్టింపు అయిన సందర్భాలు ఉన్నాయి.
దీంతో అందరి దృష్టి ఈ రంగంపై పడింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం ఒకే సారి 10, 12 ప్లాట్లను కొనుగోలు చేయడం, 5 నుంచి 10 ఎకరాల వెంచర్లలో భాగస్వాములు కావడం జరిగింది. సుమా రు ఆరు నెలల క్రితం వరకు ప్లాట్ల కొనుగోళ్లు బాగానే సాగాయి. పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరానికి రూ. 50 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ధర పలికాయి. బాన్సువాడ సమీపంలోనే ఎకరానికి రూ.కోటి చొప్పున పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏడు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చారు. వీరితో పాటు మరో ఇద్దరు, ముగ్గురు రియల్టర్లు వెంచర్లను ప్రారంభించారు. దీంతో ప్లాట్ల విక్రయం సందర్భం గా పోటీ పెరిగింది. దీని ప్రభావం ప్లాట్లపై పడింది. రూ. 5వేలకు గజం అమ్మాలని భావించిన రియల్టర్లు ప్రస్తుతం రూ. 3వేలకు అమ్మడానికి సిద్ధమయ్యారంటే పరిస్థితి ఎలా తారుమారయ్యిందో తెలుస్తోంది.
ఈ ధరలకు సైతం ప్లాట్లను కొనుగోలు చేసే వారు కరువయ్యారు. బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఆరు నెలల క్రితం రూ. 8 వేల నుంచి రూ. 9 వేలకు గజం ప్లాట్ ధర ఉండగా, వాటినే ఇప్పుడు రూ. 6 వే ల నుంచి రూ. 7వేలకు అమ్మడానికి సిద్ధమవుతున్నా రు. నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ ప్రాం తంలో రూ.8 వేలకు గజం స్థలం లభించగా, నేడు రూ. 5వేలకు అమ్మడానికి సిద్ధమైనా కొనుగోలు చేసే వారు లేరని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘న్యూస్‌లైన్’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడంతో రియల్టర్లు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలకు చెల్లించలేక అవస్థలు పడు తున్నారు. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డిలో రియల్ దందా ఆర్నెళ్ల క్రితం జోరుగా సాగింది. పట్టణంలోని ప్రధాన కాలనీల్లో గజానికి రూ.10 వేలు పెట్టినా ప్లాట్లు దొరక లేదు. పట్టణానికి రెండు,మూడు కిలోమీటర్ల దూరాన గజం రూ.3 వేల నుం చి రూ. 5 వేలు అమ్మారు. ప్లాట్ల వ్యాపారం జోరుగా సాగడంతో చాలా మంది పెట్టుబడులు పెట్టారు.
అయితే భూముల ధరలు భారీగా పెరగడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. కొనుగోలు చేసేవారు వెనుకడుగు వేస్తుండడంతో భూములపై పెట్టుబడులు పెట్టి న వారు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. అప్పు లు తెచ్చి పెట్టిన పెట్టుబడులు ఆగిపోవడంతో వాటిని సర్దుబాటు చేయలేక, భూమిని అమ్ముకోలేక తలలు పట్టుకుంటున్నారు. వ్యాపార అవసరాల కోసం ఫైనాన్సుల నుంచి, వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి డబ్బును అప్పుగా తీసుకుని దందా చేసేవారు ఎప్పటిలాగే అప్పు అడిగితే ‘అయ్యో ఫైనాన్సులో పదివేలు కూడా నిల్వలేవు’ అనే సమాధానం వస్తున్నట్టు పలువురు తెలిపారు. అప్పులు తెచ్చి భూములు కొనుగోలు చేసి న వారంతా భూమి అమ్ముడుపోక, అప్పులకు వడ్డీలు పెరుగుతుడడంతో లబోదిబోమంటున్నారు.